ఇంఫాల్: మణిపూర్‌లో కొండ ప్రాంతాలతో కూడిన పలు జిల్లాల్లో సోమావారం కుకీ జో తెగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన రాల్యీలు చేపట్టాయి. మణిపూర్‌లో తెగల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలకు ముగింపు పలికి.. తామను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కుకీ తెగ ప్రజలు డిమాండ్ చేశారు.
మణిపూర్‌లో తరచూ చెలరేగుతున్న జాతుల మధ్య ఘర్షణలకు పరిష్కారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 239ఏ ప్రకారం తమకు అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కుకీ తెగ ప్రజలు పెద్దఎత్తున చురచంద్‌పూర్, కాంగ్‌పోక్పి, చందేల్, ఫెర్జాల్-జిరిబామ్, తెంగ్నౌపాల్ పర్వత జిల్లాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన మంత్రి మణిపూర్ సందర్శించి.. తాము ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులను చూసి సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్‌ను వేగవంతం చేయాలని కోరుతూ.. కుకీ జో తెగ సంఘాలు జిల్లా అధికారుల ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మెమోరాండం సమరర్పించినట్లు తెలిపారు. చురచంద్‌పూర్ జిల్లా బీజేపీ ఎమ్యెల్యే పౌలియన్‌లాల్ హాకిప్ మీడియాతో మాట్లాడారు. ‘ కుకీ జో ఎమ్మెల్యేలు ప్రధాని మోదీని కలవాలని ఏడాది క్రితం విజ్ఞప్తి చేశాం. కానీ ఇప్పటికీ మాకు అనుమతి లభించలేదు. ఇక.. ఇప్పడు ప్రధాని మోదీ మా తెగల ఘర్షణకు పరిష్కారం చూపాలనుకుంటే ఇక్కడికే( మణిపూర్) రావాలి’అని అన్నారు.
వీరికి వ్యతిరేకంగా ఇంఫాల్ వ్యాలీలో మైతేయి తెగకు సంబంధించిన మహిళా సంఘాలు మార్చ్ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం కుకీ మిలిటెంట్లకు మద్దతుగా ఉండొద్దని.. ‘ప్రత్యేక పరిపాలన వద్దు. గ్రామ వాలంటీర్ల అరెస్టు చేయొద్దు’ అనే నినాదాలతో భారీ సంఖ్యలో మహిళలు డిమాండ్ చేశారు.
ఇక.. మే 3, 2023 నుంచి మణిపూర్‌లోని వ్యాలీ ప్రాంతాల్లో నివసించే మైతేయి తెగ, పర్వత ప్రాంతాల్లో ఉండే కుకీ జో తెగల మధ్య అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అల్లర్లతో ఇరు తెగల మధ్య తీవ్రమైన హింస చెలరేగటంతో 220 మంది మృతి చెందారు. ఈ ఘర్షణల్లో వేలమంది గాయపడ్డారు. ఘర్షణలు తట్టుకోలేక వేలమంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment