
భారతదేశానికి వెలుపల ఉన్న శివాలయాలలో నేపాల్ రాజధాని కఠ్మాండులోని పశుపతినాథ క్షేత్రం ప్రాచీనమైనది. పురాణేతిహాసాల్లో ఈ క్షేత్రం ఆవిర్భావం గురించి కొన్ని గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి శివుడు పార్వతీ సమేతంగా కాశీ నుంచి బయలుదేరి, భాగామతి నదీతీరంలో మృతస్థలి అనే ప్రదేశంలో జింకరూపంలో నిద్రించగా, శివుడిని తిరిగి కాశీకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో దేవతలు జింక కొమ్ము పట్టుకుని లాగారట. అప్పుడు ఆ కొమ్ము నాలుగు ముక్కలుగా విరిగి అక్కడ పడిందట. ఆ నాలుగు ముక్కలూ పడిన చోటే చతుర్ముఖ శివలింగం వెలసింది. ఈ ప్రాంతమే పశుపతినాథ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది అని చెబుతారు.
పశుపతినాథ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందనే దానిపై సరైన ఆధారాలేవీ లేవు. నేపాల్‌ను పరిపాలించిన రాచవంశానికి చెందిన ‘గోపాలరాజ వంశావళి’లో ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఆలయం క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నాటి నుంచే ఉనికిలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. పగోడాలా కనిపించే ఈ ఆలయం పైకప్పులపై బంగారు, రాగి తాపడం, ప్రధాన ద్వారాలకు వెండితాపడం కనిపిస్తాయి. ఈ ఆలయంలో దక్షిణభారత పూజారులే నిత్యార్చనలు జరపడం ఆనవాయితీగా కొనసాగుతోంది. మహాశివరాత్రి వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. భారత్ నుంచి కూడా వేలాదిమంది భక్తులు ఇక్కడకు తరలివస్తారు.
Comments
Please login to add a commentAdd a comment