దీక్షాసింగ్ : మోడల్, ప్రస్తుతం యు.పి. పంచాయతీ ఎన్నికల అభ్యర్థి
మిస్ ఇండియా–2015 లో ‘మిస్ బాడీ బ్యూటిఫుల్’ టైటిల్ విజేత దీక్ష యూపీ పంచాయితీ ఎన్నికల్లో జాన్‌పుర్ లోని బక్షా‘గ్రామ ప్రధాన్’గా పోటీ చేస్తున్నారు. నాలుగు విడతల ఆ ఎన్నికల్లో మొదటి విడతలోనే జాన్‌పుర్ జిల్లా ఉంది. పోలింగ్ ఏప్రిల్ 15 న. మే 2న ఫలితాల వెల్లడి. ‘‘నా చిన్నప్పుడు జాన్‌పుర్ ఎలా ఉందో ఈ రోజుకీ అలానే ఉంది. ఆ పరిస్థితిని మార్చేందుకే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను’’ అని దీక్ష (24) అంటున్నారు.
వాస్తవానికి దీక్ష ఇప్పటికే తన కెరీర్‌ని నిర్మించుకునే క్రమంలో వయసుకు మించిన గుర్తింపే తెచ్చుకున్నారు. ప్రధానంగా ఆమె మోడల్. పెద్ద పెద్ద కంపెనీలకు మోడలింగ్ ఇచ్చారు. త్వరలోనే వెబ్ సీరీస్‌లో కనిపించబోతున్నారు. ‘ఇష్క్ తేరా’ అనే ఒక సినిమా కథను రాసి, సినిమాగా తెరకు ఎక్కించేందుకు దర్శక నిర్మాతల కోసం చూస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె విడుదల చేసిన మ్యూజిక్ ఆల్బమ్ ‘రబ్బా మెహర్ కరే’కు నెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది.
ఇవన్నీ చేస్తున్న దీక్ష ఇప్పుడిక పంచాయితీ ఎన్నికల్లో గ్రామ ప్రధాన్‌గా పోటీ చేస్తున్నారు. ఆమె పోటీ చేస్తున్నది 26 వ నెంబరు వార్డు అభ్యర్థిగా. ఆ వార్డు పేరు బక్షా. దీక్ష పుట్టింది అక్కడే.. బక్షా ప్రాంతంలోని చిత్తోరి గ్రామంలో. ఆ గ్రామం జాన్‌పుర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. బక్షా గ్రామ ప్రధాన్‌గా గెలిచి, క్రమంగా జాన్‌పుర్ జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి జరపాలని దీక్ష ఆశిస్తున్నారు. అందుకు కారణం ఆమె చిన్నప్పుడు జాన్‌పుర్ ఎలా ఉందో ఇప్పటికీ ఏ అభివృద్ధీ జరగకుండా అలాగే ఉండటం!
మిస్ ఇండియా 2015లో ‘మిస్ బాడీ బ్యూటిఫుల్’గా టైటిల్ గెలుచుకున్నప్పుడు దీ„ý వయసు 18. అప్పుడు ఆమె ముంబైలో బి.ఎ.సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అప్పుడే ఫ్రెండ్స్ ప్రోద్బలంతో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. ఆమె తండ్రి జితేంద్ర సింగ్ బిజినెస్‌మేన్. ముంబై, గోవా, రాజస్థాన్‌లలో వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. అలా వాళ్ల కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పుర్ నుంచి ముంబైకి మారింది. దీక్ష ఇష్టాలు, ఆసక్తులు కూడా మారి మోడలింగ్ రంగంలోకి వెళ్లిపోయారు. ముంబైలో ఉంటున్న దీక్ష తరచు జాన్‌పుర్ వస్తుంటారు.
ఈసారి అలా వచ్చినప్పుడే పంచాయితీ ఎన్నికల్లో నిలబడాలన్న ఆలోచన ఆమెకు కలిగింది. ‘‘చదువుకున్న అమ్మాయి కదా. నువ్వు గ్రామ ప్రధాన్ అయితే గ్రామం బాగుపడుతుంది. అంతే కాదు.. రాజకీయాల్లో నువ్వు పైపైకి ఎదిగిన కొద్దీ ఊరు, జిల్లా, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతాయి’’ అని ఊళ్లోని పెద్దలు మద్దతు ఇచ్చారు. తల్లి, తండ్రి కూడా సరేనన్నారు. అంతే.. ఏప్రిల్ 3 న నామినేషన్ వేశారు దీక్ష. ఆమె ఆ ఊళ్లో మూడో తరగతి వరకు చదివారు. గ్రామ ప్రధాన్‌గా ఎన్నికైతే కనుక అదే ఊరి చేత అభివృద్ధి అక్షరాలను దిద్దించబోతారు దీక్ష.
Comments
Please login to add a commentAdd a comment