లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు. ప్రధాన కారణం కుటుంబం. లతా తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ పోలియో బాధితుడు. తండ్రిని ఆ తమ్ముడిలో చూసుకునేది లతా. అతనంటే ప్రాణం. అతణ్ణి చూసుకుంటే చాల్లే అనుకుని ఉండొచ్చు. తాను కుదురుకునే లోపు ఆశా భోంస్లే పెళ్లి చేసుకోవడం ఆ పెళ్లి పెటాకులు కావడం చిన్న ప్రభావం కాదు. అలాగని ఆమె జీవితంలో పురుషులు తారసపడలేదని కాదు. ఆ రోజుల్లో ప్లేబ్యాక్ సింగర్లు తప్పక క్లాసికల్ నేర్చుకోవాల్సి వచ్చేది.
లాహోర్‌కు చెందిన అద్భుత గాయకుడు సలామత్ అలీ ఖాన్ దగ్గర లతా పాఠాలు నేర్చుకునేది. అతని గానం ఆమెకు వెర్రి. పెళ్లి ఆలోచన వరకూ వెళ్లింది. కాని అప్పటికే సలామత్ అలీ ఖాన్‌కు పెళ్లయ్యింది. పైగా దేశ విభజన తాజా గాయాలు జనాన్ని వీడలేదు. ఈ సమయంలో తమ పెళ్లి వివాదానికి దారి తీయకూడదని సలామత్ వెనక్కు తగ్గాడు.
ఇక సంగీత దర్శకుడు సి.రామచంద్ర, లతా వృత్తిరీత్యా సన్నిహితులు. కాని ఆ స్నేహం చెదిరింది. లతా తమ్ముడు హృదయనాథ్ మిత్రుడైన రాజ్‌సింగ్ దుంగాపూర్ (క్రికెట్) లతాతో ప్రేమలో పడ్డాడని అంటారు. అయితే లతాతో పెళ్లికి రాజ్ సింగ్ రాజ కుటుంబం అంగీకరించలేదు. దాంతో అతడు అవివాహితుడిగా ఉండిపోయాడు. లతా కూడా. ఇదొక కథనం. లతాను ఆరాధించిన వారిలో గీత రచయిత సాహిర్ లుధియాన్వీ, గాయకుడు భూపేన్ హజారికా కూడా ఉన్నారు.
అజరామర ప్రేమ కథ..
రాజస్తాన్‌లోని దుంగాపూర్ రాజకుటుంబానికి చెందిన రాజ్‌సింగ్ ‘లా’ చదవడానికి 1959లో ముంబైకి వెళ్లారు. ఆయన క్రికెట్ ప్లేయర్. లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్‌కు కూడా క్రికెట్ అంటే ఇష్టం. ఆట వాళ్లిద్దరినీ స్నేహితులను చేసింది. హృదయనాథ్ కోసం రాజ్ సింగ్ మంగేష్కర్ ఇంటికి వెళ్లేవారు. అక్కడే తొలిసారిగా లతాను కలిశారు. పరిచయం స్నేహంగా మారింది. స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది.
చదువు పూర్తి చేసుకుని దుంగాపూర్‌కు వెళ్లిన తర్వాత రాజ్ సింగ్ లతాతో పెళ్లి విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కానీ రాజ కుటుంబానికి చెందిన అమ్మాయినే పెళ్లాడాలన్న షరతు ముందుంచడంతో ఆయనకు నిరాశ తప్పలేదు. అయితే, లత మీద ప్రేమను చంపుకోలేని ఆయన చివరి వరకు అవివాహితుడిగానే మిగిలిపోయారు. ఈ విషయాలను రాజ్‌సింగ్ బంధువు, బికనీర్ రాకుమారి రాజశ్రీ పుస్తకంలో రాశారు. రాజ్ సింగ్ లతాను ఆప్యాయంగా మిథూ అని పిలిచేవారని, వారి ప్రేమ అజరామరమని పేర్కొన్నారు.
కాగా 2009లో రాజ్ సింగ్ మరణించగా.. కడచూపు కోసం లతా రహస్యంగా దుంగాపూర్ వెళ్లారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక బీసీసీఐ అధికారిగా పనిచేసిన రాజ్ సింగ్... 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ప్రోత్సాహకం అందించేందుకు లతాతో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఒక్క పైసా కూడా ఆశించకుండా ఆమె అందుకు సమ్మతం తెలపడం.. తన పాట ద్వారా 20 లక్షలు సేకరించడం.. తద్వారా ఒక్కో సభ్యుడికి బీసీసీఐ లక్ష రూపాయలు ముట్టజెప్పడం జరిగింది.
చదవండి: Lata Mangeshkar: ప్రేమ గుడ్డిదని తెలుసు.. చెవిటిదని మొదటిసారి తెలుసుకున్నా అని లతా ఎందుకన్నారు?
Comments
Please login to add a commentAdd a comment