‘ప్రతి ఒక్కరూ తమను తాము స్వీకరించాలి. తమను తాము ప్రేమించుకోవాలి. లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగిపోవాలి. ఆకాశంలో ఎగరాలని ఉంటే ఆ కోరిక తప్పేమీ కాదు. అయితే... పైకి ఎగరడానికి అడ్డు వస్తున్న బరువులను పక్కన పెట్టాలి. పక్కన పెట్టాల్సింది బరువులను మాత్రమే, బాధ్యతలను కాదు. అప్పుడు నీ జీవితం నీ చేతిలోనే ఉంటుంది. ఉన్నది ఒక్కటే జీవితం. ఆ జీవితాన్ని సంతోషంగా జీవించాలని అందరికీ ఉంటుంది. కానీ, మన హక్కులను మనం గౌరవించుకుంటూ, ఇతరుల హక్కులకు భంగానికి కారణం కాకుండా, వివాదరహితంగా జీవించడం ఎలాగో తెలియకపోవడం వల్లనే జీవితం కష్టాలపాలవుతుంటుంది.
మనల్ని మనం గౌరవించుకుంటే ఇతరులను అగౌరవపరచకుండా ఉండగలిగే స్థితప్రజ్ఞత కలుగుతుంది. మనల్ని మనం ప్రేమించుకుంటే ఇతరులకు ఆత్మీయతను పంచడమూ వస్తుంది. మన దారిలో అడ్డుగా ఉన్న ముళ్లను తీసి పారేసుకునే క్రమంలో ఆ ముళ్లను పక్కవారి దారిలో వేయకుండా ఉండగలిగితే మన జీవితం హాయిగా సాగిపోతుంది. ఆశలకు ఆకాశమే హద్దుగా ఉండవచ్చు, పక్షిని చూసి స్ఫూర్తి పొందనూ వచ్చు, పక్షిలాగ తేలిగ్గా ఉండాలి.
ఇక్కడ తేలిగ్గా ఉండాల్సింది దేహం కాదు, మనసు. అనవసర ఆందోళనలు, ఆలోచనలకు తావివ్వకుండా మనసును తేలిగ్గా ఉంచుకోగలిగితే ఆశలకు, ఆకాంక్షలకు ఏదీ అడ్డురాదు. మన కంటికి పక్షి స్వేచ్ఛగా విహరించడమే కనిపిస్తుంది. కానీ అది అలా విహరించి ఆహారాన్ని అన్వేషించి గూటిలో ఉన్న రెక్కలు రాని పిల్లలను పోషించే గురుతర బాధ్యతను తన రెక్కల్లో ఇముడ్చుకుని ఉంటుంది. మన కంటికి కనిపించేది స్వేచ్ఛా విహంగమే.
ఆ స్వేచ్ఛతోపాటు రెక్కల మాటున దాగి ఉన్న బాధ్యత నుంచి కూడా మనం స్ఫూర్తి పొందాలి. పక్షి గూటిలో ఉన్న పిల్లలను కాళ్లకు బంధనాలుగా కట్టుకుని ఆకాశంలోకి వెళ్లదు, అలాగని పిల్లల బాధ్యతను వదిలి ఆకాశంలో విహరించదు. మరణం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో తెలియని అనిశ్చితిలో కూడా తన లక్ష్యాన్ని మరువదు. బాధ్యతను బరువుగా భావించదు. ఈ సూత్రం ఆధారంగా జీవితాన్ని అల్లుకుంటే జీవితం అందరికీ అందమైనదే అయి తీరుతుంది. ఈ ఏడాదిలో ఇలాగ ప్రయత్నించి చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment