కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసింది. దీని ప్రభావంతో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకులాయి. దీంతో అన్ని దేశాల్లోలాగానే భారత్‌లో ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెట్టేందుకు భారత ప్రభుత్వం కోవిడ్–19 రికవరీ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజిపై ప్రధాని మోడీ ప్రసంగింస్తూ..‘ఆత్మనిర్భరత’ అనే పదాన్ని నొక్కిపలికారు. అప్పటినుంచి ఈ పదం జనం నోళ్లలో తెగ నానుతోంది. ఇది గుర్తించిన ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ లాంగ్వేజ్ నిపుణుల సలహా ప్యానల్ ఆత్మనిర్భరత పదాన్ని హిందీ వర్డ్ ఆఫ్ ది ఇయర్–2020గా ఎంపిక చేసింది.
ఆత్మనిర్భరత అంటే సెల్ఫ్ రిలయన్స్ లేదా స్వావలంబన (స్వయం ప్రతిపత్తి) అని అర్థం. ఏటా బాగా ప్రాచుర్యం పొందిన, కొత్తగా వాడుకలోకి వచ్చిన పదాలను ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తిస్తుంది. తాజాగా ఆక్స్‌ఫర్డ్ హిందీ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్–2020 పదంగా ‘ఆత్మనిర్భరత’ను ప్రకటించింది. ఆత్మనిర్భరత అనేది కేవలం పదం మాత్రమే కాదని, గతేడాది దేశ నైతిక, మానసిక స్థైర్యాన్ని ప్రతిబించిందని ప్యానెల్ వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలోని కోట్ల మంది ప్రజలు కొత్త కొత్త జీవన విధానాలను అలవర్చుకోవాల్సి వచ్చింది. 2020కి ముందు కన్నా ఇప్పుడు వ్యక్తిగత స్వాలంబన పెరిగింది. ఆన్‌లైన్ క్లాస్‌లు, వర్క్‌ఫ్రం హోం, ఆరోగ్యంపై శ్రద్ధ, సొంతంగా వంట చేసుకుని రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టిమళ్లడం, ఇంట్లో పనులను అందరూ కలిసి చేయడం, ఇంట్లోని ఆత్మీయుల కోసం సమయం కేటాయించడం వంటి అనేక అంశాల్లో సెల్ఫ్ రిలయన్స్ బాగా పెరిగిందని లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్ క్రితికా అగర్వాల్ చెప్పారు.
రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా బయోటెక్నాలజీ విభాగం ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారాన్ని హైలెట్ చేస్తూ..కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియను రాజ్‌పథ్‌లో శకటాల ప్రదర్శనలో ఉంచింది. దీని ద్వారా కూడా ఆత్మనిర్భరతకు మరింత గుర్తింపు వచ్చింది. కాగా హిందీ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా గతంలో ఆధార్ (2017), నారీ శక్తి(2018), సంవిధాన్(2019)లు ఎంపికయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment