‘ఇమా కీథెల్’ మార్కెట్
‘ఇమా కీథెల్’ అంటే ‘అమ్మ మార్కెట్’ అని అర్థం. 5000 మంది స్త్రీలు నడిపే ఈ మార్కెట్ మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఉంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన స్త్రీ నిర్వహణా మార్కెట్‌గా ఖ్యాతి చెందిన ఈ మార్కెట్ మార్చి 21, 2020లో కరోనా కారణంగా మూతపడింది. ఇన్నాళ్ల తర్వాత సోమవారం ఫిబ్రవరి 15న తెరుచుకుంది. దాదాపు 3,600 మంది మహిళా అమ్మకందార్ల ముఖాన చిరునవ్వును తెచ్చింది. ఈ మార్కెట్ విశేషాలు...
‘ఇమా’ అంటే ‘అమ్మా’ అని అర్థం మణిపురి భాషలో. ఇమా మార్కెట్‌లో దాదాపు 4 వేల మంది అమ్మలు స్టాల్స్ నడుపుతుంటారు. అందరూ యాభై ఏళ్ల పైబడినవారే. అందుకే వీరిని ‘అమ్మ’ అని పిలుస్తారు. కూరగాయలు, పండ్లు, వస్త్రాలు, స్థానికంగా తయారైన హస్తకళాకృతు లు... ఇవి వందలాదిగా స్టాళ్లు ఏర్పాటు చేసి అమ్ముతుంటారు. ఇంఫాల్‌లో మాత్రమే కాదు, భారతదేశంలో మాత్రమే కాదు, ఆసియాలో మాత్రమే కాదు, మొత్తం ప్రపంచంలోనే కేవలం స్త్రీలు మాత్రమే అమ్మకందార్లుగా ఉండే ఏకైక పెద్దమార్కెట్‌గా ఇమా మార్కెట్ ఖ్యాతి గడించింది.
‘ఇమా మార్కెట్‌లో మగవాళ్లు రావచ్చు. సరుకులు కొనవచ్చు. కాని వారు అక్కడ అమ్మకందార్లు మాత్రం కాలేరు’ అని అంటారు అమ్మలు. మగవాళ్లు పెత్తనం చేసే మణిపూరి కుటుంబ జీవనంలో దాదాపు 500 ఏళ్ల క్రితం తమ స్వావలంబన కోసం అక్కడి స్త్రీలు ఏర్పాటు చేసుకున్న మార్కెట్ అది. ఆ రోజుల్లో అదో పెద్ద సామాజిక విప్లవం. కాలం ఎంత మారినా మార్కెట్ మారలేదు. మగవారి హస్తగతం కాలేదు. స్త్రీల చేతుల నుంచి జారిపోలేదు. ఇవాళ్టికీ స్త్రీలదే దాని మీద అధికారం. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం కూడా ఏ మాత్రం జోక్యం చేసుకోదు. ‘మమ్మల్ని అనుమతిస్తే నెలలో ఒకరోజు మా సిబ్బంది వచ్చి శుభ్రం చేసి వెళతారు’ అని సాక్షాత్తు అక్కడి ముఖ్యమంత్రి ఆ మార్కెట్‌లో ఉండే స్త్రీలను కోరారంటే వారు ఎంత స్వయం నిర్ణయాధికారంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
సమస్యల కరోనా
ఇమా మార్కెట్‌లో రిజిస్టర్ అయిన అమ్మకందార్లు 3,600 మంది ఉన్నారు. తమ స్టాల్స్ ద్వారా వచ్చే ఆదాయంతో వీరు కుటుంబాన్ని నిర్వహిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే మగవారి నిర్బాధ్యతకు వెరవక వీరు ఈ స్టాల్స్ ద్వారా నిశ్చింతగా ఉంటారు. అయితే కరోనా రూపంలో చింత రానే వచ్చింది. మార్కెట్ అంటే జన సమృద్ధి. ఇమా మార్కెట్ అంటే నిత్యం వేల మంది వచ్చేపోయే చోటు. కనుక అది కరోనాకు హాట్‌స్పాట్‌లాంటిది. అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించి మార్చి 21, 2020న ఆ మార్కెట్‌ను మూసేయించింది. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు. మార్కెట్ మూత పడితే ఎలా బతకాలో ఆ అమ్మలకు తెలియదు. కాని అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి.
కష్టాలపై సాగిన పోరాటం
‘కొంచెం ఆర్థికంగా బాగున్నవారు తట్టుకున్నారు. చిన్న స్టాల్స్ ఉన్నవారు చాలా కష్టాలు పడ్డారు’ అంది ఇమా మార్కెట్‌లో నలభై ఏళ్లుగా స్టాల్ నడుపుతున్న ఒక 70 ఏళ్ల అమ్మ. మార్కెట్ మూతపడటంతో స్త్రీలు వేరే ఉపాధి కోసం చిన్న చిన్న పనుల కోసం వెళ్లాల్సి వచ్చింది. మార్కెట్ తెరవమని మొరపెట్టుకోవాల్సి వచ్చింది. మార్కెట్ మూత పడటం వల్ల ఈ తొమ్మిది నెలల్లో వచ్చిన నష్టం దాదాపు 4000 కోట్లు అంటే అక్కడ స్టాళ్లు నడిపే స్త్రీల చేతుల మీద ఎంత డబ్బు తిరిగేదో అర్థం చేసుకోవచ్చు. ‘ఇమా మార్కెట్ కేవలం వ్యాపార కూడలి కాదు. ఒక సాంస్కృతిక కేంద్రం కూడా. సామాజిక దురాచారాలపై స్త్రీలు ఈ మార్కెట్‌లోనే అవగాహన పెంచుకుని తిరగబడ్డారు. అంతేకాదు... ఒకరికొకరు అండగా నిలిచి తమను తాము బలపరుచుకున్నారు’ అని చెబుతారు విశ్లేషకులు.
తిరిగి వచ్చిన చిరునవ్వు
ఎట్టకేలకు కరోనా తగ్గుముఖం పట్టింది. మొన్నటి ఫిబ్రవరి 15న ఇమా మార్కెట్ తిరిగి తెరుచుకుంది. ఇంత కాలం మార్కెట్‌కు దూరమైన అమ్మలందరూ మళ్లీ మొలకెత్తిన చిరునవ్వుతో మార్కెట్‌కు వచ్చారు. కూరలు వచ్చాయి. పండ్లు వచ్చాయి. గల్లాపెట్టెలు తెరుచుకున్నాయి. సందడి మొదలయ్యింది. ‘కరోనా దృష్ట్యా ఈ సంవత్సరం మార్కెట్‌లో ప్రతి స్టాల్ కట్టాల్సిన కార్పొరేషన్ ఫీజును రద్దు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి ఈ సందర్భం గా ప్రకటించారు. ‘మేము మా కుటుంబాలను ప్రాణాలను ఉగ్గపట్టుకుని కూచున్నాం... ఎందుకంటే మా మార్కెట్ తెరుచుకుంటే మేము తిరిగి బతకగలం అనే నమ్మకంతో’ అని ఒక మహిళా వెండర్ చెప్పింది. ఇమా మార్కెట్ కేవలం వ్యాపార లావాదేవీలకే కాక స్త్రీ చేయగలిగే శ్రమకు, సామర్థ్యానికి కూడా ఒక గుర్తు. ఆనవాలు. ఇమా మార్కెట్‌లాంటి మార్కెట్ ప్రతి పెద్ద నగరంలో ఉంటే మరిన్ని కుటుంబాలకు కేవలం నాన్నల మీదే ఆధారపడాల్సిన అవస్థ తప్పుతుంది. – సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment