పని ప్రదేశాల్లో స్త్రీ–పురుష వివక్ష తెలిసిందే. పెరిగే వయసు కూడా స్త్రీని వివక్షకు లోనయ్యేలా చేస్తుందా?! ‘అవును’ అంటున్నాయి ఇటీవలి నివేదికలు. వయసు అనేది ఒక అంకె మాత్రమే అయినా అంకెల్లో జీతం అందుకోవాలంటే మాత్రం నిత్యం సవాళ్లను అధిగమించాల్సిందే! తనను తాను నిరూపించుకోవాల్సిందే!!
ఉద్యోగ నియమాకాల్లోనే కాదు పనిచేసే చోట స్త్రీలు వయస్సు సంబంధిత వివక్ష ఎదుర్కొంటున్నారని ఆర్ప్(అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ పర్సన్స్) సంస్థ సర్వే స్పష్టం చేసింది. 50 ఏళ్లు పైబడిన మహిళల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మహిళలు తమ వయస్సు కారణంగా చేస్తున్న ఉద్యోగాలను వదిలేస్తున్నారని లేదంటే తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని ఈ సంస్థ వెల్లడించింది. అమెరికాలో ఈ వివక్ష 30 శాతం ఉంటే ఆసియా– ఆఫ్రికా మహిళల్లో 60 శాతంగా ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది.
ఆర్ప్ సంస్థ అమెరికా, ఆసియా, ఆఫ్రికన్ మహిళలతో నిర్వహించిన పోల్‌లో 50 ఏళ్ళ పైబడిన ఉద్యోగులైన 6,643 మంది ఫొటోలను తీసుకుంది. ఆ ఫొటోల్లో వారు నిరాశ, దిగులు, విలువైన జీవితాన్ని కోల్పోయినవారిగా కనిపించారు. యాౖ¿ñ ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న ఉద్యోగునులైన మహిళలల్లో వృద్ధాప్యం అనే మాట విరివిగా వినిపించింది. జాతి/రంగు/బరువు/లింగ, సామాజిక తరగతి ఆధారంగా ఈ వివక్ష స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఆరోగ్యంపై ప్రభావం
యాభై ఏళ్లు దాటిన మగ ఉద్యోగులతో పోల్చితే వయసు వివక్ష కారణంగా మహిళలు ఎక్కువ శాతం ఆందోళన, డిప్రెషన్, మానసిక క్షోభ, ఊబకాయం, అధిక రక్తపోటు.. వంటి వాటికి సంబంధించిన లింక్‌లను ఓపెన్ చేసి, పరిశోధించినట్లుగా గుర్తించారు. ఈ కారణంగా ఈ వయసు వారిలో అధికబరువు పెరుగుతుందని, ఇది కూడా వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని గ్రహించారు. మిగతా వాటికన్నా టెక్నాలజీ రంగంలోనే ఈ ప్రభావం ఎక్కువ ఉందని గుర్తించారు.
సామర్థ్యంపై తక్కువ అంచనా!
ప్రఖ్యాత బహుళజాతి కంపెనీలో పనిచేసి, ప్రస్తుతం ఇంటి వద్ద ఉన్న 56 ఏళ్ల ఆమె (పేరు రాయడానికి ఇష్టపడలేదు) మాట్లాడుతూ ‘వయసు కారణంగానే జాబ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింద’ని తెలియజేశారు. ఉద్యోగినిగా కంపెనీ కి అందించిన తన సమర్థతనూ వెలిబుచ్చారు. ‘టెక్నాలజీ రంగంలో చాలా వరకు మగవారికి, యువతకే ప్రాధాన్యం ఉంటుంది. వయసు గురించి చర్చించాల్సిన అవసరం లేనప్పటికీ కంపెనీ యాజమాన్యం, వస్తున్న నవతరం కూడా 50 ప్లస్ వారికి టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో సరిగా తెలియదని అనుకుంటున్నారు. ఉద్యోగనియామకాల్లోనూ ఎక్కువ వయసు ఉన్నవారిని కోరుకోవడం లేదన్నది వాస్తవం’ అంటారు ఆమె.
సమాజ ప్రభావం
‘ఇన్నాళ్లూ ఉద్యోగం చేశారు. సొంత ఇల్లు ఉంది, పిల్లలు స్థిరపడ్డారు. విశ్రాంతి తీసుకోవచ్చు కదా’ అని 50 ప్లస్ వారి పట్ల ఒక జాలితో కూడిన కన్సర్ చూపిస్తుంది సమాజం. అందువల్ల కూడా మహిళలు త్వరగా ఉద్యోగం నుంచి తప్పుకుంటారు’ అంటారు కార్పొరేట్ కంపెనీలకు అర్హత గల ఉద్యోగులను నియమించే ప్రతిభ. ఈ వయసు మహిళలు ఒక సౌకర్యవంతమైన జీవనాన్ని కోరుకుని, ఇంటికి పరిమితం అవుతున్నారంటారు.
కాస్మొటిక్ సర్జరీలు..
మహిళలు అనుభవించే ఒత్తిడిలో ఎక్కువ భాగం యవ్వనంగా కనిపించాల్సిన అవసరానికి సంబంధించే ఉంటుందని యాంటీ ఏజింగ్ పరిశోధకుడు, బ్రేకింగ్ ది ఏజ్ కోడ్ రచయిత టెక్కా లెవీ అంటారు. కాస్మెటిక్ ప్రక్రియలు, సోషల్ మీడియా నుంచి కూడా ఈ వయసు వాళ్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పోల్‌లో పాల్గొన్నవారిలో సగానికి పైగా మేకప్‌కి సంబంధించిన ఒత్తిడిని తెలియజేశారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి 35 శాతం మంది ఆసక్తి చూపారు.
ఏ రంగంలోనైనా తమకు తాముగా నిలబడటానికి ప్రతి దశలోనూ ప్రయత్నం చేస్తున్న మహిళలు ఉన్నారు. సవాళ్లను ఎదుర్కొంటూ తమని తాము నిరూపించుకుంటున్నారు. అయినప్పటికీ ఎన్నో బాధ్యత లు, అవకాశాలు, సౌకర్యాల దృష్ట్యా మగవారితో పోల్చితే ప్రపంచ మహిళ వయసు రీత్యా వివక్ష ఎదుర్కొంటున్నదన్నది వాస్తవం.
కారణాలతో ఆగిపోకూడదు
పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను సమర్థవంతంగా నడుపుతున్న వారిలోనూ యాభై ఏళ్ల పైబడిన మహిళలున్నారు. సవాల్‌గా తీసుకుంటే వయసు అనేది పెద్ద విషయం కాదు. కంపెనీలు కూడా సమర్థంగా పనిచేసేవారిపైనే దృష్టిపెడతాయి. ఎప్పుడూ నైపుణ్యాలు పెంచుకోవడం, తమని తాము అప్‌గ్రేడ్ చేసుకోవడంపై దృష్టి పెడితే ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. పిల్లల విషయంగానో, ఆరోగ్యం బాగోలేదనో, సౌకర్యంగా ఉండచ్చు కదా అనో.. చాలా మంది యాభైలలో ఉన్నవారు జాబ్ మానేస్తారు. లేదంటే సెలవులు ఎక్కువ పెట్టేస్తుంటారు. దానికి ‘వయసు’ కారణం చూపడం మాత్రం సరికాదు.
– ప్రతిభ పులిజాల, మీ స్కూల్ (మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్)
ఛాలెంజ్ తప్పదు
యాభై ఏళ్ల తర్వాత టెక్నాలజీ రంగంలో మహిళలకు పురుషులతో పోల్చితే ఉద్యోగావకాశాలు తక్కువే. ఈ వివక్ష ప్రపంచవ్యాప్తంగా ఉంది. యాభై ఏళ్ల తర్వాత మంచి హోదాలో ఉన్నవారు ఇప్పటికీ పది శాతం మహిళలే ఉన్నారు. వారి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. యాభై ఏళ్ల వయసులోనూ మంచి ప్రాజెక్టులు రాబట్టడానికి నేను ప్రతిరోజూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందుకే, ఇంకా కంపెనీని నిర్వహించగలుగుతున్నాను. వివక్ష ఉందని వెనకడుగు వేయకుండా తమని తాము నిరూపించుకుంటూ, సొంతంగా ప్రణాళిక లు వేసుకుంటూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడం, బాధ్యతలు తీరి తమకి తాముగా కొత్త మార్గాన్ని వేసుకోవడానికి మాత్రం ఇది అత్యుత్తమమైన వయసు.
– ప్రీతి మాలిక్, కార్పొరేట్ మేనేజ్‌మెంట్
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment