హైకోర్టు జంక్షన్‌లో పిల్లికి పాలు తాగిస్తున్న ఫ్రెంచ్ ప్రొఫేసర్ ఫేడెట్ బ్యాడీ
పదహారేళ్లయింది ఈ ఫ్రెంచి ప్రొఫెసర్ తన జన్మభూమిని వదిలిపెట్టి వచ్చి. రెండేళ్లుగా ఇండియాలో ఉంటున్నారు. థెరిసా కాలేజ్‌లో పాఠాలు బోధించడమే కాదు, థెరిసా ప్రబోధాలను ఆచరణలో పెడుతూ ఇచ్చే చెయ్యిగా, పెట్టే ముద్దగా జీవిస్తున్నారు. నోరు లేని జీవుల్ని మనుషులుగా చూసే ప్రొఫెసర్ ఫేడెట్.. నోరు తెరిచి ఆడగలేని మనుషుల్ని గమనించి తనే వెళ్లి ఆదుకుంటూ ఉంటారు. ఇదేమీ పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ పెద్ద మనసుంటే తప్ప చెయ్యలేని పని! ఎర్నాకుళంలోని సెయింట్ థెరిసా కాలేజ్‌లో ఫ్రెంచి భాషను బోధిస్తుండే ప్రొఫెసర్ ఫేడెట్ బ్యాడీ డీఆర్సిస్ గత ఇరవై నెలలుగా కొచ్చిలోని ప్రధాన కూడళ్లలో కనిపించే ఎవరికీ చెందని మూగజీవాలకు (స్ట్రే యానిమల్స్) ప్రేమతో ఆహారాన్ని అందిస్తున్నారు.
ఫేడెట్ ఉంటున్నది కొచ్చిలో. అక్కడి నుంచి ఎర్నాకుళం పది కి.మీ. దూరం. కొచ్చి నుంచి రోజూ ఎర్నాకుళం వెళ్లొస్తుండే ఫేడెట్ తరచు కొచ్చిలోని హైకోర్టు జంక్షన్‌లో అక్కడి వీధి శునకాలకు బిస్కెట్‌లు వేస్తూ కనిపిస్తుంటారు. కొన్నిసార్లు వాటి కోసమే వండి తెచ్చిన ఆహార పదార్థాలను ప్రేమగా తినిపిస్తూ ఉంటారు. ‘‘మనుషుల్ని నేను ఎంత ప్రేమిస్తుంటానో ఈ మూగజీవుల్నీ అంతే’’ అంటారు ఫేడెట్. ఇప్పుడీ కరోనా సెకండ్ వేవ్‌లోనైతే వాటి కోసమే ఆమె వీధుల్లోకి వస్తున్నారు. అందుకు ఆమె పోలీస్‌శాఖ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు.
2019 లో కొచ్చి వచ్చారు ఫేడెట్. ఫ్రెంచి ఫ్రొఫెసరమ్మగా కొచ్చి అంతటా ఆమె తెలుసు. ‘‘కోవిడ్ ఇక్కడ ఇంత ఎక్కువగా ఉంది. మీకేమీ భయం వేయడం లేదా? మీ దేశానికి వెళ్లిపోవాలని లేదా?’’ అంటే ‘‘ఇక్కడ నేను సేఫ్‌గానే ఉన్నాను. ఉద్యోగం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చారు. కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్.. అన్నీ ఉన్నాయి. ఈ మాత్రం లేనివాళ్లు మనలో ఇక్కడ ఎంత మంది లేరు? సేఫ్ అంటే కరోనా నుంచి మాత్రమే కాదు కదా. ఆకలి నుంచి, నిరుద్యోగం నుంచి, ప్రతికూల జీవన పరిస్థితుల నుంచి అందరూ సేఫ్‌గా ఉండాలి. అందుకోసం అందరం అందరికీ సహాయంగా ఉండాలి’’ అంటున్నారు ఫెడెట్.
Comments
Please login to add a commentAdd a comment