శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: శ్రీనివాసుని వైభోగం చూద్దాం రారండి! | lord sri venkateswara swamy vaibhogam special story | Sakshi
Sakshi News home page

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: శ్రీనివాసుని వైభోగం చూద్దాం రారండి!

Published Mon, Oct 7 2024 10:01 AM | Last Updated on Mon, Oct 7 2024 10:12 AM

lord sri venkateswara swamy vaibhogam special story

శ్రీవారి  బ్రహ్మోత్సవాలు అక్టోబరు 04, శుక్రవారం వైభవంగా ఆరంభమయ్యాయి. ఇవి 12వ తేదీ, శనివారం వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా... 

 

బంగారు తిరుచ్చి ఉత్సవం: అక్టోబర్‌ 4, శుక్రవారం ఉదయం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

సాయంత్రం ధ్వజారోహణం:  సాయంత్రం 5.45కు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు  ప్రాంరంభమయ్యాయి. 

7 – సోమవారం ఉదయం: కల్పవృక్ష వాహనం: నాలుగోరోజు ఉదయం స్వామి ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి దర్శనమిస్తారు. కల్పవృక్ష వాహన దర్శనం వరాలను అనుగ్రహిస్తుంది.

రాత్రి: సర్వభూపాల వాహనం... సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. దిక్పాలకులందరూ స్వామివారిని హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఇస్తున్నారు.

8 – మంగళవారం ఉదయం మోహినీ అవతారం: ఐదోరోజు ఉదయం మోహినీరూపంలో దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. తనకు భక్తులైనవారు మాయను సులభం గా దాటగలరని స్వామి ప్రకటిస్తున్నాడు.

సాయంత్రం గరుడ వాహనం: ఐదో రోజు రాత్రి గరుడవాహనంలో ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తారు. గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయి.

9 – బుధవారం ఉదయ: హనుమంత వాహనం: ఆరోరోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఇరువురినీ చూస్తే వేదాల తత్త్వం ఒనగూరుతుంది.

సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథం: ఆరోరోజు సాయంత్రం స్వామి స్వర్ణరథాన్ని అధిరోహించి అనుగ్రహిస్తాడు. స్వర్ణోత్సవ సేవలో కల్యాణకట్ట సేవాపరులు బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయం. 

రాత్రి 7 గంటలకు గజవాహనం... ఆరోరోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై భక్తులకు అభయ మిస్తాడు. భక్తులు శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని తెలుస్తోంది.

10 – గురువారం ఉదయం సూర్యప్రభ వాహనం: ఏడోరోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై  తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యప్రభ వాహనంపైన దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం సిద్ధిస్తాయి.

రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం: ఏడో రోజు రాత్రి స్వామి చంద్రప్రభ వాహనం పై విహరిస్తారు. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

11 – శుక్రవారం ఉదయం: శ్రీవారి రథోత్సవం: ఎనిమిదో రోజు ఉదయం ఉభయదేవేరులతో కూడిన స్వామి రథోత్సవం జరుగుతుంది.
రాత్రి 7 గంటలకు అశ్వవాహనం: ఎనిమిదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూ΄ాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని ప్రబోధిస్తున్నాడు.

12 – శనివారం ఉదయం 6 గంటలకు చక్రస్నానం: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుగుతుంది. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు ΄ాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో పుష్కరిణిలో స్నానం చేసిన వారు యజ్ఞఫలాన్ని  పొందుతారని ప్రతీతి..

రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణం:  శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావరోహణ ఘట్టంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
లక్ష్మీకాంత్‌ ఆలిదేనా, సాక్షి, తిరుమల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement