నాటి అమెరికన్‌ ప్రెసిడెంట్లు ఇప్పుడు ఎలా ఉండేవారో.. | Modrenised Dead American Presidents Pictures Made By American Comic BookWriter | Sakshi
Sakshi News home page

నాటి అమెరికన్‌ ప్రెసిడెంట్లు ఇప్పుడు ఎలా ఉండేవారో..

Published Fri, Feb 26 2021 12:39 AM | Last Updated on Fri, Feb 26 2021 2:44 AM

Modrenised Dead American Presidents Pictures Made By American Comic BookWriter  - Sakshi

మొన్న అమెరికన్‌ ప్రెసిడెంట్‌ గా ప్రమాణ స్వీకారం చేసింది జో బైడెన్‌ కాదనుకుందాం. అబ్రహం లింకన్‌ అనుకుందాం! పోనీ థామస్‌ జెఫర్సన్, పోనీ జాన్‌ ఆడమ్స్, పోనీ జేమ్స్‌ మ్యాడిసన్‌ అనుకుందాం. పోనీ అమెరికన్‌ ఫస్ట్‌ ప్రెసిడెంట్‌ జార్జి వాషింగ్టన్నే మొన్న స్వోర్న్‌–ఇన్‌ చేశారని అనుకుందాం. రాతియుగం నాటి ఆ ప్రెసిడెంట్‌ ల ముఖాలు ఈ పాలరాతి యుగంలో ఎలా ఉంటాయి? ఎంత పాలిష్డ్‌ గా, ఎంత ఫెయిర్‌ గా, ఎంత గ్లో గా, ఎంత లవ్లీ గా, ఎంత స్మార్ట్‌ గా.. అండ్, ఎంత ముద్దుగా (సేమ్‌ అదే వయసులో) ఉంటాయి? ఎలా ఉంటాయో అవార్డ్‌ విన్నింగ్‌ అమెరికన్‌ కామిక్‌ బుక్‌ రైటర్‌ ఒకావిడ ఊహించి పెయింట్‌ చేశారు! ‘అబ్బ! ఈ ప్రాచీన పురుష విగ్రహాలను ఇంతగా ఎలా ఈ న్యూ ఏజ్‌ లోకి మోసుకు రాగలిగారండీ..‘ అంటే.. ‘ఏం లేదు. ముఖం పై కనిపించీ కనిపించకుండా కాస్త స్మైల్‌ పులిమానంతే..’ అని ఆమె నవ్వుతూ చెబుతున్నారు.

ఫొటోగ్రఫీ పుట్టక ముందే యూఎస్‌ ప్రెసిడెంట్‌ పుట్టారు! సరాసరి ప్రెసిడెంట్‌గా పుట్టడం కాదు లెండి. యూఎస్‌కు స్వాతంత్య్రం వచ్చాక తొలి అధ్యక్షుడిగా జార్జి వాషింగ్టన్‌ 1789 లో ప్రమాణ స్వీకారం చేస్తే, 1826 లోనో 1827 లోనో మానవాళికి ఫొటోగ్రఫీ చేతనైంది. అంతకు పూర్వం, ఆ తర్వాత కూడా ఏళ్ల పాటు అమెరికన్‌ అధ్యక్షులు చిత్రలేఖనాల్లో మాత్రమే ఫొటోలుగా ఉండేవారు. యు.ఎస్‌. ప్రెసిడెంట్‌లు వచ్చి ఇప్పటికి 232 ఏళ్లు గడిచాయి. ఫొటోలు వచ్చి 195 ఏళ్లు అయ్యాయి. ఇన్నేళ్లగా పాలకులు నాగరికం అవుతూ వస్తున్నట్లే ఫొటోగ్రఫీ కూడా అత్యాధునికం అవుతూ వచ్చింది. అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ కనుక మొన్న జో బైడెన్‌కు బదులుగా ప్రమాణం స్వీకారం చేసి ఉంటే అప్పటికన్నా ఆయన భిన్నంగా ఉండేవారు. అలాగే ఆ పందొమ్మిదో శతాబ్దపు అధ్యక్షులంతా! అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ కూడా మోడర్న్‌గా ఉండేవారు. ఏమిటీ వింత ఊహ! వింత ఊహే కానీ ఆసక్తిని కలిగించే ఊహ. ప్రముఖ కామిక్‌ పుస్తకాల అమెరికన్‌ రచయిత్రి 36 ఏళ్ల మగ్దలీన్‌ విసాజియోకు వచ్చిన ఒక ‘అందమైన’ ఆలోచన ఇది.

ఆలోచన వచ్చిన వెంటనే ఆమె తొలినాళ్ల అమెరికా అధ్యక్షులను ఎంపిక చేసుకుని వారిని ఈ కాలానికి తగ్గట్లుగా ఫొటో తీశారు! అలాగని ఆమె చిత్రకారిణి గానీ, ఫొటోగ్రాఫర్‌ కానీ కాదు. తన స్మార్ట్‌ ఫోన్‌లోని ఫేస్‌యాప్, ఎయిర్‌ బ్రెష్‌లను ఉపయోగించి అధ్యక్షుల వారిని ఆధునాతనంగా ‘చిత్రీకరించారు’. మగ్దలీన్‌ ఇప్పటి వరకు ఐదు సార్లు కామిక్‌ పుస్తకాలకు ఇచ్చే ఔట్‌స్టాండింగ్‌ అవార్డులకు నామినేట్‌ అయ్యారు. ఫేస్‌ మార్ఫింగ్‌కి ప్రత్యేకంగా అవార్డులు ఉంటే కనుక ఈ ముఖ రచనలకు నామినేట్‌ అవడమే కాదు, తప్పనిసరిగా అవార్డును సాధిస్తారు కూడా. అంత నాణ్యంగా, ఓ గంట క్రితమే ఈ అధ్యక్షులు అందరూ దివి నుంచి భువికి దిగి, మేకోవర్‌ చేయించుకుని వచ్చినట్లుగా ఉన్నారంటే అది.. పోలికలు పోకుండా పూర్వపు ఏలికల్ని సృష్టించిన మగ్దలీన్‌ ప్రావీణ్యమే! ఒక్కో ఫొటోకి జీవం పోయడానికి 15–30 నిముషాలు మాత్రమే పట్టిందట. అమెరికా తొలి పదిహేడు మంది అధ్యక్షుల ఆధునిక రూపాలివి. జో బైడెన్‌ అమెరికా 46వ అధ్యక్షుడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement