కట్నం కాలనాగు మళ్లీ బుస కొడుతోంది..నేడు కేరళ... రేపు? | Outrage over alleged dowry-related deaths | Sakshi
Sakshi News home page

కట్నం కాలనాగు మళ్లీ బుస కొడుతోంది..నేడు కేరళ... రేపు?

Published Tue, Jul 6 2021 12:36 AM | Last Updated on Tue, Jul 6 2021 12:53 AM

Outrage over alleged dowry-related deaths - Sakshi

విస్మయ, సుచిత్ర, అర్చన

‘అమ్మా... కట్నానికి వ్యతిరేకంగా మీరెవరైనా ఉద్యమం లేవదీస్తే నేను వాలెంటీర్‌గా పని చేస్తా’ అన్నారు కేరళ గవర్నర్‌ ఆవేదనగా. కేరళలో రెండు రోజుల తేడాలో ముగ్గురు వివాహితలు వరకట్న చావులకు లోనయ్యారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వినవచ్చిన వరకట్న చావులు మళ్లీ కేరళ ఘటనలతో చర్చలోకి వచ్చాయి. కట్నం అనే మాట అంతరించిపోలేదు. అది పెట్టే బాధలు గతించి పోలేదు.

కాకపోతే ఆ బాంబు కేరళలో ముందు పేలింది. మన చుట్టుపక్కల ఈ వేధింపులను గమనిస్తున్నామా?
మొన్నటి జూన్‌ 21–22 తేదీలలో కేరళలో జరిగిన మూడు వరకట్న చావులు ఇలా ఉన్నాయి. ‘కట్నం’ మాట ఇప్పుడు వాడటం లేదు. ‘ఏమైనా ఫార్మాలిటీలు ఉంటే మాట్లాడుకుందాం’ అంటున్నారు. గత సంవత్సరం పెళ్లయిన విస్మయ అనే ఆయుర్వేద ఫైనల్‌ ఇయర్‌ స్టూడెంట్‌ (కొళ్లం–కేరళ)కు ఆమె తండ్రి ఈ ‘ఫార్మాలిటీస్‌’లో భాగంగా అల్లుడికి ఒక కారు, 100 సవరల బంగారం, 10 లక్షల డబ్బు. 1.25 ఎకరాల స్థలం ఇచ్చాడు. అల్లుడు కిరణ్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌. అయితే ఆ సదరు అల్లుడికి కేవలం 11 లక్షల కారు ఇవ్వడం నచ్చలేదు. లగ్జరీ కారు అడిగాడు. కొట్టాడు. ఎలా భరించడం అనుకుందో వాళ్లే చంపేశారో మొన్న జూన్‌ 21న ఆమె అత్తవారింట్లో మరణించింది.

ఆ వెంటనే 24 గంటల వ్యవధిలో తిరువనంతపురం శివారు విజింజంలో 24 ఏళ్ల అర్చన ఒళ్లు కాలి మరణించి కనిపించింది. ఆమె భర్త సురేశ్‌ ప్లంబర్‌. 3 లక్షల కట్నం డిమాండ్‌. మామగారు ఇవ్వలేకపోయారు. అత్తగారింట్లో ఉన్న అర్చనను సురేశ్‌ ఆ రోజు ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయం లో అతని దగ్గర డీజెల్‌ బాటిల్‌ ఉంది. ఆ డీజెల్‌ పోసుకునే ఆమె ఆత్మహత్య చేసుకుంది (హత్య జరిగింది). ఆ డీజెల్‌ను తాను చీమల్ని చంపడానికి తెచ్చాను అని సురేశ్‌ చెబుతున్నాడు.

మరో కొద్దిగంటల వ్యవధిలో 3 నెలల క్రితం వివాహం అయిన 19 సంవత్సరాల సుచిత్ర (అలెప్పి) అనుమానాస్పదంగా మరణించింది అత్తవారింట్లో. ఆమె భర్త మిలట్రీలో పని చేస్తాడు.  ‘మా స్తోమతకు టూ వీలర్‌ ఇద్దామనుకున్నాం. కారు అడిగారు ఇచ్చాం. 51 సవరల బంగారం పెట్టాం. కాని వాళ్లు ఇంకో పది లక్షలు అడగడం మొదలెట్టారు’ అని సుచిత్ర తండ్రి చెప్పాడు.

ఈ మూడు ఘటనలు ఒకే విషయం చెబుతున్నాయి. అమ్మాయిలు ఏమి చదువుకున్నా, ఎలాంటి ఉద్యోగం చేస్తూ ఉన్నా కట్నం ఇవ్వాలి. మగవాళ్లు ఏ పని చేస్తున్నా ఏ ఆర్థిక స్థితిలో ఉన్నా కట్నం డిమాండ్‌ చేయాలి. కేరళలో అక్షరాస్యత ఎక్కువని అందరికీ తెలుసు. మహిళా అక్షరాస్యత కూడా ఎక్కువ. కాని ఎంత చదువుకున్నా ఈ సాంఘిక దురాచారానికి తల వొంచాలి. పురుషుడు ఈ దురాచారంతో పెత్తనం చేయాలి.

భార్యను పాముతో చంపాడు
కేరళలో వరకట్న ఘటనలు గత సంవత్సరం మొదలయ్యాయి. మే 7, 2020న కొట్టరక్కాకు చెందిన ఉత్తర అనే వివాహిత పాము కాటుతో మరణించింది. ఆమె వికలాంగురాలు. ఆస్తి కోసం ఆమెను పెళ్లాడిన భర్త సూరజ్‌ పకడ్బందీగా ప్లాన్‌ చేసి ఆమె నిద్రలో ఉండగా పాము కాటు వేయించాడు. ఉత్తర తల్లిదండ్రులకు అనుమానం వచ్చి కేసు నమోదు చేయగా నిపుణుల అది పామును పురిగొల్పి వేయించిన కాటుగా నిర్థారించారు. ఆ కేసు ఇప్పుడు తీర్పు స్థాయికి వచ్చింది.

ఏమిటి ఈ అడిగేది... ఇచ్చేది...
స్త్రీ, పురుషులు సమానం... ఇద్దరూ కలిస్తేనే జీవితం... ఒకరు లేకుండా మరొకరి జీవితం అసంపూర్ణం అనే వాస్తవం అందరికీ తెలిసినా పురుషుడు తాను ధర పలికే వాడుగా ఎందుకు మారాడు? ఆమె విలువ లేనిదిగా ఎందుకు మిగిలింది? ‘పెళ్లి లేకపోతే స్త్రీ బతకలేదు అనే భావజాలం కూరి కూరి ఆమెను నిస్సహాయురాలు చేశారు. ఇల్లు ముఖ్యం అనే భావన కూడా అంతే. ఆర్థిక స్వతంత్రం దీనికి జవాబు అని అంటారు గాని అన్ని ఉద్యోగాలలో స్త్రీలకు ప్రవేశం లేదు. కొన్ని ఉద్యోగాలు చేసే స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు.

టెన్‌ టు ఫైవ్‌ జాబ్‌ చేస్తూ ఉన్నవాళ్లే పురుషులకు కావాలి. మార్కెటింగ్, ప్రయాణాలు ఉన్నవారిని వద్దంటారు. భర్త, ఇల్లు కోసం ఉద్యోగాలలో ప్రమోషన్లను వద్దనుకునే వేలాది స్త్రీలు ఉన్నారు.  సమాజ భావజాలంలో పెద్ద ఎత్తున మార్పు వస్తే గాని ఇది మారదు’ అని ఆ ప్రాంత సామాజిక కార్యకర్తలు అంటున్నారు. స్త్రీల బాధలో స్త్రీల బాధ్యత ఎంత అనే ప్రశ్న కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. కోడలు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో అత్త, ఆడపడుచు, తోడి కోడలు వంటి సాటి స్త్రీలు కొత్త కోడలికి మద్దతుగా ఉంటున్నారా... లేదా పీడనకు లోనవుతుంటే ఆ పీడనకు సమర్థింపుగా ఉంటున్నారా గమనించుకోవాలి అని మహిళావాదులు అంటున్నారు.

వరకట్న నిరోధక చట్టం ఉన్నా, గృహ హింస నిరోధ చట్టం ఉన్నా స్త్రీలు నిశ్శబ్దంగా ఈ హింసను అనుభవిస్తూ ఉండటం వల్ల వరకట్న సమస్య లేనట్టే అన్నట్టుగా తెలుగు సమాజం కూడా ఉంది. భరించలేని స్థితికి చేరుకున్న ‘ఫార్మాలిటీస్‌’ ఎవరికి వారు పరిశీలించుకుంటే ‘నో టు డౌరీ’ అని గట్టిగా ఎలుగెత్తే అవసరం తెలుస్తుంది. కేరళ ఆ మేరకు హెచ్చరిక చేస్తోంది.

స్త్రీ, పురుషులు సమానం... ఇద్దరూ కలిస్తేనే జీవితం... ఒకరు లేకుండా మరొకరి జీవితం  అసంపూర్ణం అనే వాస్తవం అందరికీ తెలిసినా పురుషుడు తాను ధర పలికే వాడుగా ఎందుకు మారాడు? ఆమె విలువ లేనిదిగా ఎందుకు మిగిలింది?

– సాక్షి ఫ్యామిలీ
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement