
ఒక ఆవిష్కరణకు ముందు ఒక ఎమోషన్ ఉంటుంది. తన వాళ్లకు వచ్చిన కష్టంలో నుంచి ఒక సమాధానాన్ని ఆలోచించేవాళ్లే ఆవిష్కర్తలవుతారు. మనసు పెట్టి ఆలోచించి, మెదడుతో విశ్లేషించి, శాస్త్ర సాంకేతికతతో పరిశోధన చేసినప్పుడు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదే పని చేసింది పుణెకి చెందిన జుయీ అభిజిత్ కేస్కర్ అనే పదహారేళ్ల అమ్మాయి.
ఈ అమ్మాయి ఆవిష్కరించిన ‘జేట్రెమోర్– త్రీడీ’ అనే ఉపకరణం వైద్యరంగంలో ఒక కొత్త ఒరవడిని తీసుకురానుంది. అందుకే సైన్స్ అవార్డులతోపాటు జాతీయ అవార్డులు కూడా ఆమె ముందు క్యూలో నిలబడ్డాయి. పుణెకు చెందిన జుయీ కేస్కర్ వాళ్ల అంకుల్ పార్కిన్‌సన్స్ వ్యాధితో బాధపడుతుండేవాడు. నలభై రెండేళ్ల వయసులో ఆయన నరాల బలహీనత కారణంగా చేతులు వణకడం, దేనినీ సరిగ్గా పట్టుకోలేక పోవడం వంటి ఇబ్బందులతో దైనందిన జీవనం దుర్భరంగా మారడం జుయీని కలచివేసింది.
అతడు తరచూ హాస్పిటల్‌కు వెళ్లాల్సి రావడం కరోనా సమయంలో ఆమె దృష్టిలో పడింది. డాక్టర్ దగ్గరకు వెళ్తున్నాడు, మందులు మార్చి మరింత శక్తిమంతమైన మందులతో వస్తున్నాడు. కానీ ఆయనలో వస్తున్న వణుకు ఎంత తీవ్రతను తెలియచేసే కొలమానం మాత్రం లేదని అర్థం చేసుకుంది జుయి.
సెకనుకు పదోవంతు సమయంలో వచ్చే వణుకును కూడా కచ్చితంగా గుర్తించి ఆ సమాచారాన్ని క్లౌడ్ డాటాబేస్‌లో నిక్షిప్తం చేయవచ్చని, ఆ సమాచారం ఆధారంగా వైద్యులు వ్యాధి తీవ్రతను మరింత కచ్చితంగా అంచనా వేయడానికి సాధ్యమవుతుందని నిరూపించింది జుయీ.
అవార్డు వరించింది!
ఆమె ఆవిష్కరణకు ‘బ్రాడ్ కామ్ –ఐఆర్‌ఎఐస్ గ్రాండ్’ అవార్డు వచ్చింది. అలాగే దేశంలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ స్టెమ్ నేషనల్ ఫెయిర్‌లో పాల్గొనే ఇరవై మందిలో ఆమెకు కూడా అవకాశం వచ్చింది. యూఎస్‌లోని లింకన్ లాబొరేటరీస్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించే దిశగా నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానం వచ్చింది. దీనితోపాటు అక్కడి రీజెనరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్‌లో మనదేశానికి ప్రాతినిధ్యం వహించింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ నేషనల్ అవార్డ్, ఈ ఏడాది బాల పురస్కార్‌కు కూడా ఎంపికైంది.
నియంత్రణ ఎలా?
‘దేనినైనా నియంత్రించాలంటే అది ఎంత అనేది తెలిసుండాలి. ఒక ఉపద్రవాన్ని అదుపు చేయాలన్నా సరే... దాని తీవ్రత ఎంత, అది కలిగించే నష్టం ఎంత అనే అంచనా తెలిసుండాలి. అలాగే పార్కిన్‌సన్స్ కారణంగా దేహంలో వచ్చే ట్రెమర్స్ (వణకడం) తీవ్రతను కచ్చితంగా కొలవగలిగినప్పుడే దానిని నియంత్రించడం, నివారించడం ఏదైనా సాధ్యమవుతుంది’... అంటోంది జుయీ.
‘‘వైద్యరంగంలో ఇందుకోసం ఒక సాధనం ఉంది. కానీ దానిని ఉపయోగించాలంటే హాస్పిటల్‌కి వెళ్లాల్సిందే. అలాగే ఎక్కువ సమయంతో కూడిన పని. నేను రూపొందించిన ఈ సాధనం చేతికి గ్లవుజ్‌గా ధరించవచ్చు. దీనికి ‘జేట్రెమోర్–త్రీడీ’ పేరుతో డెవలప్ చేశాను. ఇందులో అమర్చిన సెన్సర్ యాక్సెలోమీటర్, జైరో మీటర్‌లను సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేసి ఉంటాయి.
ఈ సమాచారాన్ని డాక్టర్‌కు ఆన్‌లైన్ ద్వారా చేర్చవచ్చు. కాబట్టి పేషెంట్ ప్రతిసారీ డాక్టర్‌ను స్వయంగా సంప్రదించాల్సిన అవసరం కూడా ఉండదు’’ అని చెప్తోంది జుయీ కేస్కర్. జూయీ కేస్కర్ ఆవిష్కరించి జేట్మ్రర్స్ త్రీడీ సాధనం ఇప్పటికే రెండు క్లినికల్ ట్రయల్స్‌లో నెగ్గింది. మరికొన్ని పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత అందుబాటులోకి వస్తుంది.
చదవండి: Laya Mathikshara: ఈమెకు లక్షల్లో డబ్బు... అతడు ఏకంగా 7 కోట్లు సంపాదించాడు! ఇదెలా సాధ్యవుతోందంటే!
Comments
Please login to add a commentAdd a comment