ఏసీ స్క్వేర్.. చివరికి మట్టితో సక్సెస్‌! | Mumbai Girls Won World Robot Olympiad For AC Device | Sakshi
Sakshi News home page

ఏసీ స్క్వేర్.. చివరికి మట్టితో సక్సెస్‌!

Published Wed, Dec 9 2020 8:42 AM | Last Updated on Wed, Dec 9 2020 8:42 AM

Mumbai Girls Won World Robot Olympiad For AC Device - Sakshi

గదిని చల్లబరచడానికి ఏసీ ఆన్‌ చేస్తాం. ఏసీ నుంచి వెలువడే వేడి నుంచి వాతావరణాన్ని చల్లబరచడం ఎలాగో చేసి చూపించారు అంతర, ప్రీష. ఇందుకోసం హరప్పా నాగరకత కాలం నాటి పద్ధతులను అవలంబించారు! ఈ ప్రయోగం చేయడానికి వాళ్లను ప్రభావితం చేసిన సంఘటన ఆలోచించి తీరాల్సిన విషయం. అందరికీ తెలిసినదే, అయితే ఎవరూ దృష్టి పెట్టనిది.

‘‘ముంబయిలో ఒక భవనం వెనుక నుంచి నడుస్తున్నాం. ఆ భవనంలో సూపర్‌ మార్కెట్‌ ఉంది. సూపర్‌ మార్కెట్‌ లోపల చల్లగా ఉంటుంది. నిత్యం వచ్చిపోయే వాళ్ల కోసం ఏసీ నిరంతరాయంగా పని చేస్తూనే ఉంటుంది. ఏసీ పని చేసినంత సేపూ అవుట్‌లెట్‌ నుంచి విడుదలయ్యే వేడి గాలి భవనం వెనుక వైపు ప్రదేశంలోని ఉష్ణోగ్రతలను పెంచేస్తోంది. అక్కడ నడిచి వెళ్లేవాళ్లు కూడా ఆ వేడిని భరిస్తూ ముందుకు వెళ్లిపోతున్నారు. కానీ ఆ సమస్య ఆ క్షణంతో తీరేది కాదు. ఆ వేడిగాలి వాతావరణంలో కలిసిపోతుంది. పర్యావరణానికి హాని కలిగిస్తుంది. పైగా ఇంట్లో వాడే వస్తువుల్లో ఎక్కువ మోతాదులో పర్యావరణ హానికారక వాయువులను విడుదల చేసేది ఏసీ మాత్రమే.

పర్యావరణానికి హాని కలుగుతుంది కాబట్టి ఏసీ వాడవద్దు అని ఎంతగా ప్రచారం చేసినా ఫలితం ఉండదు. సమస్యను గుర్తించినప్పుడు ఆ పని చేయవద్దని చెప్పడం కాదు, ప్రత్యామ్నాయం చూపించగలగాలి. మేము అదే చేశాం. రోబోటిక్‌ టెక్నాలజీతో ప్రయోగాలు చేశాం. మొదట కాంక్రీట్‌తో ప్రయత్నించాం, తర్వాత ప్లాస్టిక్‌ వాడాం. అవేవీ మేము అనుకున్న ఫలితాలనివ్వలేదు. చివరగా మట్టితో చేసిన ప్రయోగం విజయవంతమైంది’’ అని చెప్పారు అంతర పటేల్, ప్రీషా పటేల్‌. వీళ్లిద్దరూ ముంబయిలోని జమ్నాబాయి నార్సీ స్కూల్‌ విద్యార్థినులు. 

మట్టి మంత్రం
ఏసీ నుంచి విడుదలయ్యే వేడి గాలిని పర్యావరణంలో కలవకుండా నిలువరించడానికి ఈ అమ్మాయిలు మట్టి కోన్‌లను ఉపయోగించారు. మట్టితో ప్రమిదలు చేసినట్లే... వీళ్లు ఐస్‌క్రీమ్‌ కోన్‌ల ఆకారంలో చేశారు. ఆ మట్టి కోన్‌లను ఒక అల్యూమినియం ఫ్రేమ్‌లో అమర్చి ఏసీ బయట విభాగానికి అమర్చారు. ఏసీ నుంచి విడుదలయ్యే తేమతో మట్టి కోన్‌లు చల్లబడతాయి, ఏసీ నుంచి విడుదలయ్యే వేడిని కూడా ఈ మట్టి కోన్‌లు పీల్చుకుంటాయి. మట్టి కోన్‌లు చల్లబడడం, వేడెక్కడం రెండూ ఏసీ మెషీన్‌ ఆధారంగానే జరుగుతాయి. ప్రత్యేక యంత్రాంగం అవసరం లేదు. వేడిగాలిని ఎప్పటికప్పుడు మట్టి కోన్‌లు పీల్చుకుంటూ ఉంటాయి. కాబట్టి వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగవు. ఈ అమ్మాయిలిద్దరూ పన్నెండేళ్ల లోపు వాళ్లే. వయసు చిన్నదే కానీ ఆలోచనలు పెద్దవి. ఇలాంటి పిల్లల చేతుల్లో భూగోళం చల్లగా ఉంటుంది. భవిష్యత్తు తరాలు ఆహ్లాదంగా జీవిస్తాయి.

ఈ ఏటి వేదిక కెనడా 
వరల్డ్‌ రోబో ఒలింపియాడ్‌ ఏటా అక్టోబర్‌లో జరుగుతుంది. మొదట 2004లో సింగపూర్‌లో మొదలైన ఈ ఒలింపియాడ్‌ను ఈ ఏడాది కెనడా, మాంట్రియల్‌లో నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఎంట్రీలు వస్తాయి. ఈ ఏడాది అంశం ‘క్లైమేట్‌ స్క్వాడ్, ఈ పోటీలో 75 దేశాల నుంచి 26 వేల బృందాలు తమ ప్రయోగాలను ప్రదర్శించగా అంతర, ప్రీషాల ప్రయోగం ప్రథమ స్థానంలో నిలిచింది. కరోనా కారణంగా ఈ ఏడాది కార్యక్రమం ఆన్‌లైన్‌లో నిర్వహించారు. నవంబర్‌ 15వ తేదీన విజేతలను ప్రకటించారు.

  • భావితరం భవిష్యత్తు చల్లగా ఉండాలంటే భూగోళం చల్లగా ఉండాలి. అయితే భూగోళం భవిష్యత్తు భావి తరం చేతుల్లోనే చల్లగా ఉంటుందని నిరూపించారు ముంబయిలోని అంతర, ప్రీష. ఏసీల వల్ల వాతావరణంలోకి వెలువడే వాయువ్యర్థాలను నివారించడానికి వీళ్లు ఒక చక్కటి ప్రత్యామ్నాయాన్ని సూచించారు. కరోనా విరామంలో ఆరు నెలల పాటు శ్రమించి రూపొందించిన ‘ఏసీ స్క్వేర్‌’ అనే ఆ సాధనాన్ని వరల్డ్‌ రోబో ఒలింపియాడ్‌ 2020 లో ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలిచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement