మీ టీనేజర్‌ పార్టీలో ఉంటున్నాడా? కనిపెట్టండి.. కాపాడుకోండి..! | NCB Yesterday Arrested Shah Rukh Khan Son Aryan Khan Along With Seven Of His Friends | Sakshi
Sakshi News home page

మీ టీనేజర్‌ పార్టీలో ఉంటున్నాడా? కనిపెట్టండి.. కాపాడుకోండి..!

Published Tue, Oct 5 2021 12:11 AM | Last Updated on Tue, Oct 5 2021 12:22 AM

NCB Yesterday Arrested Shah Rukh Khan Son Aryan Khan Along With Seven Of His Friends - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

డ్రగ్స్‌ తీసుకున్నారనే విషయంపై షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌తో పాటు అతని స్నేహితులైన మరో ఏడుగురు టీనేజర్లను ఎన్‌సిబి (నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో) నిన్న అదుపులోకి తీసుకుంది. ఈ వార్త విన్న వారిలో చాలా మంది ‘డబ్బున్న వారి పిల్లలు అంతే’ అని ఓ మాట ఘాటుగా అనేసి తిరిగి తమ పనుల్లో పడిపోయుంటారు. ఇటీవల తరచూ మనముందుకొస్తున్న వార్తల్లో డ్రగ్స్‌ అనే బూచి తీసుకువస్తున్నవే ఎక్కువ.

సినీ తారలు, డబ్బున్నవారు మాత్రమే డ్రగ్స్‌ వాడతారు అనుకునే సాధారణ జనం కూడా ఇప్పుడు తమ పిల్లల గురించి చర్చించుకోవాల్సిన, సరి చూసుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ‘సమస్య మా ఇంట్లోకి రాదు, మా పిల్లలు బంగారం’ అనేది చాలామంది తల్లిదండ్రుల భావన. బయట సులువుగా దొరుకుతున్నప్పుడు, పిల్లలు ఆకర్షణకు లోనుకాకుండా ఉండరు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా ‘డ్రగ్‌’ ప్రపంచంలో అత్యంత సాదాసీదాగా అడుగుపెట్టేవారిలో 18 ఏళ్ల లోపు టీనేజర్లే ఉంటున్నట్టు నివేదికలు చూపుతున్నాయి. అంటే, టీనేజర్లు డ్రగ్స్‌ వినియోగంలో అతిపెద్ద పాత్ర పోషిస్తున్నారన్నమాట. 

ఒక్కసారేగా..!
ఏదేమైనా ఈ దశలో ‘ప్రయోగం చేద్దాం’ అనుకోవడం నిజం. మాదకద్రవ్యాలు లేదా మద్యం ప్రయత్నించినంత మాత్రాన వాటికి బానిస అవుతారని చెప్పలేం. అయితే, కొంతమంది టీనేజర్లు ఈ తరహా ప్రయోగాలు చేయడానికి ఎందుకు మొగ్గు చూపుతున్నారో అర్థం చేసుకోవడం ముఖ్యం. ‘అదేంటో తెలుసుకోవాలన్న ఉత్సుకత, తోటి స్నేహితుల నుంచి తీసుకోమనే ఒత్తిడి, ట్రెండ్‌లో ఉన్నామని అనుకోవడం, కష్టం నుంచి తప్పించుకోవాలనే కోరిక’ సాధారణ కారణాలుగా ఉన్నాయి. 

అతి సాధారణ సంకేతాలు
ఇంట్లో టీనేజ్‌ దశలో ఉన్న పిల్లలు మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారా.. అని కొన్ని విషయాలను గమనించి తెలుసుకోవచ్చు. పిల్లలతో రోజూ కొద్దిసేపు సన్నిహితంగా మెలిగితే అవేంటో ఇట్టే తెలిసిపోతుంది. పిల్లల మాట, ఆలోచన, ప్రవర్తన.. ఈ మూడింటిని గమనించాలి. అలాగే.. ‘పిల్లలు చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారా... కారణం లేకుండా నవ్వడం లేదా ఏడ్వడం చేస్తున్నారా, చదువు, ఇతరత్రా రోజువారి కార్యకలాపాలపై ఎలాంటి ఆసక్తి చూపడం లేదా, శుభ్రంగా ఉండటం లేదా, బాగా ఆకలి అంటూ రుచీ పచీ అని పట్టించుకోకుండా తింటున్నారా, వారి శ్వాస సిగరట్‌ వాసన వస్తోందా, బట్టలు పొగ వాసన వస్తున్నాయా, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారా, వారి వయసువారితో కాకుండా కొత్త కొత్త స్నేహాలు చేస్తున్నారా, ఇంట్లో డబ్బులు, ఖరీదైన వస్తువులు కనిపించకుండా పోతున్నాయా... వంటి విషయాలను పరిశీలించక తప్పదు. అయితే, తాము వారిని అనుమానిస్తున్నట్టు పిల్లలు అనుకోకూడదు. 

మరింత రహస్య జీవనంలోకి జారుకోవచ్చు!
మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారనే నిజం తెలిసి కరకుగా పిల్లలతో ప్రవర్తిస్తే ‘మీకు తెలియకుండా మరింత రహస్యంగా వాటిని తీసుకునే ప్రయత్నం చేయవచ్చు’ అంటారు మానసిక నిపుణులు. ‘మీరు గమనించారని తెలిస్తే.. ఎత్తుకు పై ఎత్తు వేసి ఇంకా రహస్యంగా డ్రగ్స్‌ తీసుకోవచ్చు. పిల్లలను విమర్శిస్తూ మాట్లాడితే వారు ఎదురు తిరిగే అవకాశమూ ఉంది’ అంటారు. ప్రేమతోనే మందు వేయడం అనేది తల్లిదండ్రుల ప్రథమ బాధ్యత. గమనింపు అనేది అసలు బాధ్యతగా ఉండాలి. పిల్లలతోనే కాకుండా, వారి స్నేహితుల తల్లిదండ్రులతో కూడా సంభాషించాలి. 

మారేందుకు మూడు పద్ధతులు..
పిల్లలు మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారని తెలిస్తే వారితో గొడవపడకుండా, ప్రేమ పూర్వకమైన వాతావరణంలోనే వారిని నేర్పుగాSతమ దారిలోకి తెచ్చుకోవాలి అన్నది మానసిక నిపుణుల సూచన.‘స్కూల్‌ లేదా ఇంటి చుట్టుపక్కల వాతావరణంపై అనుమానం వస్తే వాటిని మార్చాలి. ఒక్కోసారి ఉన్న చోటును వదిలి మరో కొత్త ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు. ఇవి మొదట్లో తల్లిదండ్రులు చేస్తారు. రెండవది.. ఇంట్లో వాతావరణం ఎలా ఉంది అనేది ప్రతి కుటుంబాల్లో సరిచూసుకోవాలి.

భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలు పిల్లల మీద ప్రభావం చూపుతాయి. అందుకు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ అవసరం. మూడవది.. డ్రగ్స్‌కు బానిస అయ్యారని గుర్తిస్తే వైద్యుల సాయంతో రిహాబిలిటీ సెంటర్‌లో పెట్టి కౌన్సెలింగ్, యోగా, మందులు వాడకం ద్వారా తిరిగి మామూలు జీవనంలోకి తీసుకురావచ్చు’ అని వివరించారు. డ్రగ్స్‌ కేవలం సెలబ్రిటీ క్లాస్‌ ట్రెండ్‌ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా టీనేజర్లు ఉన్న ఇంటింటి సమస్య కూడా. మన ఇంట్లో లేదంటే పొరుగింట్లో టీనేజ్‌ వయసున్న పిల్లలున్నారంటే వారిని ఓ కంట కనిపెడుతూ వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేయచ్చు. సకాలంలో గుర్తించి, మాదక ద్రవ్యాల బారి నుంచి టీనేజర్లను కాపాడుకోవడం ఈ రోజుల్లో మన ముందున్న అసలైన సవాల్‌. 

మన ఇంట్లోనూ ఉండొచ్చు!
కరోనా కారణంగా 18 నెలలుగా బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న పిల్లలు, ఇప్పుడు ఒక్కసారిగా తిరిగి కొత్త లోకంలోకి వచ్చినట్టుగా ఉంది. గతంలో టీనేజ్‌ దశలో అబ్బాయిలు, అమ్మాయిలు 3:1 రేషియోలో ఉండేవారు. ప్రస్తుత రోజుల్లో 1:1 గా ఉన్నారు. పల్లె, పట్నం అని తేడా లేకుండా అన్నిచోట్లా, అన్ని దిక్కులా మాదకద్రవ్యాలు సులువుగా దొరకడం కూడా ప్రధాన కారణం.  
– డాక్టర్‌ కల్యాణ  చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement