Preeti Rajak: సుబేదార్‌ ప్రీతి | Preeti Rajak: Indian Army first woman Subedar sakshi special story | Sakshi
Sakshi News home page

Preeti Rajak: సుబేదార్‌ ప్రీతి

Published Tue, Jan 30 2024 4:15 AM | Last Updated on Tue, Jan 30 2024 4:15 AM

Preeti Rajak: Indian Army first woman Subedar sakshi special story - Sakshi

ఆర్మీలో మొదటిసారి ఒక మహిళ ‘సుబేదార్‌’ ర్యాంక్‌కు ప్రమోట్‌ అయ్యింది. రెండేళ్ల క్రితం ఆర్మీలో హవల్దార్‌గా చేరిన ప్రీతి రజక్‌ తన క్రీడాప్రావీణ్యంతో ఆసియన్‌ గేమ్స్‌లో ట్రాప్‌ షూటర్‌గా సిల్వర్‌ మెడల్‌ సాధించింది. దేశవ్యాప్తంగా యువతులను ఆర్మీలో చేరేలా ఆమె స్ఫూర్తినిచ్చిందని ఆమెకు ఈ గౌరవం కల్పించారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రీతి రజక్‌ ఆర్మీలో ‘సుబేదార్‌’ ర్యాంక్‌కు ప్రమోట్‌ అయ్యింది. ఆర్మీలో ‘సుబేదార్‌’ అనిపించుకోవడం చిన్న విషయం కాదు. ‘సిపాయి’ నుంచి మొదలయ్యి ‘లాన్స్‌ నాయక్‌’, ‘నాయక్‌’, ‘హవల్దార్‌’, ‘నాయబ్‌ సుబేదార్‌’... ఇన్ని దశలు దాటి ‘సుబేదార్‌’ అవుతారు. ఆర్మీలో మహిళల రిక్రూట్‌మెంట్‌ 1992లో మొదలయ్యాక సంప్రదాయ అంచెలలో ఒక మహిళ సుబేదార్‌గా పదవి పొందటం ఇదే మొదటిసారి. ఆ మేరకు ప్రీతి రజక్‌ రికార్డును నమోదు చేసింది. ట్రాప్‌ షూటర్‌గా ఆసియన్‌ గేమ్స్‌లో ఆమె చూపిన ప్రతిభను గుర్తించిన ఉన్నత అధికారులు ఆమెను ఈ విధంగా ప్రోత్సహించి గౌరవించారు.

► లాండ్రీ ఓనరు కూతురు
ఇరవై రెండేళ్ల ప్రీతి రజక్‌ది మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ సమీపంలో ఉన్న నర్మదాపురం. దిగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి లాండ్రీషాపు నడుపుతాడు. తల్లి సామాజిక సేవలో ఉంది. ముగ్గురు అక్కచెల్లెళ్లలో రెండవ సంతానమైన ప్రీతి చిన్నప్పటి నుంచీ ఆటల్లో చురుగ్గా ఉండేది. క్రీడలంటే ఆసక్తి ఉన్న తండ్రి తన కూతుళ్లను శక్తిమేరకు క్రీడాకారులు చేయదలిచి ప్రోత్సహించాడు. అలా ప్రీతి షూటింగ్‌లోకి వచ్చింది. భోపాల్‌లోని స్పోర్ట్స్‌ అకాడెమీలో శిక్షణ పొందుతున్న సమయంలోనే ప్రీతి జాతీయ స్థాయిలో ప్రతిభ చూపింది. పతకాలు సాధించింది. దాంతో ఆర్మీలో స్పోర్ట్స్‌ కోటాలో మిలటరీ పోలీస్‌ డివిజన్‌లో నేరుగా 2022లో హవల్దార్‌ ఉద్యోగం వచ్చింది.

► ఏ సాహసానికైనా సిద్ధమే
ఆర్మీలో చేరినప్పటి నుంచి ప్రీతి ఏ సాహసానికైనా సిద్ధమే అన్నట్టుగా పనిచేస్తూ పై అధికారుల మెప్పు పొందింది ప్రీతి. షూటింగ్‌ను ప్రాక్టీస్‌ చేయాలంటే ఖర్చుతో కూడిన పని. కాని ఆర్మీలో చేరాక ఆమెకు శిక్షణ మరింత సులువైంది. అందుకు కావలసిన గన్స్‌ ఆమెకు మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. ఇక చైనాలో జరిగిన 2023 ఆసియన్‌ గేమ్స్‌లో షార్ట్‌ పిస్టల్‌ విభాగంలో ప్రీతి రజత పతకం సాధించడంతో ఆర్మీ గౌరవంతో పాటు దేశ గౌరవమూ ఇనుమడించింది. ‘నేటి యువతులు ఇళ్లల్లో కూచుని ప్రతిభను వృథా చేయొద్దు. ఇంటినుంచి బయటకు రండి’ అని ప్రీతి ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. దాంతో చాలామంది అమ్మాయిలు ఆర్మీలో చేరడానికి ఉత్సాహం చూపారు. ఇది పై అధికారులకు మరింతగా సంతోషం కలిగించడంతో జనవరి 28, 2024న ఆమెకు సుబేదార్‌గా ప్రమోషన్‌ ఇచ్చారు.

► పారిస్‌ ఒలింపిక్స్‌కు
ఈ సంవత్సరం జూలైలో పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో ఎలాగైనా పతకం తేవడానికి ప్రీతికి ఆర్మీ వారే శిక్షణ ఇస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని మహౌలోని ‘ఆర్మీ మార్క్స్‌మెన్‌షిప్‌ యూనిట్‌’ (ఏ.ఎం.యు.)లో ప్రీతికి ప్రస్తుతం శిక్షణ కొనసాగుతూ ఉంది. జాతీయ స్థాయిలో మహిళా ట్రాప్‌ షూటింగ్‌లో విభాగంలో ఆరవ ర్యాంక్‌లో ఉంది ప్రీతి. ఆమె గనక ఒలింపిక్‌ మెడల్‌ సాధిస్తే ఆర్మీలో ఆమెకు దొరకబోయే ప్రమోషన్‌ మరింత ఘనంగా గర్వపడే విధంగా ఉంటుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement