Mumbai Get A Whey CEO Jash Shah Inspirational Success Journey In Telugu - Sakshi
Sakshi News home page

Get A Whey CEO Jash Shah Story: పది లక్షల పెట్టుబడితో మొదలుపెట్టి... దేశవ్యాప్తంగా..

Published Fri, Apr 8 2022 10:46 AM

Jash Shah: Mumbai Youngster Get A Whey Successful Inspirational Journey - Sakshi

ఏంచేయకుండా 
నిమ్మకు నీరెత్తినట్లుగా 
కులాసాగా 
కూర్చోవడం కంటే...
‘ఎందుకిలా చేయకూడదు’ 
అని రిస్క్‌ తీసుకునేవారికే 
గొప్ప సక్సెస్‌లు దక్కుతాయి.
అలాంటిదే జష్‌ షా సక్సెస్‌ స్టోరీ...


గొప్ప ఐడియాలు కిచెన్‌రూమ్‌లో పుడతాయనే మాట మరోసారి నిజమైంది. ఎలా అంటే... ముంబైకి చెందిన జష్‌ షా జిమ్‌లో కసరత్తులు చేయడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో, ఆరోగ్యకరమైన ఆహారానికి అంతే ప్రాధాన్యత ఇస్తాడు. అయితే జష్‌కు ఐస్‌క్రీమ్‌లు తినడం అంటే మాత్రం చెప్పలేనంత ఇష్టం. రోజూ ఉండాల్సిందే!

బయటి ఐస్‌క్రీమ్‌ల జోలికి వెళ్లకుండా ఆరోజు ‘ఐస్‌క్రీమ్‌ కావాలి’ అని తల్లిని అడిగాడు. అలా తల్లి, అక్కలతో పాటు కిచెన్‌లోకి చేరాడు జష్‌ షా. ఈ క్రమంలో వారి మధ్య ప్రొటీన్‌ ఐస్‌క్రీమ్‌ గురించి చర్చ జరిగింది. ‘అసలు మనమే ఎందుకు ప్రయత్నించ కూడదు’ అన్నాడు షా. అలా రకరకాల ప్రొటీన్లతో ఆరోజు ఐస్‌క్రీమ్‌ తయారైంది. ఆహా ఏమిరుచి!

మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేసిన జష్‌ షాకు ఉద్యోగం చేయడం కంటే సొంతంగా వ్యాపారం చేయడం అంటే ఇష్టం. ఏ వ్యాపారం చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు తల్లి తన కోసం తయారుచేసిన ఐస్‌క్రీమ్‌ గుర్తుకువచ్చింది. అలా ‘గెట్‌–ఏ–వెయ్‌’కి అంకురార్పణ జరిగింది. పది లక్షల పెట్టుబడితో ‘గెట్‌–ఏ–వెయ్‌’ పేరుతో ఐస్‌క్రీమ్‌ తయారీ కంపెనీ మొదలు పెట్టారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పాలను మాత్రమే ఉపయోగిస్తారు. షుగర్‌కు బదులుగా ఆర్గానిక్‌ స్వీటెనర్‌ ఎరిత్రిటాల్‌ ఉపయోగిస్తారు. ఐస్‌క్రీమ్‌ తయారీలో ‘వెయ్‌ ప్రొటీన్‌’ రా ను ఉపయోగిస్తారు. బెల్జియన్‌ చాక్‌లెట్, స్ట్రాబ్రెర్రీ బనానా....ఇలా ఎనిమిది రకాల ఫ్లేవర్స్‌తో రూపొందించారు.

కొత్తగా ప్రారంభమయ్యే అన్ని వ్యాపారాల మాదిరిగానే ప్రారంభ ప్రతికూలతలు పలకరించాయి. అయితే షా వెనక్కి తగ్గలేదు. ప్రముఖులు, న్యూట్రీషనిస్ట్‌ల నుంచి పాజిటివ్‌ రివ్యూలు వచ్చినప్పటికీ రిటైల్‌ షాప్‌లలో వీరి ఉత్పత్తులకు తిరస్కారమే ఎదురయ్యేది. మనలాంటి దేశాల్లో ఫిజికల్‌ ప్రెజెన్స్‌ లేకుండా ఆన్‌లైన్‌ బ్రాండ్‌ను సృష్టించలేము. అలా అని ఆన్‌లైన్‌ వేదికను నిర్లక్ష్యం చేయలేము. రెండిటినీ సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేశాడు. గుడ్‌ క్వాలిటీ ఉన్నప్పటికీ సరిౖయెన ప్రచార వ్యూహం లేకపోతే దెబ్బతింటాం.

ఈ విషయాన్ని అవగతం చేసుకున్న షా ప్రచారంపై దృష్టి పెట్టాడు. సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్‌ మార్కెటింగ్‌ను ఉపయోగించుకున్నాడు. గూగుల్‌ షీట్‌ ద్వారా కస్టమర్స్‌ నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాడు. ఇప్పుడు గెట్‌–ఏ–వెయ్‌ పెద్ద బ్రాండ్‌గా మారింది. ముంబైలో పుట్టిన గెట్‌–ఎ–వెయ్‌ పుణె, నాగ్‌పూర్,సూరత్, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్‌...మొదలైన నగరాలకు విస్తరించడం, షార్క్‌ టాంక్‌ ఇండియా(బిజినెస్‌ రియాల్టీ టెలివిజన్‌ షో) ఫస్ట్‌ ఎడిషన్‌లో అష్‌నీర్‌ గ్రోవర్, అయన్‌ గుప్తా, వినీత్‌సింగ్‌లాంటి ఎంటర్‌ప్రెన్యూర్‌లు కోటి రూపాయలు పెట్టుబడి పెట్టడం.... 26 సంవత్సరాల జష్‌ షా సాధించిన విజయానికి సంకేతంగా నిలుస్తున్నాయి.

చదవండి: అవును... నాకు బట్టతలే.. అయితే ఏంటి?

Advertisement
 
Advertisement
 
Advertisement