చలికాలంలో లభించే పండ్ల్లలో రేగిపండు ఒకటి. రేగుచెట్టు ముళ్లు ఎంత పదునుగా ఉంటాయో పళ్లు అంతే రుచిగా ఉంటాయి. కండరాలు, నాడీవ్యవస్థ, చర్మానికి కావాల్సిన అనేక పోషకాలు దీనిలో మెండుగా ఉంటాయి. రుచికి కాస్త వగరుగా, తియ్యగా ఉండే రేగి పండులో విటమిన్ ఎ,సిలు ఇతర ఖనిజ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దక్షిణాసియా దేశాల్లో రేగు విరివిగా పండుతుంది. వీటికి, డేట్స్‌కు కాస్త దగ్గర పోలికలు ఉండడంతో చైనీస్ డేట్, కొరియన్ డేట్, ఇండియన్ డేట్ అని కూడా పిలుస్తారు.
► పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, ఐరన్, జింక్‌లు అధిక మొత్తంలో ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయులను క్రమబద్ధీకరిస్తూ్త రక్తహీనతను తగ్గిస్తుంది.
► ఖనిజ పోషకాలు శరీరంలో రక్తప్రసరణను సక్రమంగా జరిగేలా చేసి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్‌లు యాంటీ ఏజెంట్స్‌గా పనిచేస్తాయి. శరీర కణాలకు ఎటువంటి నష్టం జరగకుండా సంరక్షించి వృద్ధా్దప్య ఛాయలను కనిపించకుండా చేస్తాయి.
► ఇక విటమిన్ సి జీవం కోల్పోయిన మేనిచాయను మెరుగుపరిచి, మొటిమలు లేని అందమైన ముఖవర్ఛస్సును ఇనుమడింపచేస్తుంది.
► ఎండబెట్టిన రేగుపళ్లలో అధిక మొత్తంలో క్యాల్షియం, ఫాస్పరస్‌లు ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
► ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి రేగుపండ్లు ఎంతో ఉపశాంతిని కలిగిస్తాయి. వీటిలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జాయింట్ల వద్ద ఏర్పడే వాపును తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పీచు పదార్థం అధికమొత్తంలో ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
►రేగుపండు సులభంగా జీర్ణం అవ్వడం వల్ల మలబద్దకం సమస్యను నివారిస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడేవారు వేరే స్నాక్స్‌కు బదులుగా రేగుపండును తీసుకుంటే దీర్ఘకాలిక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
►ఈ రోజుల్లో నిద్రలేమితో బాధపడే వారు అనేకమంది ఉన్నారు. రేగులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ఫైటో కెమికల్స్, పాలీశాకరైడ్స్, ప్లేవనాయిడ్స్, సపోనిన్స్ వంటివి మంచి నిద్రకు తోడ్పడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ గాభరాను తగ్గించి నరాలను శాంతపరచి గాఢనిద్రకు ఉపక్రమించేలా ప్రేరేపిస్తాయి.
► దీనిలో క్యాలరీలు స్వల్పంగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారమని చెప్పవచ్చు. అయితే ఇన్ని పోషకాలు ఉన్నాయి కదా అని మోతాదుకు మించి తింటే విరేచనాలు అవుతాయి. అందువల్ల మితంగా తీసుకుంటేనే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి మర్చిపోకూడదు.
Comments
Please login to add a commentAdd a comment