
కోడలు గృహప్రవేశం చేయబోతోందంటే అత్తగారికి అభద్రత. కూతురు ఓ ఇంటిదవుతోందని అమ్మ ఆనందపడుతున్నా... మనసులో ఏ మూలో బెంగ.. అత్తింట్లో బిడ్డ జీవితం ఉంటుందోనని. అమ్మాయికీ ఆందోళనే.. కట్టుకునేవాడు సమభాగస్వామ్యం ఇస్తాడా? లేక తల్లి మాటకు విలువిస్తాడా? అని. ఈ ఇన్‌సెక్యూరిటీస్‌ను స్త్రీ కోణంలోంచే చిత్రీకరించినా ఆ సీరియస్‌నెస్‌ను కామెడీగానే చూపించిన ఇంగ్లిష్ సినిమా ‘కందస్వామీస్ వెడ్డింగ్’. దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్‌లో స్థిరపడ్డ భారతీయ వలస కుటుంబాల కథ.
దక్షిణాఫ్రికా.. భారతీయ వలసలు అనగానే ‘వీరయ్య’ తెలుగు నవల జ్ఞాపకం వస్తుంది. సబ్జెక్ట్ అది కాకపోయినా ఆ కుతూహలాన్ని, ఉత్సాహాన్ని ఏమాత్రం నీరుగార్చదు ‘కందస్వామీస్ వెడ్డింగ్’. తమిళ కందస్వామి ఫ్యామిలీ తెలుగు నాయుడు ఫ్యామిలీతో వియ్యం అందుకునే స్టోరీ ఇది. యూరప్, అమెరికా నేపథ్యంలో వచ్చిన బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో పోలిస్తే కందస్వామీస్ వెడ్డింగ్ దక్షిణ ఆఫ్రికాలో దక్షిణ భారతీయ బ్యాక్‌గ్రౌండ్, అక్కడి జీవన శైలితో కొత్తగా అనిపిస్తుంది. ఆసక్తినీ కలిగిస్తుంది. కథ, కథనం సింప్లీ సూపర్బ్. దర్శకత్వం జయన్ మూడ్‌లే. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా.
క్లాప్ కొడితే...
శాంతినాయుడు, ప్రెగ్గీ నాయుడుల కొడుకు ప్రిషేన్.. డాక్టర్. జెన్నిఫర్ కందస్వామి, ఎల్విస్ కందస్వామిల కూతురు జోడీ.. బిజినెస్ మేనేజ్‌మెంట్ స్టూడెంట్.. ఈ ఇద్దరివీ పక్కపక్క ఇళ్లే. ప్రిషేన్, జోడీ ప్రేమించుకుంటారు. వాళ్ల పెళ్లికి పెద్దలూ అంగీకరిస్తారు. పెళ్లి ముహూర్తాలూ తీసుకొని, పెళ్లికి అయిదు రోజుల ముందు నుంచి సినిమా మొదలవుతుంది. శాంతినాయుడు తమ ఇంటి ఆచారాల ప్రకారం పెళ్లికి ముందు జరగవలసిన పూజలతో గాబరా పడుతుంటే అటు జెన్నిఫర్ పెళ్లి ఏర్పాట్ల హడావిడిలో ఉంటుంది. ఇక్కడే చిక్కొచ్చి పడుతుంది. జెన్నిఫర్ ఓకే చేసిన వాటిని శాంతి నాట్ ఓకే అంటుంది.
తన కొడుకు ప్రిషేన్.. జోడీ చెప్పినవాటికి తలాడించడాన్ని చూసి కంగారు పడుతుంటుంది. పెళ్లికాకముందే అమ్మ మాటను బేఖాతరు చేస్తే ఇక పెళ్లయ్యాక అమ్మనేం పట్టించుకుంటాడు అని. ఆమె అనుకున్నట్టుగానే పెళ్లయ్యాక డర్బన్‌లో ఉండకుండా కేప్ టౌన్‌లో కాపురం పెట్టేందుకు వీలుగా అక్కడే డాక్టర్ కొలువు వెదుక్కుంటాడు. ఈ విషయం పెళ్లికొడుకును చేసే తంతు రోజు’ తెలుస్తుంది అతని ప్రొఫెసర్ ద్వారా శాంతికి. అవాక్కవుతుంది. ఆ నిర్ణయం జోడీదే అయ్యుంటుందని గట్టిగా నమ్మడమే కాదు కొడుకును అడుగుతుంది కూడా. ‘కాదు.. కలిసి తీసుకున్న నిర్ణయం’ అని ప్రిషేన్ చెప్పినా సమాధానపడదు శాంతి.
ఆ క్షణం నుంచి కొడుకును గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తూంటుంది. జోడీతో కలిసి గుడికి, షాపింగ్‌కి, రెస్టారెంట్‌లో లంచ్‌కి, సంగీత్ కోసం డాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్లేలా కొడుకు చేసుకున్న ప్లాన్స్ అన్నిటికీ అంతరాయం కల్పించి ఆ సమయాలు ప్రిషేన్ తనతో మార్కెట్‌కు వచ్చేలా, ఇతరత్రా పనుల్లో సహాయంగా ఉండేలా చేస్తుంది శాంతి. ఈ విషయం ప్రిషేన్, జోడీలకు అర్థమై... జోడీ అసహనపడుతుంటే ఓపికపట్టమని కోరతాడు ప్రిషేన్.
ఇటు..
జెన్నిఫర్ కందస్వామికీ కూతురు ప్రవర్తన ప్రశ్నార్థకంగా అనిపిస్తుంది. డర్బన్‌లో మంచి ఉద్యోగం వస్తే వదులుకుందని తెలుస్తుంది. కాబోయే భర్త కోసమే డర్బన్‌లోని తన కెరీర్‌ను త్యాగం చేసింది తన కూతురు అనే అభిప్రాయం తో ఉంటుంది జెన్నిఫర్. తనే తప్పయితే చేసిందో ఆ తప్పు తన కూతురు చేయకూడదని, ఆర్థిక స్వాతంత్య్రంతో కుటుంబంలో నిర్ణయాత్మక శక్తిగా తన బిడ్డ ఉండాలని కలలు కంటుంది. ఆ ఉద్యోగాన్ని వదులుకోవడంతో తన కలలను కల్లలు చేస్తోంది జోడీ అని మథన పడుతూంటుంది. దీనికి ప్రిషేనే కారణమని సందర్భం చూసుకొని ప్రిషేన్ ముందు జోడీ జాబ్ ప్రస్తావన తెస్తుంది జెన్నీఫర్.
ఆ విషయం అసలు తనకు తెలియదని.. జోడీ కోసం తనేమైనా చేస్తానని.. డర్బన్ లో ఉండిపోవడానికీ సిద్ధమేననీ జెన్నిఫర్‌కు ప్రామిస్ చేస్తాడు ప్రిషేన్. నిశ్చింత చెందిన జెన్నిఫర్ మళ్లీ కూతురికి ఆ ఉద్యోగం వచ్చేలా చేస్తుంది జోడీకి తెలియకుండా. అయితే ఆ సత్యం సంగీత్ రోజు జోడీ చెవిన పడుతుంది. ‘ఎందుకలా చేశావ్?’ అని తల్లిని నిలదీస్తుంది జోడీ. ప్రిషేన్ అంగీకారంతోనే చేశానని చెబుతుంది తల్లి. అంతే! మొత్తం సీన్‌ను అపార్థం చేసుకుంటుంది జోడీ. సంగీత్ అయిన వెంటనే ఇంటికి వచ్చేసి రోడ్డు మీద ప్రిషేన్‌ను నిలదీస్తుంది.. ‘మీ అమ్మకోసమే డర్డన్ వదిలి రాకుండా ఉండడానికి నా ఉద్యోగాన్ని ఓ సాకులా చూపించ దలచావ్ కదా’ అంటూ.
హతాశుడవుతాడు ప్రిషేన్. ‘కాదు.. నీ కెరీర్ కోసమే’ అని చెప్పినా వినదు జోడీ. నువ్వు నా కన్నా మీ అమ్మకే ఇంపార్టెన్స్ ఇస్తున్నావ్... చూస్తూనే ఉన్నా. ఆమె ఏం చెబితే దానికి తలాడిస్తున్నావ్’అంటూ పెళ్లి పనులు, పెళ్లి పందిరి మొదలు హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లాలో వరకు అన్నిట్లో అత్తగారు జోక్యం చేసుకున్న తీరును దుయ్యబడుతుంది. అమ్మ కూచి అంటూ వెక్కిరిస్తుంది. ఇటు కూతురికి సపోర్ట్‌గా జెన్నిఫర్, అటు కొడుకుకు సపోర్ట్‌గా శాంతి చేరి ఆ గొడవను పెద్దది చేస్తారు నాయుడు, కందస్వామి సర్దిచెప్తున్నా వినకుండా.
స్త్రీ మనసు అర్థమవుతుంది ఇద్దరికీ
తెల్లవారి జరగవలసిన పెళ్లి.. జరుగుతుందా లేదా అన్న మీమాంసలో పడిపోతారు చుట్టాలు. ఇంట్లోకి వెళ్లాక ఇటు జెన్నిఫర్‌కు, అటు శాంతికి ఇద్దరికీ తమ బిడ్డల సహజీవనంలో ఆ తల్లుల జోక్యం ఎంతుందో వివరించే ప్రయత్నం చేస్తారు పిల్లల తండ్రులు. అప్పుడు తన అభద్రతను బయటపెడుతుంది శాంతి. ఇటు జెన్నిఫర్ కూడా భర్త కోసం, ఆ ఇంటి కోసం తనను తాను కోల్పోయిన తీరును, వెనకే ఉండిపోయిన బాధను వెళ్లగక్కుతుంది.
జోడీ, ప్రిషేన్ కూడా జరిగిందాన్ని చర్చిస్తారు. ఆ రెండిళ్ల మగవాళ్లకూ స్త్రీ మనసు అర్థమవుతుంది. సమస్య పరిష్కారమవుతుంది. ఇది ఓ కొలిక్కి రావడానికి జెన్నిఫర్ అత్తగారి పాత్ర కీలకం. ఆమె గృహహింస బాధితురాలు. భర్తను వదిలేసి సింగిల్ పేరెంట్‌గా కొడుకును పెంచుతుంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తూ అసలు కథను నడిపిస్తుంది. మొత్తానికి ప్రిషేన్ నాయుడు, జోడీ కందస్వామి వివాహంతో కథ సుఖాంతమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment