
ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యం లో స్వచ్ఛమైన కట్టె గానుగలో తీసిన వంట నూనెలకు అంతకంతకూ గిరాకీ పెరుగుతోంది. 30% మంది ప్రజలు ఇప్పటికే కట్టె గానుగ నూనెలు (కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్) వాడుతున్నట్లు ఒక సర్వేలో తేలింది. ఉపాధి అవకాశాల కోసం వెతుక్కుంటున్న 18 ఏళ్ల వయసు పైబడిన (ఎంత పెద్ద వయసు వారైనా పర్వాలేదు) గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలు, పురుషులు అర్హులు. హిందీ అర్థం చేసుకోగలిగి ఉండాలి. విద్యార్హత, కుల మతాలతో నిమిత్తం లేకుండా ఎవరైనా కట్టె గానుగ నూనె పరిశ్రమ నిర్వహణకు సంబంధించిన నైపుణ్య శిక్షణ పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ (కెవిఐసి) సంస్థ కట్టె గానుగ నూనె పరిశ్రమ నిర్వహణపై 15 రోజుల పాటు శిక్షణ ఇప్పిస్తుంది. మహారాష్ట్ర నాసిక్‌లోని డా. బి.ఆర్ అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ టెక్నాలజీ–మేనేజ్‌మెంట్ సంస్థలో అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. కె.వి.ఐ.సి. నమూనాతో రూపొందించిన కట్టెతో తయారు చేసిన గానుగ (పోర్టబుల్ పవర్ ఘని)ని కొద్ది పాటి షెడ్ లేదా గదిలో ఏర్పాటు చేసుకొని విద్యుత్ మోటారుతో నడుపుకోవచ్చు.
శిక్షణ పొందిన వారు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణం సైతం పొందవచ్చని ఖాదీ కమీషన్ సహాయ సంచాలకులు మాడుగుల హరి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ప్రమాణాలతో కూడిన కట్టె గానుగ యంత్రం వెల రూ. 1,20,000 – 1,80,000 వరకు ఉంటుంది. 15 రోజుల శిక్షణకు (ప్రయాణ చార్జీలు కాకుండా) సుమారు రూ. 4 వేల వరకు ఖర్చవుతుంది.
కట్టె గానుగ ద్వారా ప్రకృతిసిద్ధమైన పోషకాలు, విటమిన్లతో కూడిన నాణ్యమైన, ఆరోగ్యదాయకమైన నూనెలను ఉత్పత్తి చేయవచ్చు. ఎటువంటి రసాయనాలూ వాడనక్కర లేదు. ఈ గానుగ ద్వారా గంటకు 12–15 కిలోల నూనె గింజలతో నూనె తీయవచ్చు. తీసిన నూనెను ఒకసారి స్టీలు జల్లెడతో వడకట్టి 2 రోజుల పాటు కదపకుండా స్టీలు పాత్రలో నిల్వ ఉంచితే చాలు. మడ్డి అడుగుకు చేరుకున్నాక నూనెను సీసాలు, డబ్బాలలో నింపి విక్రయించుకోవచ్చు.
పూర్తి వివరాలకు..
హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్ ఆవరణలో గల ఖాదీ కమీషన్ కార్యాలయంలో సహాయ సంచాలకులు మాడుగుల హరిని 040–29704463 నంబరులో సంప్రదించచ్చు.
వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు: https://kviconline.gov.in/hrd/online_application.jsp
శిక్షణకు సంబంధించిన వివరాలతో కూడిన వీడియో కోసం యూట్యూబ్‌లో ఇలా వెతకండి.. "Lakdi Ghani 15 Days Practical Training Program By KVIC Nashik |Cold Press Oil Manufacturing Training'
డ్రాగన్ ఫ్రూట్ సాగుపై రైతులకు అవగాహన
ప్రకృతి/సేంద్రియ పద్ధతుల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగుపై రైతునేస్తం ఫౌండేషన్ ఏపీ, తెలంగాణల్లో రైతులకు వేర్వేరు తేదీల్లో ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇవ్వనుంది. కషాయాలు, మిశ్రమాలపై కూడా అవగాహన కల్పిస్తారు. ఈ నెల 9 (శనివారం)న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతి పేట వద్ద గల నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు శ్రీనివాసరెడ్డి శిక్షణ ఇస్తారు. 50 మందికి మాత్రమే ప్రవేశం.
►పాల్గొనదలచిన వారు 95538 25532 నంబరుకు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలి.
►అక్టోబర్ 10 (ఆదివారం)న గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులో కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన రైతు శ్రీమతి అన్నే పద్మావతి సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగుపై శిక్షణ ఇస్తారు. 40 మందికి మాత్రమే ప్రవేశం.
►పాల్గొనదలచిన వారు 97053 83666 నంబరుకు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలి.
చదవండి: కాలిఫోర్నియా బీచ్‌లో ముడిచమురు లీక్.. పర్యావరణానికి తీవ్ర నష్టం!