Pratima Joshi: Inspirational Work Putting Slums On Map Maharashtra Kolhapur : పిజ్జాబాయ్ బండి మీద రయ్యిమని వచ్చేశాడు. డోర్ కొట్టాడు. డోర్ తెరిచిన ఆ యువతి తాను ఆర్డర్ ఇచ్చిన పిజ్జాను సంతోషంగా తీసుకుంది. దీంట్లో విశేషం ఏముంది? అంటారా! అయితే ఆమె మాటలు వినండి.... ‘ఒకప్పుడు పిజ్జా డెలివరీనే కాదు. ఇంటికి ఉత్తరం రావాలన్నా కష్టమే. ఏవో కొండ గుర్తులు చెప్పాల్సి వచ్చేది. మేమొక చోటు చెబితే వారు వేరే చోటికి వెళ్లేవారు. టైమ్ వృథా అయ్యేది.
ఇప్పుడు అలాంటి సమస్య లేదు’ ఇంటి గోడకు అతికించిన ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఆ ఇంటి అడ్రస్ కనుక్కోవడాన్ని సులువు చేసింది. ఇంత ఆధునిక కాలంలోనూ మొన్న మొన్నటి వరకు మహారాష్ట్రలోని కొల్హాపూర్ మురికివాడల్లో ఇంటి అడ్రస్ కనుక్కోవడం పెద్ద సవాలుగా ఉండేది. దీని వల్ల జరిగిన నష్టాలు తక్కువేమీ కాదు. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి ప్రతి ఇంటి గోడకు ఆల్ఫాన్యూమరిక్ కోడ్ అతికించే పని చేయించింది ప్రతిమ జోషి.
ప్రతిమ వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్.
‘మన కాలాన్ని ప్రతిబింబిస్తూనే, అన్ని కాలాలకు నచ్చే అందమైన భవనాలను నిర్మించాలి’ అని ఆర్కిటెక్చర్ చెబుతుంది.ఖరీదైన భవనాల్లో మాత్రమే కాదు...ఎవరూ అంతగా చూపు సారించని మురికివాడలకు అందం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రతిమ. మహారాష్ట్రియన్ అయిన ప్రతిమ పెరిగింది మాత్రం చెన్నైలోనే. ‘అన్నా యూనివర్శిటీ’లో ఆర్కిటెక్చర్ చదువుకుంది. ఆ తరువాత ముంబైకి వెళ్లింది. ఒకసారి పుణెలోని మురికివాడకు అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితిని చూసిన వెంటనే ‘భారతదేశంలో రెండు దేశాలు ఉన్నాయి. ఒకటి సంపన్న భారతదేశం, రెండు పేద భారతదేశం’ అనే మాట గుర్తుకు వచ్చింది.
ఎటు చూసినా అస్తవ్యస్తం, అపరిశుభ్రత!
అందరిలాగా నిట్టూర్చి అక్కడి నుంచి బయట పడలేదు ప్రతిమ. పుణె కేంద్రంగా ‘షెల్టర్ అసోసియేట్స్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. రోడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సదుపాయం, పరిసరాల పరిశుభ్రత... ఇలా బస్తీలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యేలా కృషి చేసింది. పుణెలోనే కాకుండా ఈ సంస్థ కార్యక్రమాలు నవీ ముంబై, కొల్హాపూర్, థానే...ఎన్నో ప్రాంతాలకు విస్తరించాయి.
‘గూగుల్ ఎర్త్’ను ఎవరు ఏ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నా‘సామాజిక స్పృహ’ కోణంలో ఉపయోగించుకున్న వారిలో ప్రతిమ ప్రథమ వరుసలో ఉంటుంది. ‘పావర్టీ మ్యాపింగ్’ ద్వారా బస్తీలోని పేద ప్రజలకు ఆర్థికంగా చేయూత ఇచ్చే కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ‘గూగుల్ ఎర్త్ హీరో’ అవార్డ్ కూడా అందుకుంది.
‘రకరకాల వస్తువులు, మందులు ఇప్పుడు ఇంటి దగ్గరకే వస్తున్నాయి. అంబులెన్స్ రావడానికి ఎలాంటి అవరోధాలు లేవు’ అంటున్న ప్రతిమ ‘డిజిటల్ అడ్రసెస్’ అనే ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ప్రతిమ బృందం నగరాల్లోని మురికివాడల్లో నివసించే వారి పూర్తి చిరునామాలను డిజిటల్‌లోకి తీసుకువచ్చి బ్యాంకులా తయారు చేసింది. దీని ద్వారా ప్రభుత్వసేవాకార్యక్రమాలు బసీ ్తపేదలకు చేరడం సులభం అవుతుంది.
‘షెల్టర్ అసోసియేట్స్’ ఎన్నో మురికివాడల్లో మార్పు తెచ్చింది. ‘ఇదేం బస్తీ నాయనోయ్’ అనుకున్న వాళ్లను ‘బస్తీ చిన్నది... భలేగున్నది’ అనుకునేలా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment