కన్యాకుమారిలో మాలి, బెన్నీ
ఫస్ట్ కపుల్ టు వాక్ అరౌండ్ ఇండియా అనే రికార్డు సాధించారు ఈ కేరళ దంపతులు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు తిరిగి కశ్మీర్ నుంచి కన్యాకుమారికి మొత్తం 8,263 కిలోమీటర్లు నడిచారు. బెన్నీ కొట్టరత్తిల్, అతని భార్య మాలి కొట్టరత్తిల్ తమ స్వస్థలం అయిన కేరళ కొట్టాయం నుంచి ఈ సుదీర్ఘయాత్ర చేశారు. డిసెంబర్ 1, 2021 నాడు ‘చలో భారత్’ అని బయలుదేరి 216 రోజులలో 17 రాష్ట్రాలలో తిరిగి జూలై 3, 2022న ఇల్లు చేరారు. ఏడు నెలల మూడు రోజుల తమ పర్యటనలో వారు గడించిన అనుభవాలు మరొకరు పొందలేనివి.
ఉదయం లేచి మార్నింగ్ వాక్ చేయడం కాదు. మణికట్టు మీదున్న వాచ్‌లో ‘ఓ... ఇవాళ ఐదు వేల అడుగులు నడిచాను’ అని లెక్క చూసుకోవడం కాదు. నడుస్తూ ఉండాలి. రోజంతా నడుస్తూ ఉండాలి. వారమంతా నడుస్తూ ఉండాలి. నెలంతా నడుస్తూ ఉండాలి.
నడవగలరా?
కొట్టాయం దంపతులు బెన్నీ, మాలి నడిచారు. దేశమంతా నడిచారు. పాదాలతోపాటు కనులు, మనసు, ఆత్మ ధన్యం చేసుకున్నారు. వారు ఇదంతా ఎలా చేశారు? ‘ప్లాన్ చేయకుండా. ప్లాన్ చేస్తే చాలా పనులు జరగవు. మీనమేషాలు లెక్కెట్టకండి... అనుకున్నదే తడవు చేసేయండి’ అనేది వీరి ఫిలాసఫీ.
కోవిడ్ ‘రోడ్డున పడేసింది’
ప్రపంచంలో అందరి జీవితాలు గందరగోళం అయినట్టే బెన్ని, మాలి జీవితాలు కూడా గందరగోళం అయ్యాయి. 50 ఏళ్ల బెన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రయివేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేసేవాడు. కాని కోవిడ్ వల్ల 2019లో ఉద్యోగం పోయింది. భార్యాభర్తలు తమ సొంత ఊరు కొట్టాయం చేరుకున్నారు. చేయడానికి పని దొరకలేదు. చివరకు బెన్నీకి సెక్యూరిటీ గార్డ్ జాబ్ వచ్చింది ఒక హాస్పిటల్‌లో.
ఆ సమయంలో పోస్ట్ కోవిడ్ అనారోగ్యాలు, హార్ట్ స్ట్రోక్‌లు చాలా చూశాడు బెన్ని.‘తగినంత వ్యాయామం లేకనే ఇవన్నీ’ అని అర్థమైంది. మరి తానేం చేస్తున్నట్టు? అప్పటికే ఆ ఉద్యోగం బోర్ కొట్టింది. 2019 నవంబర్‌లో ఒక సైకిలెక్కి ‘అలా దేశం చూసి వస్తా’ అని భార్యకు చెప్పి బయలు దేరాడు. కేవలం 58 రోజుల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వెళ్లి వచ్చాడు 13 రాష్ట్రాల మీదుగా.
ఆ పని కిక్ ఇచ్చింది. మళ్లీ 2021 జూలైలో ఒక సైకిల్ యాత్ర చేశాడు భూటాన్, నేపాల్ వరకు. మూడోసారి కూడా ప్లాన్ చేస్తుంటే భార్య మాలి ‘నన్ను కూడా తీసుకెళతావా?’ అంది అతడు సైకిల్ తుడుస్తుంటే... ‘మనిద్దరం సైకిల్ మీద ఎక్కడెళ్లగలం. నడవాల్సిందే’ అన్నాడు బెన్నీ. ‘అయితే నడుద్దాం పద‘ అంది మాలి. యాత్ర మొదలైంది.
డిసెంబర్‌లో యాత్ర మొదలు
డిసెంబర్ 1, 2021న ‘కన్యాకుమారి నుంచి కశ్మీర్’ వరకు సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు బెన్నీ, మాలి. ‘మాకు పిల్లలు లేరు, మా దగ్గర ఎక్కువ డబ్బు లేదు. స్నేహితులు సాయం చేసిన డబ్బు, ఒక టెంట్, నీళ్ల బాటిళ్లు, అవసరమైన మందులు, అన్నింటి కంటే ముఖ్యంగా పవర్ బ్యాంకులు... వీటిని తీసుకుని బయలుదేరాం. మాకు ఆధారం గూగుల్ మేప్సే’ అంటాడు బెన్నీ.
ఈ యాత్రను వీళ్లు 17 రాష్ట్రాల మీదుగా ప్లాన్ చేశారు. అయితే ఇదంతా అంత సులభమా.. ఎండా గాలి చలి దుమ్ము... బాత్‌రూమ్ కష్టాలు... నిద్రకు చోటు... దొంగల భయం... ఇవన్నీ ఉంటాయి. ‘మేమిద్దరం పదే పదే ఒకటే మాట చెప్పుకున్నాం. ఏది ఏమైనా యాత్రను సగంలో ఆపి వెనక్కు పోయేది లేదు అని. ఏం జరిగినా సరే ముందుకే వెళ్లాలి ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం’ అంటారు ఇద్దరూ.
ఎన్నో అనుభవాలు
మొత్తం 216 రోజుల యాత్రలో వారు చలికాలం, ఎండాకాలం చూశారు. చలికాలం టెంట్ సాయపడినా ఎండాకాలం టెంట్‌లో పడుకోవడం దుర్లభం అయ్యింది వేడికి. ‘టెంట్ బయట పడుకుంటే దోమలు నిర్దాక్షిణ్యం గా పీకి పెట్టేవి’ అన్నాడు బెన్నీ. అదొక్కటే కాదు.. భార్య భద్రత కోసం అతడు సరిగా నిద్రపోయేవాడు కాదు. ‘చీమ చిటుక్కుమన్నా లేచి కూచునేవాణ్ణి‘ అన్నాడు. వీళ్ల కాలకృత్యాల అవసరాలకు పెట్రోలు బంకులు ఉపయోగపడేవి. గుళ్లు, గురుద్వారాలు, పోలీస్ స్టేషన్ల వరండాలు, బడులు... ఇవన్నీ వారు రాత్రి పూట ఉండే చోటుగా మారేవి.
బడ్జెట్ కోసం రొట్టెల మీదే ఎక్కువ ఆధారపడేవారు. ‘వెస్ట్ బెంగాల్ పురూలియాలో రాత్రి తాగుబోతుల బారిన పడి పారిపోయాం. తమిళనాడు విల్లుపురం గుడిలో పడుకుంటే దొంగలు వచ్చారు. అట్టపెట్టెల వెనుక ఉండటం వల్ల మమ్మల్ని చూడలేదు. కుక్క మొరగడంతో పారిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో వేడి వేడి అన్నం, కూర తినడంతో మా ప్రాణం లేచి వచ్చింది. పంజాబ్‌లో జనం చాలా అతిథి మర్యాదలు చేస్తారు. ఒక ముసలాయన మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టి మరుసటి రోజుకి కట్టి ఇచ్చాడు’ అన్నారు వారు.
ఎన్నెన్ని అందాలు
అమృత్‌సర్, మురుడేశ్వర్, రిషికేశ్, బుద్ధగయ, వైష్ణోదేవి, కశ్మీర్, వాఘా బోర్డర్... ఇవన్నీ ఈ దంపతులు తమ కాళ్ల మీద నడుస్తూ చూసి సంతోషించారు. ఎందరికి దొరుకుతుంది ఈ అదృష్టం. ఎందరికి ఉంటుంది ఈ తెగువ. వారు తమ యాత్రానుభవాలను వారి యూట్యూబ్ చానల్ ‘వికీస్ వండర్ వరల్డ్’లో వీడియోలుగా పోస్ట్ చేశారు. తిరిగి వచ్చాక ఉద్యోగం వెతుక్కునే పనిలో ఉన్నాడు బెన్నీ. కాసింత సంపాదన చేసుకుని భార్యతో ఈసారి బైక్ మీద రివ్వున దూసుకెళ్లాలని ఆశ. ఎందుకు నెరవేరదూ? (క్లిక్: పర్యాటకుల స్వర్గధామం.. కాస్ పీఠభూమి)
Comments
Please login to add a commentAdd a comment