రోల్స్‌రాయిస్, జాగ్వార్, బెంట్లీ, లాగోండా, క్యాడిలాక్, ఆస్టిన్, మెర్సిడెస్, ఆంబుమ్స్, హెచ్‌జె ముల్లినర్, అర్థర్ ముల్లినర్, విండోవర్స్, పార్క్ వార్డ్... ఈ కార్లన్నింటినీ ఒకే చోట చూడాలంటే దస్తన్ ఆటోవరల్డ్ వింటేజ్ మ్యూజియానికి వెళ్లాలి. మన హైదరాబాద్‌లో నిజాం నవాబు సేకరించిన కార్లను చౌమొహల్లా ΄్యాలెస్‌లో చూడవచ్చు. ఈ కలెక్షన్‌కు పదింతలు పెద్ద కలెక్షన్ అహ్మదాబాద్‌లోని ఆటో వరల్డ్ వింటేజ్ మ్యూజియంలో ఉంది. రెండువేల రెండు వందల ఎకరాల్లో విస్తరించిన ఈ మ్యూజియంలో మూడు వందలకు పైగా మోటారు వాహనాలుంటాయి. గాంధీ సినిమాలో ఉపయోగించిన మేబాష్ కారును కూడా చూడవచ్చు. అలాగే 1923 రోల్స్ 20 మోడల్ కూడా ఉంది. అహ్మదాబాద్ నగర శివారులో సర్దార్ పటేల్ రింగ్‌రోడ్, కత్‌వారాలో ఉన్న ఓ ఉన్న ఈ మ్యూజియం గిన్నిస్ రికార్డ్స్‌లో నమోదైంది.
ప్రియమైన ప్రయాణం!
ఈ మ్యూజియంలో ఉన్న బైక్‌లు, గుర్రపు బగ్గీలు, కార్లను సేకరించిన వ్యక్తి పేరు ప్రణ్‌లాల్ భోగిలాల్. రకరకాల కార్ల మీద ఆయనకున్న మోజు ఇలా మ్యూజియం రూపంలో కొలువుతీరింది. ఈ కార్లతో ఫొటో తీసుకోవాలనే సరదా కలిగితే ఒక్కో ఫొటోలకి వంద రూపాయలిచ్చి ఫొటో తీసుకోవచ్చు. వింటేజ్ కారులో ప్రయాణించాలనే సరదా కలిగితే అదీ సాధ్యమే. అయితే అత్యంత ప్రియమైన ప్రయాణమనే చెప్పాలి. ట్రిప్‌కి వెయ్యి రూపాయల వుతుంది. బరువైన బాడీ, పాత మోటర్లు కావడంతో నాలుగు లీటర్ల పెట్రోలు పోస్తే కిలోమీటరు ప్రయాణిస్తాయి. టూరిస్టులను మ్యూజియం బయటకు రెండు–మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకువస్తారు. కారు ఎక్కేటప్పుడు ఒకరు వచ్చి డోర్ తీస్తారు, కూర్చోగానే డోర్ వేసేసి సెల్యూట్ చేస్తారు. తల΄ాగా చుట్టుకున్న డ్రైవర్ మన ఫోన్ తీసుకుని ఒక ఫొటో తీసిచ్చి ఆ తర్వాత కారు నడుపుతాడు.
గంట కొట్టే కారు
మ్యూజియం ఉద్యోగులు మేబాష్ కారును చూపిస్తూ ‘ఇది మేబాష్ తొలి కారు. ఈ కారును డిజైన్ చేసిన వ్యక్తి మనుమడు జర్మనీ నుంచి వచ్చి చెందిన 6 సిలిండర్ మేబాష్ కారును తనకు అమ్మవలసిందిగా కోరాడని, తన ఆటో ట్రెజరీ నుంచి అంత విలువైన కారును వదులుకోవడానికి ప్రాణ్‌లాల్ మనసు అంగీకరించలేదని చెబుతారు. ఈ మ్యూజియం అంతటినీ తిరిగి చూడాలంటే ఐదారు గంటలు పడుతుంది. సుడిగాలి పర్యటనలా చుట్టిరావాలన్నా కూడా మూడు గంటల సమయం పడుతుంది. గంట కొడుతూ ప్రయాణించే కారు చిన్న పిల్లలను ఆకట్టుకుంటుంది. ఇంజన్ మోడల్, చాసిటీ వంటి వివరాలు యువతను కట్టిపడేస్తాయి. ఇక్కడ పర్యటిస్తే ప్రపంచంలో మోటారు రంగం ఆవిర్భావం నుంచి నేటి వరకు పరిణామక్రమం అవగతమవుతుంది. దస్తన్ ఆటో వరల్డ్ వింటేజ్ మ్యూజియంలోకి ఎంట్రీ టికెట్ వంద రూపాయలు, పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌లో కాంప్లిమెంటరీ టీ ఇస్తారు. అహ్మదాబాద్ వెళ్లినప్పుడు గాంధీ ఆశ్రమం, సయ్యద్ సిద్ధిఖీ జాలీలతోపాటు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది.
– వాకా మంజులారెడ్డి,
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment