అల్సర్‌ని తగ్గించిన అరటి! బేబీ ఫుడ్‌ రకాలు! 10 పిలకల ధర 4,200! సాగు చేస్తే.. | Kerala: Vinod Has 400 Plus Banana Varieties Surprising Benefits Of Fruits | Sakshi
Sakshi News home page

Sagubadi: అల్సర్‌ని తగ్గించిన అరటి! బేబీ ఫుడ్‌ రకాలు! 10 పిలకల ధర 4,200! సాగు చేస్తే..

Published Tue, Dec 13 2022 11:02 AM | Last Updated on Tue, Dec 13 2022 11:51 AM

Kerala: Vinod Has 400 Plus Banana Varieties Surprising Benefits Of Fruits - Sakshi

కన్నామంఫలం చూపుతున్న వినోద్‌

Vinod Sahadevan- Banana Varieties: పండుగా, కూరగా, మరెన్నో ఉత్పత్తులుగా.. అరటి పంట మన జాతి సంస్కృతిలో అనదిగా విడదీయరాని భాగమైపోయింది. వైవిధ్యభరితమైన అరటి రకాలను అంతరించిపోకుండా సాగు చేస్తూ పరిరక్షించుకోవటం ఎంతో ముఖ్యమైన విషయం. ఈ బృహత్‌ కార్యాన్ని నెత్తికెత్తుకున్న కేరళకు చెందిన ఓ రైతు స్ఫూర్తికథనం ఇది. 

విలక్షణమైన అరటి రకాలను సేకరించి సాగు చెయ్యటమంటే కేరళకు చెందిన వినోద్‌(62)కు మహా ఇష్టం. ఇష్టం అనే కంటే పిచ్చి అంటే బాగా నప్పుతుందేమో. అందుకే ఆయనకు ‘వలచెట్ట’ అని పేరొచ్చింది. వలచెట్ట అంటే మళయాళంలో ‘అరటి అన్న’ అని అర్థం. తిరువనంతపురం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన 4 ఎకరాల తోటలో 500 కంటే ఎక్కువ రకాల అరటి మొక్కల్ని నాటి ప్రాణప్రదంగా సాగు చేస్తున్నారు.

వివిధ రాష్ట్రాలతో పాటు అనేక విదేశాల్లో తిరిగి మరీ అరటి రకాలను సేకరించి నాటడం పనిగా పెట్టుకున్నాడు. సుసంపన్నమైన అరటి జీవవైవిధ్యానికి నిలయంగా మారిన తన క్షేత్రాన్ని ‘అరటి గ్రామం’ (వలగ్రామం) అని పిలుచుకుంటున్నారు.  

శాస్త్రవేత్త ఇవ్వనన్నాడని...
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వినోద్‌కు చిన్నప్పటి నుంచే అరటి రకాలను సేకరించే అలవాటుంది. పదేళ్ల క్రితం ఎదురైన చేదు అనుభవం అతన్ని అరటి జీవవైవిధ్యానికి పట్టుగొమ్మగా మార్చేసింది. ఓ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తను తనకు ఇష్టమైన ఓ అరటి రకం మొక్క ఇవ్వమని అడిగితే అందుకు ఆయన నిరాకరించారు. ఆ సంఘటన వినోద్‌ను తీవ్రంగా బాధపెట్టింది.

అరటి రకాల కోసం ఇకపై ఏ విశ్వవిద్యాలయంపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి రకరకాల అరటి పిలకలను సేకరించి తన సొంత పొలంలో పెంచడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన పొలంలో 500 కన్నా ఎక్కువ అరటి రకాల మొక్కలున్నాయి. ఆ రకాలలో ఎంతో వైవిధ్యం ఉంది. విశేషమేమిటంటే.. తిరువనంతపురం అనే ఓ అరటి రకం ఉండేది. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కానీ, వినోద్‌ పొలంలో ఉంది.

పెయాన్‌తో..
పండుగా తినడానికి, పచ్చికాయలను కూర వండుకోవడానికి ఉపయోగపడే అరటి రకాలు మనకు తెలుసు.  అంతేకాదు.. ఐస్‌క్రీమ్‌లు, షేక్స్‌కు ఉపయోగపడే ప్రత్యేక అరటి పండ్లు ఉన్నాయి. ‘పెయాన్‌’ రకం అరటి కాయలతో కేరళలో కూర చేస్తారు, తమిళనాడులో దీన్ని ఎక్కువగా పండుగా తింటారు. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం ఉన్న పండు ఇది.

చక్క, వాయల్వజా, కుల్లరకని, బారాబెన్‌లో, చిరపుంచి, పంథరాజ్, ఎఫ్‌హెచ్‌ఐఏ3, సబా మొదలైన పేర్లతోనూ దీన్ని పిలుస్తుంటారు. తక్కువ నీరు, ఎరువులతో పెరగటం దీని ప్రత్యేకత. అత్యధికంగా అమ్ముడయ్యే రకం అయినప్పటికీ రైతులకు ఈ రకం అరటి పిలకలు దొరక్క సాగు తగ్గిపోయింది. ఇవన్నీ ఇప్పుడు మన అరటి వీరుడు వినోద్‌ దగ్గర ఉన్నాయి! 

అల్సర్‌ని తగ్గించిన అరటి!
మైసూరులో నవంబర్‌లో జరిగిన కిసాన్‌ స్వరాజ్‌ సమ్మేళనంలో వినోద్‌ తన తోటలో పండిన కనీసం 30 రకాల అరటి పండ్లను ప్రదర్శనకు పెట్టారు. మీకు బాగా ఇష్టమైన అరటి రకం ఏది అని ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ‘అన్నీ ఇష్టమే. ఒక్కో రకం రుచి, వాసన, సైజు వేరుగా ఉంటాయంతే’ అన్నారు.

అదిసరే గానీ.. ప్రత్యేకతలున్న అరటి రకాల గురించి చెప్పండి అనడిగితే.. ‘కన్నామంఫలం’ రకం అరటి పండ్లలో ఔషధ గుణాల గురించిన ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ఆయన తండ్రికి కడుపులో అల్సర్‌ సమస్య ఉండేది. ఎవరో చెబితే ‘కన్నామంఫలం’ అరటి పండ్లు కొన్ని రోజుల పాటు తింటే అల్సర్‌ సమస్య తీరిపోయింది. 

బేబీ ఫుడ్‌ అరటి రకాలున్నాయి..
పెద్దలకే కాదు శిశువులు, బాలలకు కూడా ‘కన్నామంఫలం’ మంచిదని.. ‘కన్నమంఫలం’ అంటే ‘శిశువుల ఆహారం’ అని అర్థమని వినోద్‌ వివరించారు. ‘కన్నమంఫలం’తో ΄పాటు కారయన్నన్, పొంకల్లి, కన్నన్‌పాజ్మ్, అడుక్కన్, కున్నన్‌..  ఇవన్నీ బేబీ ఫుడ్‌గా పనికొస్తాయన్నారు. ఈ రకాల అరటి పండ్లను ఎండబెట్టి పొడి చేసి చంటి పిల్లలకు తినిపిస్తారు. జీర్ణకోశ సమస్యలకు ఇది ఉత్తమంగా పనిచేస్తుందన్నారు.

ఏపీ, తెలంగాణలో ఏ రకాన్నయినా సాగు చేయొచ్చు!
మన దేశంలో ఎక్కువ రకాల అరటిని కలిగి ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. వినియోగం కూడా ఎక్కువే. అయినా అరుదైన అరటి పండ్ల రకాల పరిరక్షణపై అధికారులు ఆసక్తి చూపడం లేదన్నది వినోద్‌ ఫిర్యాదు. అందుకే కేరళలోని అన్ని జిల్లాల్లో తన పొలం మాదిరిగా ’అరటి జీవవైవిధ్య క్షేత్రాలను ఏర్పాటు చేయాలన్నది తన ఆశయమని వినోద్‌ చెబుతున్నారు.

తన దగ్గర ఉన్న అరటి రకాలన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాటుకోవడానికి అనువైనవేనని వినోద్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తాను సంరక్షిస్తున్న అరటి రకాల పిలకల(సక్కర్స్‌)ను విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. పది పిలకలను రూ. 4,200కు అమ్ముతున్నానని, ఆర్డర్‌ ఇస్తే కొరియర్‌లో పంపుతానన్నారు. ఫేస్‌బుక్‌లో ‘వలగ్రామం’ గ్రూప్‌ నిర్విహిస్తున్నారు. వల చెట్టన్‌ వాట్సప్‌: 94464 01615. 
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

చదవండి: సాగు చేస్తే చం'ధనమే'!.. పంటకాలం 12 ఏళ్లు.. చేతికి రూ.కోట్లలో ఆదాయం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement