దివ్యాంగుల ప్రతిభకు ఉపాధి సాధనంగా..
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు
తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్/సీఎస్‌ఆర్ చేయూత
కంటోన్మెంట్: దివ్యాంగుల సాధికారత కోసం కృషి చేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మిట్టీ కేఫ్ ఆధ్వర్యంలో బొల్లారం రాష్ట్రపతి నిలయం ఆవరణలో నూతన కెఫే ఏర్పడింది. పూర్తిగా దివ్యాంగుల ఆధ్వర్యంలో నిర్వహణ సాగే ఈ కెఫే ఏర్పాటుకు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్/ గ్రూప్ సిఎస్‌ఆర్ వింగ్ చేయూతను అందిస్తుంది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది సందర్భంగా ఈ మిట్టీ కేఫ్‌ను అధికారికంగా ప్రారంభించారు.
మానసిక, శారీరక ఆరోగ్య వైకల్యం కలిగిన వారి సమస్యలను సమాజం దృష్టికి తెచి్చ, స్పందించేలా చేసేందుకు ఈ మిట్టీ కేఫ్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, సుప్రీం కోర్టు కాంప్లెక్స్‌తో పాటు పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 47కి పైగా ప్రదేశాల్లో మీట్టీ కేఫ్‌లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకురాలు స్వర్ణభ మిత్ర వివరించారు.
ఏమిటీ మిట్టీ కేఫ్?
ఈ కేఫ్‌లలో ప్రత్యేకంగా నెలకొల్పిన స్టాల్‌లో దివ్యాంగులు స్వయంగా రూపొందించిన గృహాలంకరణ పరికరాలు, పిల్లల ఆట వస్తువులు, నోటు పుస్తకాలు, పెన్నులు విక్రయిస్తున్నారు. సామాజిక దృక్పథంతో ఏర్పాటు చేస్తున్న మిట్టీ కేఫ్ ఆలోచనను గుర్తించి, వాటి నిర్వహణకు సీఎస్‌ఆర్ కింద పలు ప్రభుత్వరంగ, ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కేఫ్‌లను పలువురు సెలిబ్రిటీలు సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
దివ్యాంగులకు ఉపాధి..
నగరంలోని రాష్ట్రపతి నిలయం అధికారులు ఉచితంగా కేటాయించిన స్థలంలో మిట్టీ కేఫ్‌ను నెలకొల్పారు. ఇందులో 15 మంది మానసిక, శారీరక వైకల్యం కలిగిన వ్యక్తులు ఈ కేఫ్‌ను స్వయంగా నడుపుతున్నారు. వీరికి నెలకు రూ.15 వేల నుండి రూ.50 వేల వరకూ వేతనంగా అందుతుంది. ఆర్థిక స్వావలంబన, ఆత్మ గౌరవంతో జీవించేందుకు మిట్టీ కేఫ్ అండగా ఉంటున్నట్లు నిర్వాహకురాలు స్వాతి తెలిపారు.
కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ..
మిట్టీ కేఫ్‌లలో సమోసా, చాట్, పకోడీ, మసాలా టీ, బిస్కెట్లు, కాఫీ, మ్యాగీ, శాండ్ విచ్, పలు రకాల ఐస్క్రీమ్స్, ఇతర చిరుతిండ్లు స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటికి అవసరమైన పెట్టుబడి, నిర్వహణా ఖర్చులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆ్రస్టేలియా–న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూపులు భరిస్తున్నాయి. దీనికి తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ సిఎస్‌ఆర్ వింగ్ చొరవ తీసుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపుతోంది. రూ. 36–46 లక్షలు టర్నోవర్ దిశగా కృషి చేస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల శీతాకాల విడిదికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిట్టి కేఫ్‌ను సందర్శించారు. పలు వస్తువులు కొనుగోలు చేసి నిర్వాహకులను, ఉద్యోగులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment