
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అపూర్వ ఘట్టం. నిరుపేదల నుంచి కోటీశ్వరుల వరకు పెళ్లి జ్ఞాపకాలలో ఓలలాడని వారుండరు. అందుకే ప్రతి ఒక్కరూ బంధు పరివారం, ఆప్తమిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటుంటారు. పెళ్లిలో రకరకాల తంతులు ఉంటాయి. అన్నింటిలోకి అప్పగింతలు ప్రత్యేకం. నూత్న వధువును అత్తారింటికి పంపిస్తూ తమ కూతుర్ని కష్టపెట్టకుండా చూసుకోవాలని వియ్యాలవారికి అప్పగిస్తారు తల్లిదండ్రులు. ఇటువంటి భావోద్వేగ క్షణాలను ఓ నవ వధువు అపూర్వ జ్ఞాపకాలుగా మలుచుకుంది. అప్పగింతలు, ఊరేగింపును విభిన్నంగా జరుపుకుని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన స్నేహ సింఘి సిటీలోని ప్రముఖ కేఫ్ ఓనర్. ఎప్పుడూ వినూత్నంగా ఆలోచించే స్నేహ తన మ్యారేజ్ వేడుకలను విభిన్నంగా చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకునేది. ఇటీవలే పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకున్న స్నేహ.. అప్పగింతల కార్యక్రమం తర్వాత జరిగే ఊరేగింపు (బరాత్) సందర్భంగా తనే కారు నడిపి అతిథులను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను స్నేహ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వెడ్డింగ్ రోజున తాను చేసిన ఈ పని తనకు మరింత ఆనందాన్నిచ్చిందని స్నేహ చెప్పింది.
పెళ్లితంతు ముగిసిన తరువాత ఎరుపు రంగు లెహెంగా ధరించి తన భర్తతో కలిసి బయటకు వచ్చిన స్నేహ.. సిద్ధంగా పూలతో అలంకరించిన కారు డ్రైవర్ సీట్లో కూర్చుంది. పక్కనే భర్త సౌగత్ కూర్చొన్నారు. అప్పగింతల పాట, డప్పు వాద్యాల నడుమ స్నేహ ఒక పక్క ఆనందం మరోపక్క తన వారికి దూరంగా వెళ్తున్న బాధతో నెమ్మదిగా కారు నడుపుతూ ముందుకు సాగింది. పెళ్లి నాడే కారు నడిపిన స్నేహ అంతే బాధ్యతతో తన సంసార నౌకను కూడా సుఖంగా... సౌకర్యంగా నడపగలదని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment