సాధారణంగా కీమోథెరపీ అనగానే క్యాన్సర్‌ను తుదముట్టించే మందుల్ని రక్తనాళం ద్వారా ఎక్కించడమే తెలుసు. కానీ ఇటీవల కీమోథెరపీని నోటి ద్వారా తీసుకునే ట్యాబ్లెట్స్/క్యాప్సూల్స్ రూపంలోనూ ఇస్తున్నారు. ప్రధానంగా కొన్ని రకాల ఊపిరితిత్తుల క్యాన్సర్లలో ఇలా జరుగుతోంది.
ఓరల్‌గా కీమో ఇచ్చే ముందు ఓ పరీక్ష...
నోటిద్వారా కీమోథెరపీ ఇవ్వడానికి ముందు ఓ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే... బాధితుల్లో చికిత్స ప్రారంభించడానికి ముందుగా వారిలోని జన్యుకణ పరిణామం ఏవిధంగా కొనసాగుతోందో తెలుసుకోవడం అవసరమవుతుంది. ఇందుకోసం ముందుగా ‘ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ (ఈజీఎఫ్‌ఆర్) మ్యుటేషన్’ అనే పరీక్ష అవసరం.
ఆరోగ్యవంతమైన కణంలో కణాల పెరుగుదల, విభజనకు ఈజీఎఫ్‌ఆర్ అనే అంశం తోడ్పడుతుంది. సరిగ్గా అదే అంశం కూడా... క్యాన్సర్ కణాల పెరుగుదల, విభజనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. దాంతో క్యాన్సర్ కణాలు సైతం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి. తర్వాత ఆ కణాలన్నీ ఒకేచోట కుప్పబడినట్లు పెరగడంతో ట్యూమర్లలా ఏర్పడతాయి.
పరీక్ష తర్వాత నోటి మందుల రూపంలో కీమో...
ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ (ఈజీఎఫ్‌ఆర్) పరీక్ష ఫలితాలను బట్టి... అనువైన బాధితులకు టాబ్లెట్ల రూపంలోనే కీమోథెరపీని అందించవచ్చు. ఇవి కూడా కీమో అంత ప్రభావ పూర్వకంగానే పనిచేస్తాయి.
పైగా దీనివల్ల దుష్ఫలితాలు (సైడ్‌ఎఫెక్ట్స్) కూడా తక్కువే. సెలైన్‌లా ఇంట్రావీనస్‌గా మందు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి... ఈ ట్యాబ్లెట్లను బాధితులు నేరుగా ఇంటికే తీసుకెళ్లి వాడవచ్చు. కాబట్టి గతంలోలా ఇప్పుడు కీమోపట్ల అంతగా ఆందోళన చెందాల్సిన అసవరం లేదు.
అయితే మెరుగైనదే మనుగడ సాగిస్తుంది (సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్) అన్నది అన్నిట్లో లాగే క్యాన్సర్ కూడా జరుగుతుంది. అంటే క్యాన్సర్ కూడా తనను తాను మరింత మెరుగైనదిగా తయారు చేసుకుంటుంది. అందుకే మందులను వాడుతున్నకొద్దీ అది వాటిని తప్పించుకునేట్లుగా రూపొందడం ప్రారంభించింది. అందుకే ఈ మందుల్లోనూ మరింత సమర్థమైన వాటిని రూపొందించడం ప్రారంభమైంది. పలితంగా రెండో విడత మందుల్లో డేకోటనిమ్, అఫాటినిబ్ వంటి మందులను తయారు చేశారు.
అటు పిమ్మట అందులోనూ ఇంకా సమర్థమైన ఒసోమెరిటోనిబ్ వంటివి రూపొందాయి. అప్పటికి అదే అత్యంత ఆధునికమైనది. అయితే... ఇంకా ‘ఓరల్ టార్గెట్ థెరపీ’ పేరిట మరిన్ని కొత్త కొన్ని మందులు (ఉదాహరణకు సెరిటినిబ్, లోర్లాని వంటివి) ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
అంతేకాదు... ఊపిరితిత్తుల ఆల్క్‌రాస్ వంటి అరుదైన జన్యుమార్పులను కూడా ఈ ఓరల్ టార్గెట్ థెరపీ మందులు సమర్థంగా నియంత్రించగలవు. ఊపిరితిత్తుల్లోనే కాకుండా బ్లడ్ క్యాన్సర్ మొదలుకొని బ్రెస్ట్ క్యాన్సర్ వరకు పదుల సంఖ్యలో హానికరమైన జన్యువులను నిరోధించేందుకు ఇప్పుడు వందలాది మందులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment