మోకాళ్ల నొప్పులకు పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతున్నారా? ఇవి తెలుసుకోండి | Natural Home Remedies For Knee Pain | Sakshi
Sakshi News home page

Tips For Knee Pain Relief: మోకాళ్ల నొప్పులు శాశ్వతంగా ఎలా తగ్గించుకోవాలి? ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి

Published Mon, Sep 11 2023 12:59 PM | Last Updated on Mon, Sep 11 2023 1:35 PM

Natural Home Remedies For Knee Pain - Sakshi

మన పెద్దవాళ్లు వృద్ధాప్యంలో కూడా ఎంతో బలంగా ఉండేవారు.. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా వారిలో కూడా శరీర సమస్యలు వస్తున్నాయి. చాలా మంది వృద్ధుల్లో మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. దీంతో పాటు ఆధునిక జీవనశైలికి అలవాటు పడ్డ యువతలో కూడా ఇవే సమస్యలు వస్తున్నాయి. మోకాళ్లనొప్పుల కారణంగా నడవడానికి చాలామంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలకు కూడా దారి తీయొచ్చు. మోకాళ్ల నొప్పులను తట్టుకోలేక చాలామంది పెయిన్‌ కిల్లర్స్‌ అంటే నొప్పి నివారణిలను ఆశ్రయిస్తుంటారు. వీటివల్ల ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయి. అందువల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని సహజ చిట్కాలను తెలుసుకుందాం.

ఆర్థరయిటీస్, ఆస్టో ఆర్థరయిటీస్, రుమటాయిడ్‌ ఆర్థరయిటీస్‌ వంటి కొన్ని రకాల అనారోగ్య కారణాలతో పాటు సరైన దినచర్యను పాటించకపోవడం, తీసుకునే ఆహారాల్లో తగినన్ని పోషకాలు లేకపోవడం, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుని ఆ తర్వాత ఈ సమస్యల నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందడానికి కొన్ని మార్గాలను అన్వేషిద్దాం.

కలబంద

ఆయుర్వేద నిపుణులు కలబందను ఔషధంగా భావిస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలారకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి తీవ్ర మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు నొప్పి ప్రభావిత ప్రాంతంలో ప్రతిరోజు అలోవెరా జెల్‌ను అప్లై చేసి సున్నితంగా మర్ధన చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మోకాళ్ల వాపులు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

పసుపు

పసుపు  యాంటీ బాక్టీరియల్‌గా పని చేస్తుంది. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని అన్నిరకాల వ్యాధులకు వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు పసుపును వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిని వినియోగించే ముందు ఒక బౌల్‌ తీసుకుని అందులో ఆవాల నూనెను వేసి.. ఒక టీ స్పూన్‌ పసుపును వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

అల్లం

అల్లం మోకాళ్ల నొప్పుల నివారణకు ఉపయోగించే మందులలో అల్లాన్ని బాగా ఉపయోగిస్తారు. కొన్ని అల్ల ముక్కలను తీసుకుని వాటిని గ్లాసు నీళ్లలో వేసి బాగా మరగబెట్టాలి. మనం తీసుకున్న నీటి పరిమాణం సగానికి తగ్గిందని నిర్ధారించుకున్న తర్వాత స్టవ్‌ మీదినుంచి దింపి గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టి తాగాలి. రుచికి తేనె, నిమ్మరసం వంటివి కలుపుకోవచ్చు.

కర్పూర తైలం

తీవ్ర మోకాళ్ల నొప్పుల కారణంగా బాధపడేవారు కర్పూరం నూనెను కూడా వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్నిరకాల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీనిని వినియోగించాలనుకునేవారు ముందుగా కర్పూరం నూనె తీసుకుని బౌల్‌లో పోసుకుని గోరువెచ్చగా చేయాలి. ఆ తర్వాత ఈ నూనెను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి 15 నిమిషాల పాటు బాగా మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల సులభంగా తీవ్ర మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

చింతగింజల పొడి

మోకాళ్లలో గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పులు తగ్గాలంటే కాస్తంత చింతగింజల పొడిని వేడినీళ్లలో వేసి బాగా మరగబెట్టి వడకట్టి తాగుతుండాలి. అలాగే దీనిలో పాలు కలపకుండా బెల్లం పొడి వేసి పాయసంలా చేసుకుని కూడా తాగచ్చు. నల్లేరు కాడలతో తయారు చేసిన పచ్చడిని, బెండకాయలను, గోరుచిక్కుడు కాయలను ఆహారంలో విరివిగా ఉపయోగించడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి సహజ ఉపశమనం లభిస్తుంది. ఏదైనా గాయం వలన కానీ మెడికల్‌ కండిషన్‌ వలన కానీ మీరు రోజూ చేసే పనులన్నీ బట్టి కానీ మోకాళ్ళ నొప్పులు సహజంగా వచ్చే అవకాశం ఉంది.

ఎక్కువగా మోకాళ్ల నొప్పులు ఉంటే కచ్చితంగా డాక్టర్‌ సలహా తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే అల్లం, పసుపు బాగా పనిచేస్తాయి. ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో అల్లం, పసుపు వేసి 15 నిమిషాల పాటు ఆ నీటిని మరిగించండి. తర్వాత ఈ జ్యూస్‌ తీసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఉంది. మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటే కనక హీట్, కోల్డ్‌ కంప్రెస్‌ అంటే కాపడం పెట్టవచ్చు.

హీట్‌ కంప్రెస్‌ని నొప్పి ఎక్కువ ఉంటే మాత్రం వాడకూడదు. ఎందుకంటే ఇంకా నొప్పి కలుగుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడే వాళ్ళకి వేడినీటి కాపడం బాగా పనిచేస్తుంది. ఆటలు సమయంలో గాయాలైనప్పుడు కోల్డ్‌ కంప్రెసర్‌ బాగా తోడ్పడుతుంది. ఎప్సం సాల్ట్‌ని స్నానం చేసే నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది.అరకప్పు ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ని ఒక గ్లాసు నీళ్లలో వేసుకుని తాగితే మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి. రాత్రి నిద్రపోయేటప్పుడు తాగితే చాలా చక్కగా ఈ చిట్కా పనిచేస్తుంది.

బరువు నియంత్రణ
సాధ్యమైనంత వరకు మన వెయిట్‌ మానేజ్‌ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ బరువు పెరగడం వల్ల మోకాళ్ల పైన భారం పడి, మోకాళ్ళ నొప్పులు పెరిగే అవకాశం ఉంది. అందుకని బరువుని మేనేజ్‌ చేసుకుంటూ మోకాళ్లపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. బరువు తగ్గడం కోసం వ్యాయామాలు కూడా చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement