ఇటీవల ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ దివ్యాంగ పిల్లవాడిని విమానంలో ఎక్కడానికి అనుమతించలేదు. ‘‘ప్రత్యేక అవసరాలు కలిగిన ఇతనివల్ల మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడతారు’’ అని సాకును చూపిస్తూ పిల్లవాడిని విమానంలోకి ఎక్కడానికి నిరాకరించింది. ఈ సంఘటనను చూసిన వారంతా..ఇంత చిన్నచూపా? ఇదేం పని? అంటూ విమర్శిస్తూనే వారి అమానుషత్వాన్ని తీవ్రంగా ఖండించారు. అయితే 35 ఏళ్ల నమ్రత మాత్రం అందరిలా ‘అయ్యోపాపం’ అనో, పిడికిళ్లు బిగించో ఊరుకోలేదు.
దివ్యాంగులను విమాన సిబ్బంది అలా ఎలా అడ్డుకుంటారు? ఇది సరైంది కాదంటూ ఏకంగా ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. ‘‘నాకు ఒక చెవి వినపడదు. చుట్టూ ఉన్నవారు నన్ను ఎంత అవహేళనగా చూస్తారో ఆ బాధ నాకు తెలుసు’’ అని చెబుతూ తనలా సమాజంలో వివక్షకు గురవుతోన్న ఎంతోమంది అట్టడుగు వర్గాల వారి తరపున నిలబడి పోరాడుతోంది నమ్రత.
మేఘాలయకు చెందిన అమ్మాయి నమ్రతాశర్మ. గోర్ఘా కమ్యునిటీలో ఎనిమిదో తరానికి చెందిన అమ్మాయి. నాగాలాండ్‌లో పుట్టడడం వల్ల నమ్రతకు నేపాలీ కూడా మాట్లాడం వచ్చు. మేఘాలయలో పోస్ట్రుగాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత గ్రామీణాభివద్ధి సెక్టార్‌లో ఉద్యోగం రావడంతో బీహార్ వెళ్లింది.
ఉద్యోగం వల్ల వినికిడి పోయింది...
ఎవరికైనా ఉద్యోగం వస్తే కష్టాలన్నీ పోయి సంతోషంగా అనిపిస్తుంది. నమ్రతకు మాత్రం ఉద్యోగంతో పెద్ద కష్టమే వచ్చింది. మేఘాలయాలో పెరిగిన నమ్రత ఉద్యోగరీత్యా బీహార్‌కు వచ్చింది. అక్కడి వాతావరణం మేఘాలయకు పూర్తి భిన్నంగా ఉండడంతో ఆమెకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఉద్యోగ విషయంలో అంతా బాగానే ఉన్నప్పటికీ వేడి ఎక్కువగా ఉండడం వల్ల తరచూ డీహైడ్రేషన్‌కు గురయ్యేది. ప్రారంభంలో సర్దుకున్నప్పటికీ క్రమంగా తన చెవి నరాలు ఎండిపోయి వినికిడి శక్తిని కోల్పోయింది. తనతో ఎవరు మాట్లాడినా సరిగా వినిపించేది కాదు. దీంతో తన సహోద్యోగులంతా ‘హే చెవిటిదానా’ అని పిలిచి పెద్దగా నవ్వుకునేవారు. నమ్రత మాటల్లో నేపాలీ యాస ధ్వనించడంతో ‘ఏ నేపాలీ’ అని కూడా ఆమెను కించపరిచేవారు. ఇలా పదేపదే జరగడంతో నమ్రతకు చాలా బాధగా అనిపించేది.
గొంతుకగా నిలవాలని
కొంతమంది తనకు సాయం చేస్తామని చెప్పి ఆమె మీద జోకులు వేసి నవ్వుకోవడాన్ని భరించలేని నమ్రతకు... ‘‘నాకు ఒక్క చెవి వినపడకపోతేనే ఇలా గేలిచేస్తున్నారు. కొంతమందికి పూర్తిగా వినపడదు. అలాంటి వాళ్ల పరిస్థితి ఏంటీ?’’ అనిపించింది. ఇలా అవమానాలు ఎదుర్కొంటోన్న వారికి సాయపడాలని నిర్ణయించుకుంది. దళిత, ఆదివాసి మహిళలు, అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు ఎవరైతే వినికిడి శక్తిని కోల్పోయారో, మాట్లాడలేరో, అలాంటి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి గొంతుకగా నిలబడుతోంది. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకోసం నమ్రత వేసిన పిటిషన్ ఇది తొలిసారి కాదు.
గతంలో కూడా నమ్రత బెంగళూరులో ఉన్నప్పుడు.. అక్కడ ఉన్న ఒకే ఒక డెఫ్ ఇన్‌స్టిట్యూట్ ‘టెక్నికల్ ట్రై నింగ్ స్కూల్’ను మెట్రో నిర్మాణంలో భాగంగా కూల్చివేయాలని నిర్ణయించారు. ఈ స్కూలును కూల్చవద్దని పిటిషన్ వేసింది. దీనికి అక్కడి స్థానికులు కూడా మద్దతు తెలపడంతో స్కూలు కూల్చడాన్ని మెట్రో అధికార యంత్రాంగం వాయిదా వేసింది. ఆ తర్వాత ‘పాతాల్‌లోక్’ వెబ్ సిరీస్ లో ఈశాన్య దేశాల ప్రజలను కించపరిచే విధంగా మాటలు ఉన్నాయని, వాటిని తొలగించాలని పిటిషన్ వేసింది. ఇలా సమాజంలో ఎదురయ్యే అనేక వివక్షలను గొంతెత్తి ప్రశ్నిస్తూ ఎంతోమందికి కనివిప్పు కలిగిస్తూ సమాజాభివద్ధికి తనవంతు సాయం చేస్తోంది నమ్రత.
మానవత్వం చూపాలి
మనుషులమని మర్చిపోయి ప్రవర్తించడం చాలా బాధాకరం. మనుషుల్లో కొంతమంది పొడవుగా, మరికొంతమంది పొట్టిగా, వివిధ రకాల రంగూ, రూపురేఖలతో విభిన్నంగా ఉంటారు. అంతమాత్రాన వాళ్లు మనుషులు కాకుండా పోరు. ఎటువంటి లోపాలు, అంతరాలు ఉన్నప్పటికీ వాళ్లు మనలాంటి మనుషులని గుర్తించాలి. వికలాంగుల పట్ల వివక్ష చూపకూడదు. మానవత్వం చూపాలి.
– నమ్రతా శర్మ
Comments
Please login to add a commentAdd a comment