పారిస్ అంటే ఫ్యాషన్‌కు పుట్టినిల్లు. కానీ, మన తెలుగు మహిళలు ఆ ఫ్యాషన్ కేంద్రానికే ఫ్యాబ్రిక్స్ ఎగుమతి చేస్తున్నారు. పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రీడాకారులు ఉపయోగించే లేస్ వస్త్రాలు, దిండ్లు, తువాళ్లు మన నరసాపురం నుంచి తయారయ్యి విమానం ఎక్కాయి. ఇదీ మన ఘనత.
సూది మొనకు దారం తగిలించి చకచకా వారి మునివేళ్లు కదిలించారంటే చాలు వన్నెచిన్నెల లేసులు క్షణాల్లో కళ్లముందు ఆవిష్కృతమవుతాయి. ఔరా అనిపించేలా హ్యాండ్ మేడ్ ఉత్పత్తులు సిద్ధమవుతాయి. అబ్బురపరిచే అల్లికలతో గోదావరి జిల్లాలకు ఖండాంతర గుర్తింపు తెచ్చిన అతివల హస్త నైపుణ్యం ఇప్పుడు పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్ వరకూ చేరింది. ఆ ఘనతను సాధించింది జిల్లా, నరసాపురం రూరల్‌కి చెందిన మారుమూల గ్రామం సీతారామపురం.
లేసుల పరిశ్రమ
బ్రిటిష్ కాలంలో నరసాపురం జలరవాణాకు‡కేంద్రంగా ఉండేది. అప్పట్లో ఇక్కడకు వచ్చిన క్రిస్టియన్ మిషనరీ సంస్థలు పేద మహిళలకు ఉపాధిగా లేసు అల్లికలు నేర్పించారు. కాలక్రమంలో ఈ పని పెద్ద పరిశ్రమగా విస్తరించింది. పేద, ధనిక తేడా లేకుండా తీరిక వేళల్లో కాలక్షేపంగా అల్లికలు సాగిస్తుంటారు. నరసాపురం కేంద్రంగా కోనసీమ, రాజ మహేంద్రవరం, భీమవరం ్రపాంతాల్లో వేలాది కుటుంబాలు ఈ హస్తకళ ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి.
ఈ పనిలో ఉన్న మహిళలకు తోడ్పాటును అందించేందుకు 2005లో నాటి సి.ఎం. వైఎస్ రాజశేఖరరెడ్డి సీతారాంపురం వద్ద లేస్‌పార్క్‌ను ్రపారంభించారు. టవల్స్, టేబుల్ క్లాత్స్, లంచ్ మ్యాట్స్, క్రోషే బ్యాగ్స్, డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్ తదితర మన హ్యాండ్ మేడ్ లేసు ఉత్పత్తులకు విదేశాల్లో మంచి ఆదరణ ఉంది. నరసాపురం పరిసరాల్లో లేసు ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీలు వంద వరకు ఉన్నాయి. మారుతున్న ఫ్యాషన్, అభిరుచులు, ఆర్డర్లకు అనుగుణంగా తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటూ ట్రెండింగ్‌లో ఉంటూ చైనా, వియత్నాం దేశాలకు గట్టిపోటీనిస్తున్నారు గోదావరి జిల్లాల మహిళలు..
ఎంతో గర్వంగా ఉంది
పారిస్ ఒలింపిక్స్‌కు మన లేసు, క్లాత్‌తో తయారుచేసిన ఉత్పత్తులు అందించే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. ఈ లేస్ ఇండస్ట్రీని ప్రభుత్వాలు గుర్తించి వ్యవస్థీకృతం చేస్తే విదేశాల్లో మనదేశ మహిళల నైపుణ్యానికి గుర్తింపు వస్తుంది. ఒలింపిక్స్‌కు పని చేసే అవకాశాన్ని మహిళలు ఎంత సంతోషంగా స్వీకరించారంటే ప్రతి ఒక్కరూ తామే గోల్డ్‌మెడల్ సాధించినంత ఆనందంగా ఉన్నారు.
– కలువకొలను రామ్‌చంద్రుడు, జేజే ఎక్స్‌పోర్ట్స్ అధినేత
పదేళ్లుగా లేసు అల్లికలు
మా చిన్నతనంలో మా అమ్మ, పిన్నమ్మలు అంతా కూడా లేసు అల్లికలు అల్లేవారు. నాకు అçప్పటి నుంచి అల్లికలపై అవగాహన ఉంది. గత 10 ఏళ్లుగా లేసు అల్లికలు చేస్తున్నాను. పిల్లలిద్దరినీ కూడా ఉన్నత చదువులు చదివించుకోగలుగుతున్నాం. ఇంట్లో పనులు అయ్యాక ఖాళీ సమయంలో లేసు అల్లికల ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి.
– పులపర్తి లక్ష్మికుమారి, మొగల్తూరు
పారిస్ వేదిక మీద మన లేసు
ఈ నెల 26 నుంచి పారిస్ వేదికగా ్రపారంభం కానున్న ఒలింపిక్స్ క్రీడా సంగ్రామంలో నరసాపురం ఉత్పత్తులు కొలువుదీరే అవకాశం దక్కింది. సీతారాంపురంలోని జేజే ఎక్స్‌పోర్ట్స్ సంస్థ కేంద్రం పరిధిలోని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీక్రాప్ట్స్ (ఈపీసీహెచ్) ద్వారా ఈ అర్డర్ సాధించినట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. దాదాపు వంద రకాల డిజైన్లు పంపిస్తే వాటిలో ఆరు డిజైన్లను నిర్వాహకులు ఎంపిక చేశారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చే సందర్శకులకు గుర్తుండిపోయే విధంగా ఒలింపిక్స్ థీమ్, లోగోలతో లేస్, ఫ్యాబ్రిక్‌లను ఉపయోగించి టవల్స్, డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్, క్రోషే మ్యాట్స్ తదితర హ్యాండ్ మేడ్ ఉత్పత్తులను డిజైన్ చేసి సిద్ధం చేసి పారిస్‌కి పంపారు. త్వరలో మన లేసు ఉత్పత్తులు ఒలింపిక్స్ క్రీడాకారులతో పాటు సందర్శకుల చేతుల్లోకి చేరనున్నాయి. తమ ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు దక్కడం పట్ల ఈ ్రపాంత మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
– విజయ్‌కుమార్ పెనుపోతుల, సాక్షి, భీమవరం.
ఫొటోలు : సవరం కృష్ణానందం
Comments
Please login to add a commentAdd a comment