
‘‘ఉదయం పది గంటలకు నిద్రలేచి, ఫ్రెష్ అయ్యాక వెంటనే జ్యూస్ చేయడం ప్రారంభిస్తాను. ఇలా మధ్యాహ్నం రెండు గంటల వరకు జ్యూస్ తయారు చేసి తర్వాత భోజనం చేస్తాను. పని పూర్తయ్యాక, నాకెంతో ఇష్టమైన ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ షో ను చూసి బాగా ఎంజాయ్ చేస్తాను’’ అని చెబుతోంది స్వస్తి మెహతా. ఇందులో కొత్త ఏముంది ఏ అమ్మాయిని అయినా రోజూ ఏం చేస్తావ్? అని అడిగితే ఇలానే చెబుతారు కదా! అనుకోవచ్చు. కానీ స్వస్తి అందరి అమ్మాయిల్లాంటి కాదు. డౌ సిండ్రోమ్‌తో పుట్టిన అమ్మాయి. ఈ సమస్య ఉన్నవాళ్లు సవ్యంగా నడవడం, మాట్లాడడం అంతంత మాత్రమే. సాధారణ పిల్లల్లా వీళ్లు అన్ని పనులు చేయలేరు. అలాంటిది స్వస్తి మెహతా ఏకంగా జ్యూస్ తయారు చేసి విక్రయిస్తూ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది.
ముంబైకు చెందిన స్వస్తికి పుట్టుకతో డౌన్ సిండ్రోమ్ సమస్య ఉన్నప్పటికీ .. మిగతా పిల్లలకంటే ఎంతో చురుకుగా ఉండేది. స్పీచ్ థెరపీ ద్వారా తన ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. దీంతో డౌన్ సిండ్రోమ్ పిల్లలకోసం ప్రత్యేకంగా నడుపుతోన్న దిల్‌ఖుష్ స్కూల్లో తల్లిదండ్రులు చేర్పించారు. అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలతో కలవడం వల్ల ఇంగ్లిష్, మరాఠీ గుజరాతీ, హిందీ భాషలను నేర్చుకుంది. డౌన్ సిండ్రోమ్ పిల్లలు అకడమిక్ పరీక్షలలో ఉత్తీర్ణులవ్వడం కష్టమైనప్పటికీ, వొకేషనల్ నైపుణ్యాలను సులభంగా నేర్చుకోగలుగుతారు. స్వస్తికూడా ఈ నైపుణ్యాలను అవపోసన పట్టింది.
మొదటి లాక్‌డౌన్‌లో..
స్కూలునుంచి ఇంటికి వచ్చిన స్వస్తి.. తీవ్ర మానసిక సంఘర్షణకు గురైంది. ఈ సమయంలో మొండిగా, దూకుడుగా ఉండేది. దీంతో స్కూల్లో నేర్చుకున్న నైపుణ్యాలన్నీ వృధా అయిపోయాయి అనుకున్నారు తల్లిదండ్రులు. తర్వాత మానసిక వైద్యుల సలహాలు, ఇచ్చిన మందులతో క్రమంగా కోలుకుని మామూలు స్థితికి వచ్చింది. కాస్తకోలుకుని స్కూలు వెళ్తున్న సమయంలో కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. దీంతో స్కూలుకు వెళ్లలేని పరిస్థితి. ఈ సమయంలో ఇంట్లో ఖాళీగా కూర్చోలేక వివిధరకాల వంటలు వండుతూ ప్రయోగాలు చేసేది. ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించేవారు. ఈ క్రమంలోనే ‘పుదీనా’ డ్రింక్‌ను తయారు చేసింది.
పుదీనా పంచ్..
స్వస్తి తయారు చేసిన పుదీనా డ్రింక్ రుచికరంగా ఉండడంతో ఎక్కువ మొత్తంలో జ్యూస్‌ను తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టింది. స్వస్తి స్వయంగా మార్కెట్ నుంచి పుదీనా తీసుకువచ్చి శుభ్రంగా కడిగి పేస్టు చేస్తుంది. తర్వాత ఈ పేస్టులో నిమ్మరసం, పంచదార కలిపి జ్యూస్ తయారు చేస్తుంది. ఈ జ్యూస్ పేరే ‘పుదీనా పంచ్’. ఈ జ్యూస్ నాణ్యంగా, రుచికరంగా ఉండడంతో ఆనోటా ఈనోటా తెలిసి పుదీనా పంచ్‌ను చాలా మంది ఎగబడి కొంటున్నారు. ఒకరిద్వారా మరొకరికి చివరికి సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడంతో పుదీనా పంచ్ విక్రయాలు బాగా పెరిగాయి. లీటర్ బాటిల్‌ను రెండు వందల రూపాయలకు విక్రయిస్తోంది. ఈ బాటిల్ జ్యూస్‌ను ముఫ్పై మంది వరకు తాగవచ్చు.
చాలా ఓపిక ఉండాలి..
‘‘తమ బిడ్డకు డౌన్ సిండ్రోమ్ ఉందంటే ఒక్కనిమిషం జీవితం అంధకారమైనట్టు అనిపిస్తుంది. నిమిషం తరువాత తేరుకున్నాక బిడ్డ భవిష్యత్‌పై తీవ్ర ఆందోళన ఏర్పడుతుంది. అయినా ఓపిక, సహనంతో పిల్లలను చూసుకోవాలి. వారి ఆసక్తులను గమనించి ఆ దిశగా ప్రోత్సహించాలి. తద్వారా వారి అభ్యున్నతికి కృషిచేయాలి. స్వస్తి విషయంలో ఇదే చేశాము. దాని ఫలితమే పుదీనా పంచ్ బ్రాండ్. కరోనా సమయంలో విక్రయాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం రోజుకి ఇరవైకి పైగా ఆర్డర్లు వస్తున్నాయి’’ అని స్వస్తి తల్లి దర్శనా మెహతా సంతోషంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment