అమ్మ చేతి తీపి రుచి | Mother Hand Taste in Organic Sweets of Mother's Made | Sakshi
Sakshi News home page

అమ్మ చేతి తీపి రుచి

Published Mon, Feb 1 2021 4:54 AM | Last Updated on Mon, Feb 1 2021 4:55 AM

Mother Hand Taste in Organic Sweets of Mother's Made - Sakshi

నీలూ భండారీ

పిల్లల బాధ్యతలు తీరాక అమ్మలకు కొంత విశ్రాంతి లభిస్తుంది. అది బాగా డబ్బు ఉన్నవారికైనా, మధ్యతరగతి జీవితంతో నెట్టుకొస్తున్నవారికైనా. ఆ విశ్రాంత సమయాన్ని కొందరు మాత్రం ఉపయుక్తంగా, తమ కలలు నెరవేర్చుకోవడానికి కృషి చేస్తుంటారు. వారిలో నీలూ భండారి ఒకరు. 64 ఏళ్ల వయసులో ‘మదర్స్‌ మేడ్‌’ అనే పేరుతో ఆర్గానిక్‌ స్వీట్లు తయారుచేస్తూ దేశ విదేశాల నుంచి ఆర్డర్లు పొందుతూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం నీలూ భండారీ స్వీట్లు అంటే మక్కువ చూపుతుంటారు. ఐదేళ్లుగా ఆమె చేస్తున్న స్వీట్‌ జర్నీ గురించి అంతే స్వీట్‌గా చెప్పుకోవచ్చు.

స్వీట్లు తయారుచేసే సమయంలో నీలూ భండారీని చూస్తే ఆమె మోముపై ఓ మెరుపు ఉంటుంది. ఆమె పెదవులు దైవ నామం జపిస్తూ ఉంటాయి. స్వీట్ల ద్వారా ఎంతో మందికి చేరవయ్యే అవకాశం ఆ భగవంతుడే తనకు కల్పించాడని, ఆ విధంగా తాను దైవానికి దగ్గరవుతున్నాను అని ఆమె నమ్ముతారు.

కమ్మని వాసనల వంటకాలు
‘పిల్లలు బేకరీలలో లభించే జంక్‌ ఫుడ్‌ని ఇష్టపడుతుంటారు. కానీ, ఆ ఆహారం వల్ల వారి శరీరం బోలుగా తయారవుతుంది. ఊబకాయం వంటి సాధారణ సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల ఏ వ్యాధి అయినా వారిని సులభంగా చుట్టుముంటే అవకాశం ఉంది. పిల్లల ముందు పాలు, జున్ను, దేశీ ఆవు నెయ్యి.. గురించి మాట్లాడితే వారు ముఖముఖాలు చూసుకుంటారు. అలాంటి పదార్థాల గురించి ఈ తరం వారికి తెలియనే తెలియవు. అదే మన చిన్ననాటి రోజుల్లో చలికాలంలో దాదాపు ప్రతి ఇంట్లో అవిసె గింజలు, నువ్వులు, శనగపిండితో చేసిన కమ్మని వంటకాల వాసన వస్తుండేది’ అని చెప్పే నీలూ భండారి ఐదేళ్లుగా తన చేత్తో తయారు చేసిన స్వీట్ల వ్యాపారాన్ని ఆమె వృత్తిగా చేసుకున్నారు. ఆ స్వీట్లకు మన దేశంలోనే కాదు విదేశాలలోనూ మంచి డిమాండ్‌ ఉంది.

చక్కెర, నెయ్యి లేకుండా స్వీట్లు!
చక్కెర లేని, నెయ్యి లేని స్వీట్లను నీలూ స్నేహితులు రుచి చూసి తమ కోసమూ వాటిని అడిగి మరీ చేయించుకునేవారు. దీంతో ఆమె ఎక్కువ మొత్తంలో అలాంటి స్వీట్లు తయారుచేసి వారి కోసం ప్రదర్శన ఏర్పాటు చేసేది. స్నేహితులు, బంధువులు ఆ ప్రదర్శనలో పాల్గోవడమే కాదు, ఆర్గానిక్‌ స్వీట్ల కోసం డిమాండ్‌ పెరగడం ప్రారంభమైంది. బయట నుంచి కూడా ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. డిమాండ్‌ పెరగడంతో ఆమె ‘మదర్స్‌ మేడ్‌’ అనే పేరుతో స్వీట్ల తయారీని పెంచింది.

సెలబ్రిటీలకు చేరువ
ఆమె చేతితో తయారు చేసిన శుభ్రమైన స్వీట్లు బాలీవుడ్‌ గాయని ఆశా భోంస్లే, జస్పిందర్‌ నరులా, కర్మవీర్‌ వోహ్రా, సుప్రియా, అబూ సూఫీ.. తదితరులు ఇష్టపడి మరీ ఆర్డర్ల మీద తెప్పించుకుంటారు. మన దేశంలోనే కాకుండా వర్జీనియా, ఫ్లోరిడా, కెనడా, ఆస్ట్రేలియా, పారిస్, జర్మనీ నుండి కూడా నీలూ భండారీ స్వీట్లను ఆర్డర్ల మీద తెప్పించుకుంటున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement