గాయత్రీదేవి, ఇందిరా దేవి
ధరించే దుస్తుల నుంచి అలంకరించుకునే ఆభరణాల వరకు అన్నీ భారీగానే ఉంటాయి మహారాణులకు. మహారాణులంటే ఇలాగే ఉండితీరాలి అన్నట్టుగా ఉంటారు వారు. ఈ సంప్రదాయ ఆహార్యం ఓ మహారాణికి బాగా విసుగు పుట్టించింది. దీంతో ఆమె సాదాసీదా, బరువులేని వస్త్రాలు ధరించాలను కుంది. భారీగా కాకుండా సిల్క్‌తో తయారయ్యే షిఫాన్ చీరను కట్టుకుని పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో ఇండియాలో బాగా పాపులర్ అయ్యి, షిఫాన్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు ఆ రాణీగారు. అప్పటినుంచి ఇప్పటికీ షిఫాన్ చీరలు మగువల మనసులు దోస్తూనే ఉన్నాయి.
స్టైల్‌గానేగాక, ఎంతో సౌకర్యంగా ఉండే షిఫాన్ చీరలను ప్రపంచానికి పరిచయం చేసింది రాణి ఇందిరాదేవి. అప్పటి బరోడా రాష్ట్ర యువరాణి. కూచ్‌బెహర్ మహారాజా జితేంద్ర నారాయణ్‌ను వివాహం చేసుకున్న ఇందిరా దేవి ధరించే దుస్తులు చూపరులను అమితంగా ఆకర్షించేవి.
ఎప్పుడూ భారీగా ఉండే చీరలు, నగలు ధరించే ఇందిరకు వాటిమీద మొహం మెత్తేసింది. తేలికగా ఉండే చీరలను ధరించాలనుకుంది. ఎక్కువగా యూరప్‌లో పర్యటించే ఆమె ఎంతో ఖరీదైన షిఫాన్ వస్త్రాన్ని ఫ్రాన్స్ నుంచి తెప్పించుకుని ఆరుగజాల చీరను రాజవంశానికి తగ్గట్టుగా కళాకారులతో డిజైన్ చేయించి మరీ ధరించింది. అది ఆమెకు బాగా నప్పడంతోపాటు కట్టుకుంటే చాలా సౌకర్యంగా ఉండడంతో.. అప్పటి నుంచి షిఫాన్ చీరలనే ధరించేది. ఇలా షిఫాన్ చీరలను ఇందిర ఇండియాకు పరిచయం చేసింది.
తల్లికి తగ్గ వారసురాలిగా..
ఇందిర కూతురు జైపూర్ మహారాణి గాయత్రి దేవి కూడా అమ్మ షిఫాన్ చీరకట్టును అనుసరించింది. తల్లి ధరించినట్టుగానే షిఫాన్ చీర, నవరత్నాల నెక్లెస్, బాబ్డ్‌హెయిర్‌తో ప్రతి కార్యక్రమంలో పాల్గొనేది. షిఫాన్ చీరకట్టుతో అందంగా ఉండడంతో ప్రపంచంలోని పదిమంది అందమైన మహిళల్లో గాయత్రి దేవి ఒకరుగా నిలిచినట్లు 1960లో ఓ మ్యాగజీన్ పేర్కొంది. ఇందిరా, గాయత్రి షిఫాన్ చీరలు మహిళలను అమితంగా ఆకట్టుకోవడంతో.. అన్ని తరగతుల వారు వీటిని ధరించడం మొదలు పెట్టారు. అలా దేశవ్యాప్తంగా షిఫాన్ పాపులర్ అయ్యింది.
బ్రిటన్ మహారాణి తల్లి నుంచి ప్రిన్సెస్ డయానా వరకు అందరూ షిఫాన్‌ను వాడినవారే. వారి గౌనులు షిఫాన్‌తో తయారు చేయించుకుని అనేక కార్యక్రమాల్లో మెరిసిపోయేవారు. మహారాణుల నుంచి సామాన్యులు మెచ్చిన షిఫాన్‌ను సిల్క్ నుంచి రూపొందించేవారు. అప్పట్లో దీనిని సంపద, ప్రతిష్టకు గౌరవసూచికగా భావించేవారు. తర్వాత నైలాన్, సింథటిక్ ఫైబర్ అందుబాటులోకి రావడంతో పాలిస్టర్ షిఫాన్ అందుబాటులోకి వచ్చి ధరకూడా తగ్గింది. ఇప్పటికీ ఫ్రెంచ్‌లో తయారయ్యే షిఫాన్ ధర లక్షల్లోనే ఉంటుంది. ఒకరి విభిన్న ఆలోచనకు ప్రతిరూపమే నేటి షిఫాన్ చీరలు. ట్రెండ్ సెట్టర్‌లు కావాలంటే గుంపులో గోవిందా అనకుండా..వందమందిలో ఉన్నా ఒక్కరిలా నిలిచేలా సరికొత్తగా ఆలోచించాలి.
Comments
Please login to add a commentAdd a comment