
Noida Anup Khanna Wedding Wear Banks And Dadi Ki Rasoi Inspiring Journey: ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ ఉంటే అందంగా రెడీ అవుతుంటాము. ఇక పెళ్లి అంటే...జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగేది. అందులోనూ అతిరథమహారథులు హాజరై ఆశీర్వదించే అపూర్వ ఘట్టం. ఈ ఘట్టంలో వధూవరులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఆహూతులందరిని ఆకర్షించేందుకు ఆర్థిక స్థాయిని బట్టి ఒక్కొక్కరు ఒక్కోరకంగా తయారవుతుంటారు. అయితే కొందరికి అందంగా తయారవ్వాలని ఉన్నా... ఆకర్షణీయంగా కనిపించే వెడ్డింగ్ డ్రెస్ కొనే స్థోమత ఉండదు. దీంతో ఆశ కలగానే మిగిలిపోతుంటుంది. అయితే ఇటుంవంటి వారి కోరికలను నిజం చేస్తోంది ‘వెడ్డింగ్ వేర్ బ్యాంక్’.
వెడ్డింగ్ బ్యాంక్ ఏంటీ? అనిపిస్తుంది కదూ! అవును మీరు చదివింది అక్షరసత్యమే. వెడ్డింగ్ వేర్ బ్యాంక్... పెళ్లిలో వధూవరులు ధరించడానికి డిజైనర్ దుస్తులను కొన్నింటిని ఉచితంగా, మరికొన్నింటిని నామమాత్రపు రుసుముకు అద్దెకు ఇస్తుంది. పెళ్లి లేదా ఏదైనా ఫంక్షన్ మగిసిన తరువాత డ్రెస్‌లను వెనక్కి తిరిగిచ్చేయాలి. ప్రస్తుతం ఈ బ్యాంక్‌లో ఉన్న డ్రెస్‌లను వధువులేగా పెళ్లికుమారులు కూడా వాడుకుంటున్నారు. ఇక్కడ అద్దెకు ఇచ్చే లెహంగాల ఖరీదు ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది.
నిహారిక ఆలోచనతో..
నోయిడాకు చెందిన అనూప్ ఖన్నా 2017లో ఈ బ్యాంక్‌ను ప్రారంభించి, నిర్వహిస్తున్నారు. తొలిసారి ఈ బ్యాంక్‌కు నిహారిక అనే అమ్మాయి తన 70 వేల రూపాయల వెడ్డింగ్ డ్రెస్‌ను విరాళంగా ఇచ్చింది. నిహారిక తన పెళ్లి తరువాత.. ‘‘ఈ డ్రెస్‌ను ఎవరైనా నిరుపేద అమ్మాయి పెళ్లికి వేసుకోవడానికి ఇవ్వండి’’ అని చెప్పి అనూప్ కు ఇచ్చింది. అప్పుడు చుట్టుపక్కల మురికివాడల్లోని అమ్మాయిల పెళ్లిళ్లకు అనూప్ డ్రెస్‌ను ఇచ్చారు.
ఈ విషయం ఆనోటా ఈనోటా మరికొంతమందికి తెలియడంతో బాగా పాపులర్ అయ్యింది. బ్యాంక్ గురించి తెలిసిన కొందరు తమ పెళ్లిలో ధరించిన ఖరీదైన దుస్తులను విరాళంగా ఇస్తున్నారు. వీటిలో లక్షరూపాయలు ఖరీదు చేసే డ్రెస్‌లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దీనిలో పదిహేను రకాల లెహంగాలు, ఇరవై షేర్వానీలు అద్దెకు లేదా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వీటిలో నచ్చిన రంగు, డిజైన్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. పెళ్లికేగాక నిశ్చితార్థం, దీపావళి, దాండియా నైట్ వంటి ఈవెంట్లకు సైతం వీటిని వినియోగిస్తున్నారు.
నిబంధనలు తప్పనిసరి..
వెడ్డింగ్ బ్యాంక్ నుంచి డ్రెస్‌లు తీసుకోవాలంటే...కొన్ని నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే. ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డును హామీగా తీసుకుని డ్రెస్ ఇస్తారు. ఒకసారి డ్రెస్ తీసుకున్న తరువాత పదిహేను రోజుల వరకు మరో డ్రెస్ తీసుకునే అవకాశం ఉండదు. తీసుకున్న డ్రెస్‌ను తిరిగి ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా డ్రైక్లీనింగ్ చేసి ఇవ్వాలి.
డ్రెస్ తీసుకున్న వాళ్లు మాత్రమే వాడుకోవాలే తప్ప వేరే వాళ్లకు ఇవ్వకూడదు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోనే గాక..మహారాష్ట్ర, జమ్ము అండ్ కశ్మీర్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లనుంచి కూడా కొందరు తమ వెడ్డింగ్ డ్రెస్‌లను విరాళంగా ఇస్తున్నారు. పెళ్లిబట్టలతోపాటు ఇమిటేషన్ జ్యూవెలరీ, చెప్పులు, మేకప్ యాక్ససరీస్ వంటి వాటిని కూడా ఇస్తున్నారు.
దాదీకా రసోయి
అనూప్ వెడ్డింగ్ వేర్ బ్యాంక్ నిర్వహణతోపాటు రుచికరమైన ఆహారం పెట్టి నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు. వాళ్ల ‘గ్రాండ్ మదర్స్ కిచెన్ (దాదీకా రసోయి)’ ద్వారా దేశ విదేశాల్లోని వలసకూలీలకు కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆహారం అందించారు. అంతేగాక పేదలకు నామమాత్రము రుసుము పదిరూపాయలకే మందులు, బట్టలు అందిస్తున్నారు. ఈ సేవలు గుర్తించిన రాష్ట్రపతి భవన్ అనూప్‌ను సత్కరించింది. అంతేగాక ‘కౌన్ బనేగా కరోర్‌పతి’ షోకు వెళ్లినప్పుడు అనూప్ సేవలను అమితామ్ బచ్చన్ కొనియాడారు.
చదవండి: ‘గైడ్’ సినిమాను తలపించే ప్రేమ కథ.. ఫ్రెంచ్ అమ్మాయి మనసు దోచిన బిహారీ
Comments
Please login to add a commentAdd a comment