నీరు .. పుడమిపై జీవానికి, జీవులన్నింటి మనుగడకి మూలాధారం. నింగి, నేల, నిప్పు, గాలితో కలిసి ప్రకృతికి మూలకారణమైన పంచభూతాలలో ఒకటి. నాలుగింట మూడొంతుల నీటితోనే భూగ్రహం ఆవహించి ఉంది. మన సౌరవ్యవస్థ మొత్తంలో నీరు కలిగి ఉన్న ఏకైక గ్రహంగా పుడమికి ప్రత్యేక గుర్తింపు, స్థాయి తెచ్చి జీవరాశి ఉన్న ఒకే ఒక గ్రహంగా (ఇప్పటికి నిర్ధారణ అయిన శాస్త్రం ప్రకారం) ఖ్యాతి నిలిపింది నీరే! ప్రకృతిలో స్థిర పరిమాణంలో ఉండే జలం, సహజంగా ఒక స్థితి నుంచి మరో స్థితి (ఘన, ద్రవ, వాయు)లోకి క్రమపద్ధతిలో మారుతూ ఉంటుంది.
ఈ చక్రీయ ప్రక్రియ (సైక్లిక్ ఫినామినా)తో జీవరాశి మనుగడను కాపాడుతూ, తాను రక్షణ పొందుతూ ఉంటుంది నీరు. అపారమైన జీవ, నిర్జీవ సంపద కలిగిన ప్రకృతి.. కోట్లాది సంవత్సరాలుగా తనంత తాను సమతుల్యత సాధిస్తూ పాటిస్తూ వస్తోంది. కోట్ల కొలది జీవరాశులు పరస్పరం ఆధారపడి సహజీవనం సాగిస్తూ వస్తున్నాయి. మానవ ప్రమేయం, అంతకుమించి మనిషి విస్తృత కార్యకలాపాలు ఇంకా చెప్పాలంటే మనుష్యజాతి స్వార్థం వల్ల ప్రకృతిలోని సమతూకానికి తీరని భంగం ఏర్పడుతోంది. పరిస్థితులు కళ్లముందే విషమిస్తున్నాయి.
కాలుష్యాలతో భూతాపం అసాధారణంగా పెరుగుతోంది. సహజంకన్నా మానవ ప్రమేయాల వల్లనే ప్రకృతి సమతుల్యత చెడి.. నీటి వలయం (వాటర్ సైకిల్)లో వ్యత్యాసాలొస్తున్నాయి. వర్షరుతువు నిడివి, సమయ సందర్భాలు మారుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి పెరిగిపోయి తుపాన్లు, వరదలు, కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలు ముంచుకు వస్తున్నాయి. భూమిపై వాతావరణాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భూగోళంపై ఏదో చోట ఎప్పుడూ ఉపద్రవాలు వస్తూ, భూమ్యావరణాన్ని బీభత్సం చేయడంతో మనిషి మనుగడ కష్టాల పాలవుతోంది.
జీవ వైవిధ్యానికి తీరని ముప్పు ఏర్పడుతోంది. లక్షల సంవత్సరాల్లో జరగని నష్టం గత వెయ్యేళ్లలో జరిగితే.. అందులో మొదటి సగభాగంలోని నష్టాలు – అరిష్టాలకు ఎన్నో రెట్లు .. పారిశ్రామికీకరణ తర్వాత (గత నాలుగు వందల ఏళ్లలోనే) చోటుచేసుకున్నాయి. మరీ ముఖ్యంగా గడచిన మూడు దశాబ్దాల్లో (గ్లోబలీకరణ తర్వాతి కాలంలో) జరుగుతున్న పరిణామాలు తీవ్రమైన ‘వాతావరణ మార్పుల’కు కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జలవనరుపై ఎంతో ఒత్తిడి పెరుగుతోంది. వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావాలు కొట్టొచ్చినట్టు కనిపించేది నీటి ద్వారానే! అతివేగంగా ముంచుకు వచ్చిన వాతావరణ మార్పు విసిరిన రెండు పెద్ద సవాళ్లు.. ఒకటి నీరు – లభ్యత, రెండు.. ఆహారం – ఉత్పత్తి – పంపిణీ.
మానవేతిహాసాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే..
నాగరికతలన్నీ నదులు, నదీలోయ ప్రాంతాల్లో జలవనరులను కేంద్రకం చేసుకొని పుట్టి, ఎదిగినవే! అటువంటి నీరు, నీటి లభ్యత ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో నలుగుతోంది. నీరు ఇంత సంక్లిష్టం కావడానికి కారణం.. ఇది సమస్తప్రాణుల జీవనంతోపాటు ప్రగతి, వికాసంతో ముడిపడి ఉండటమే! దానికి తోడు పుడమి జీవావరణం (ఎకోసిస్టమ్) కూడా తేమ, నీరు, నీటి వివిధ రూపాల వల్లనే మనగలుగుతోంది.
నాలుగింట మూడొంతులు పుడమి నీటితోనే ఆవహించి ఉన్నా లోతైన – విశాలమైన సముద్రాలలో అపారజలరాశి కనిపిస్తున్నా.. మనకు వినియోగ యోగ్యమైన / లభ్యమైన నీరు ఒక శాతంలోపే! మంచి నీరు మొత్తంగా 3 శాతం వరకు ఉన్నప్పటికీ మూడింట రెండు పాళ్లపైనే ధ్రువాలలో, ఇతరత్రా మంచురూపంలో, గాలిలో ఆవిరి, తేమ రూపంలో ఉండి మనకు లభ్యం కాదు.
అందుబాటులోని పరిమిత మంచినీటి వనరులు కూడా క్రమంగా విలుప్తం అవుతూ, కాలుష్యంగా మారుతూ తీవ్ర నీటి ఎద్దడి ప్రబలుతోంది. అన్ని ఖండాలలోనూ ఇదే పరిస్థితి. మంచి నీరు మనకు ప్రధానంగా తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలతోపాటు జీవావరణ, జీవవైవిధ్య మనుగడకు అవసరం. నీటి ఎద్దడికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి.. సహజమైన భౌతిక కొరత. రెండు.. నీటి నిర్వహణ లోపాలు, నీటి సామర్థ్య నిలువ – నిర్వహణ వ్యవస్థల వైఫల్యాలు.
ప్రపంచమంతటా..
నీటి ఎద్దడి అభివృద్ధి సమాజాలతోపాటు అంతటా ఉంది. ఆఫ్రికా, పశ్చిమాసియా అరబ్, ఆసియా దేశాలు ప్రధానంగా సహజ వనరులకు చాలా దగ్గరి సంబంధం కలిగిన ఆర్థిక వ్యవస్థలతో ఉన్నాయి. అడవులు, వ్యవసాయం, మత్స్య సంపద వంటివి నీటితో ముడిపడి ఉన్న వ్యవహారాలు. ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు జనాభా పెరుగుతుంటే మరోవైపు నీటి వనరులు నశిస్తూ నీటి ఎద్దడి ప్రబలడం ఆందోళన కలిగిస్తోంది.
ఆఫ్రికా (సబ్ సహారన్ ఆఫ్రికా)లో, కొన్ని ఆసియా (పాక్షిక ఉష్ణమండల) దేశాల్లో 2050 నాటికి 10 శాతం వర్షపాతం తగ్గనున్నట్టు లెక్కలున్నాయి. ఇది ఆహారోత్పత్తిపైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. 2025 నాటికే ప్రపంచంలోని సగం దేశాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదర్కొంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదికలు చెబుతున్నాయి. ‘వాతావరణ మార్పు’ నాలుగు ప్రధాన ప్రభావాలు.. (1) ఎడారీకరణ, (2) తుపాన్లు, వరదలు – కరువులు, (3) వ్యవసాయానికి దెబ్బ, (4) ఆహారోత్పత్తి.. ఇవన్నీ నీటితో ముడిపడిన అంశాలే.
ప్రమాద పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్నా మనిషి నిర్లక్ష్యం వల్ల జలవనరులు కలుషితమవుతున్నాయి. మురుగుతో, పారిశ్రామిక వ్యర్థాలతో, విషరసాయనాలతో చెరువులు, కుంటలు, సరస్సులు, నదులు, భూగర్భ జాలాలు చివరకు సముద్రాలు కూడా కలుషితం అవుతున్నాయి. వ్యవసాయానికి, తాగుకు కాలుష్య జలాల వాడకం జీవుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది.
పదిలో ఒకరికి తాగునీటి కరువు
తాగునీటి సమస్య అంటే ఆరోగ్య సమస్య అన్నట్టే లెక్క. ఎందుకంటే ఏటా పదిలక్షల మంది నీటి కొరత, అపరిశుభ్రత వల్ల సంక్రమించే వ్యాధులతో మరణిస్తున్నారు. కేవలం రక్షిత తాగునీటిని అందిచడం వల్ల ఇందులో అత్యధిక మరణాలను నివారించవచ్చు. రక్షిత నీటి లభ్యత – ఎద్దడి అన్నది ఎంతో తేడాను తెస్తుంది. రక్షిత తాగునీరు పిల్లల నుంచి పెద్దల వరకు మొత్తం కుటుంబాన్ని.. తద్వారా మానవజాతినే సాధికారతవైపు నడుపుతుంది.
తాగునీటి సమస్య వల్ల మొదట ప్రభావితం అయ్యేది పిల్లలు, మహిళలు, వృద్ధులు. సామాజిక కోణంలో చెప్పాలంటే పేదలు, బడుగు – బలహీనవర్గాల వారు. సమాజపు ఆరోగ్య స్థాయినే కాక ఆర్థిక స్థితిగతులను కూడా త్రీవంగా ప్రభావితం చేసే సహజ వనరు తాగునీరు. ప్రపంచంలో 77 కోట్ల మంది (ప్రతి పది మందిలో ఒకరు) తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. 170 కోట్ల మంది (నలుగురిలో ఒకరి)కి దాపుగల మరుగుదొడ్డి సదుపాయం లేదు. నీటి సంబంధ జబ్బులవల్లే ప్రతి రెండు నిమిషాలకొక శిశువు మరణిస్తుండగా లక్షలాది మంది పిల్లల ఎదుగుదల లోపానికి ప్రధాన కారణం రక్షిత తాగునీరు, పరిశుభ్ర పరిసరాలు లేకపోవడమే!
తాగునీరు సమకూర్చుకోవడంలో వెచ్చిస్తున్న శ్రమశక్తి విలువ (ముఖ్యంగా మహిళలు, పిల్లలు) ఏటా 260 కోట్ల డాలర్లకు సమానమని పరిశోధనలు తేల్చాయి. ఇప్పుడున్న తాగునీటి వినియోగరేటును బట్టి వాతావరణ మార్పు ఫలితంగా ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు 2025 నాటికి తీవ్ర నీటి ఎద్దడిలోకి జారుతుంది. భారతదేశంలోనూ ఆరోగ్య ఆర్థిక స్థితికి ప్రధానంగా రక్షిత తాగు నీరే వెన్నెముక. నీటికారక వ్యాధులే ఏటా సుమారు రూ. 4500 కోట్ల ఆర్థిక భారాన్ని మోపుతున్నట్టు ‘యూనిసెఫ్’ అంచనా.
దేశంలో సగం జనాభాకు కూడా రక్షిత మంచి నీరు అందుబాటులో లేదు. ముఖ్యంగా గ్రామీణ భారతం. మూడింట రెండొంతుల జిల్లాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. రక్షిత నీటిని అందించే సరైన ప్రణాళికలు లేవు. వేగంగా భూగర్భజల మట్టాలు పడిపోతుండటం ఒక పెద్ద సవాలు. 3.5 నుంచి 4 కోట్ల బోరు బావుల ద్వారా గ్రామీణ (85 శాతం), పట్టణ– నగర ప్రాంతాల్లో (48 శాతం) తాగునీటి అవసరాలు తీరుస్తుండటమే ఇందుకు కారణం.
పెరిగే భూతాపం, వాతావరణ మార్పులు, తుపాన్లు, వరదలు – కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల తాగునీటి వనరులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. నదులు, సరస్సులు, చెరువులు, కుంటలు, భూగర్భజలాలు ఇతర వనరులు ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయి. ఎండిపోవడమో, కలుషితమవడమో జరిగి పరిస్థితులు దిగజారుతున్నాయి. చిత్తడి, తేమనేలలు సగానికి పైగానే కనుమరుగయ్యాయి.
జనాభా పెరుగుదల కారణంగా ఆహారోత్పత్తి అవసరాలు పెరగటం, వ్యవసాయానికి నీటి వినియోగం అధికమవడం కూడా తాగునీటి ఎద్దడికి దారి తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వెలువడే నివేదికలను బట్టి పారిశ్రామిక వ్యర్థ రసాయనాలు, వ్యవసాయానంతర విషరసాయనాలు, మురుగు ఇతర వ్యర్థాలు శుద్ధి చేయకుండా వదలటం వల్ల 80 శాతం సహజ జలవనరులు కలుషితమవుతున్నాయి.
తాగునీటి వనరులు కనుమరుగవటం, ఉన్న నీరు కలుషితం కావడం, లభ్యత తగ్గిపోవడం వంటివి రెండురకాల ఆరోగ్యసమస్యలకు కారణమవుతున్నాయి. డయేరియా వంటి వ్యాధులు కొన్ని తక్షణ ఆరోగ్యసమస్యలు కాగా మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులు, తద్వారా శాశ్వత ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. ఏపీలోని ఏలూరులో వచ్చిన
వింత వ్యాధి మరణాలు ఇటువంటివే!
వ్యవసాయపరమైన అవసరాల ప్రణాళికలు, ప్రాజెక్టుల వల్ల భారత్‌లో పెద్ద ఎత్తున రిజర్వాయర్లు ఏర్పడి కొంతమేర తాగునీటి సమస్యను తీరుస్తున్నాయి. గతంతో పోలిస్తే.. వికేంద్రీకృత రక్షిత మంచినీటి నుంచి కేంద్రీకృత రక్షిత నీటి వ్యవస్థలు బలపడ్డాయి. నగరాల్లో చాలా వరకు నిర్దిష్ట నీటి సరఫరా వ్యవస్థలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం కేంద్రీకృత తాగునీటి వ్యవస్థకు గట్టి తార్కాణంగా నిలిచే నమూనా!
ఒకప్పుడు పౌరులు తాగునీటి కోసం ప్రభుత్వాలపై ఇంతగా ఆధారపడే వారు కాదు. ఎవరికి వారు చేద బావులు, దిగుడు బావులు, వ్యవసాయ బావులు, చెరువులు, కుంటలు, కాలువలు, నదుల నుంచి తాగునీరు తెచ్చుకునేవారు. ఇప్పుడు సమీకృత రక్షిత నీటి సరఫరా వ్యవస్థలపైనో, ‘ఆర్వో వాటర్’ వంటి ప్రైవేటు సరఫరా వ్యవస్థలపైనో ఎక్కువగా ఆధారపడుతున్నారు. ‘మిషన్ భగీరథ’ వంటివి ఒక ఊళ్లో విఫలమైతే తక్షణ ప్రత్యామ్నాయాలు చాలా కష్టం.
అయితే వెంటనే మరమ్మత్తులు చేయాలి. లేదంటే గ్రామస్తులు ఊరిని వదిలేయాలి అన్నంత జటిలంగా పరిస్థితి ఉంటుంది. నీటి సంరక్షణ, నీటిని పొదుపు చేయడం, వాన నీటిని ఒడిసి పట్టడం వంటివి చాలా ముఖ్యం. ఇందుకు పౌర సమాజం సదా సంసిద్ధంగా ఉండాలి.
వరదలు – కరువులు
ప్రపంచ జీవరాశి మనుగడను అతలాకుతలం చేస్తున్న ప్రకృతి వైపరీత్యాలు వరదలు – కరువులు. ముఖ్యంగా గడచిన రెండు దశాబ్దాల్లో వీటి పీడ తీవ్రంగా ఉంది. 2001– 19 సంవత్సరాల మధ్య కాలంలో తలెత్తిన వైపరీత్యాల్లో 78 శాతం ఇవే అంటే తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. భూతాపోన్నతి కారణంగా వచ్చిన వాతావరణ మార్పుల ఫలితమే ఈ పరిణామాలు. ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ) వాతావరణ మార్పులపై ఏర్పరచిన అంతర్ ప్రభుత్వాల బృందం (ఐపీసీసీ) తాజా నివేదిక కూడా ఇదే చెబుతోంది.
ప్రపంచం మొత్తం అప్రమత్తం కావాల్సిన అత్యవసరాన్ని గుర్తించి ‘కోడ్‌రెడ్’తో మానవ సమాజాన్ని హెచ్చరించింది. ఇతర సముద్రాలకన్నా హిందూ మహాసముద్రం వేగంగా వేడెక్కుతోందని ఫలితంగా దక్షిణాసియా, అందులోనూ ముఖ్యంగా భారత్‌లో విపరీత వాతావరణ పరిస్థితులుంటాయని తెలిపింది. అందువల్ల ఏడాదిలో కరువు కాటకం అధికంగా ఉంటుంది. మరోపక్క తుపాన్లు, వర్ష ఉధృతి కూడా ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది.
అతివృష్టి – అనావృష్టి వల్ల వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం పడి దిగుబడి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇది స్థూలంగా ఆహారోత్పత్తి – సరఫరా – పంపిణీ వలయాన్ని దెబ్బ తీస్తుంది. భారత్ వంటి పాక్షిక ఉష్ణమండల (సెమీ ఆరిడ్) ప్రాంతంలో ఆహారోత్పత్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. 2035 నాటికి హిమాలయాల్లోని మంచు 75 శాతం కరిగిపోయే ప్రమాద సంకేతాలూ వెల్లడవుతున్నాయి.
ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇప్పటికే కరువు – వరదలు అన్ని ఖండాల్లోనూ వైపరీత్యాలుగా అపార ప్రాణ నష్టానికి, అపరిమిత ఆస్తి, వనరుల నష్టానికి కారణమవుతున్నాయి. దీర్ఘకాలం కరువుల వల్ల అడవులు తగులబడిపోయే ‘కార్చిచ్చు’ రగులుతోంది. అమెజాన్ వంటి సతతహరిత అరణ్యాలతోపాటు ఆస్ట్రేలియా, సైబీరియా వంటి ప్రాంతాల్లోనూ అడవులు తగులబడిపోయి ఆందోళన రేకెత్తించాయి. అతి వర్షాలు – అసాధారణ వరదలు ఇటీవలికాలంలో చైనా, జపాన్, ఇండోనేషియా, కొరియా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, అమెరికా తదితర దేశాల్లో మానవాళిని గడగడలాడించాయి.
చైనాలో వందేళ్ల చరిత్రలో లేని వరదలొస్తే.. జర్మనీలో ‘ ఈ తుపాను వరద తీవ్రతను వర్ణించడానికి నాకు జర్మనీ భాషలో మాటలు దొరకటంలేద’ని ఆ దేశాధినేత వ్యాఖ్యానించారు. విశ్వవ్యాప్తంగా వేలాదిమంది చనిపోతుంటే లక్షలాది మంది ఆస్తులు కోల్పోతున్నారు, నిర్వాసితులవుతున్నారు. ప్రపంచ సగం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమవుతోంది.
వరదలు – కరువుల వల్ల ప్రాణ – ఆస్తి కష్టాలు, నీటి ఎద్దడి, ఎడారీకరణ, వ్యవసాయం దెబ్బతిని ఆహార కొరత వంటి సమస్యలే అనుకుంటాం. కానీ తాగునీటి వనరులు కలుషితమవడం, నీటి నాణ్యత పడిపోవడం జీవ వైవిధ్యానికి తీరని విఘాతం కలగటం.. అలాగే మొత్తమ్మీద పుడమి జీవావరణ (ఎకలాజికల్)ఆరోగ్యమే దెబ్బతింటుంది.
అంతర్రాష్ట్ర జలవివాదాలు
మనది సమాఖ్య రాజ్యం (ఫెడరల్ నేషన్). బలమైన రాష్ట్రాలు, బలమైన కేంద్రం. సహకార స్ఫూర్తితోనే సామరస్య వాతావరణం మనగలుగుతుంది. దేశంలో ప్రధాన నదులన్నీ వివిధ రాష్ట్రాల మీదుగా సముద్రాలలోకి ప్రవహిస్తున్నాయి. నదీజలాల పంపకం, వినియోగం విషయంలో తరచు వివిధ రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తున్నాయి. అవి స్పర్థలకు కారణమై రాజకీయ వైషమ్యాలను, ప్రాంతీయ మనోభావాలను రెచ్చగొట్టి సామాజిక అశాంతికి కారణమవుతున్నాయి. కొన్నిసార్లు ప్రాంతీయ ప్రాధాన్యం జాతీయ ప్రయోజనాలకు భంగకరంగానూ మారుతోంది. దేశం మొత్తం సుమారు పాతిక నదీలోయ ప్రాంతాలు (రివర్ బేసిన్స్)గా విడిపడి ఉంది.
భారత రాజ్యాంగం ప్రకారం నీరు రాష్ట్రాల జాబితాలోని అంశం. నదుల నీటి నిలువ, నిర్వహణ, వినియోగం వంటి అంశాలకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరచవచ్చు. ప్రాజెక్టుల నిర్మాణం, నీటి నిలువ, వినియోగం విషయాల్లో ఎగువ, దిగువ రాష్ట్రాల మధ్యనే వివాదాలున్నాయి. అలా వివాదాలు తలెత్తినప్పుడు సామరస్య పూర్వక చర్చలు, ఒప్పందాల ద్వారా సమస్యను పరిష్కరించే అధికారం 262 అధికరణం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించింది.
నది బోర్డులు, ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయడం ద్వారా సయోధ్య కుదుర్చుకోవాలి. నదీ జలాల విషయంలో రాష్ట్రాల మధ్య వివాదాలు, స్పర్థలు దేశానికి స్వాతంత్య్ర లభించిన నాటినుంచీ ఉన్నాయి. రానురాను అవి మరింత తీవ్రం కావడం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో కొత్త సమస్యలు పుట్టుకురావడం, జటిలమవడం రివాజయింది.
పార్లమెంటులో అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం – 1956, నదీ బోర్డుల చట్టం – 1956ని తీసుకురావడం ద్వారా ఈ వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది.
ఈ క్రమంలోనే చట్టబద్ధ అధికారాలతో బోర్డులను, న్యాయాధికారులతో ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ తీర్పులను, వాటికి వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులు, అప్పీళ్లను దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు రాజ్యాంగ అధికరణాలు 131, 136 ద్వారా తనకు సంక్రమించిన అధికారాలతో సమీక్షిస్తూ జలవివాదాల పరిష్కారానికి కృషి చేస్తోంది. గోదావరి, కృష్ణా, నర్మద, రావి – బియాస్, కావేరీ వంశధార, మహాదాయి, మహానదులకు ఈ ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. కృష్ణానదికి రెండో ట్రిబ్యునల్‌ని కూడా ఏర్పాటు చేశారు.
కొన్నిసార్లు ఆయా ట్రిబ్యునళ్ల తీర్పులను సంబంధిత రాష్ట్రాలు అమలుపరచని సందర్భాలు కూడా తలెత్తుతున్నాయి. వివాదం జటిలమై సాధారణ ప్రజానీకం నిత్యావసరాలను ప్రభావితం చేసిన అత్యవసరాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అప్పటికప్పుడు ఉపశమన చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. భౌగోళికంగా నదీపరివాహకప్రాంత విస్తీర్ణం, నీటి లభ్యతను బట్టి ఆయా రాష్ట్రాల మధ్య వాటాల పంపిణీని నిర్ణయిస్తారు. ఇలా లభించే నికరజలాల వాటాకు తోడు మిగులు జలాల పైన కూడా దిగువ రాష్ట్రాలకు కొంతమేర హక్కులు కల్పిస్తారు.
వృథాగా సముద్రం పాలయ్యే మిగులు జలాలపై దిగువ రాష్ట్రాలకు పరిమితులతో కొన్ని ప్రత్యేక హక్కులుంటాయి. మన కృష్ణా నది పక్కన ఉన్న కావేరీ వంటి నదుల విషయంలో నీటి లభ్యత తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాల మధ్య వివాదాలు సహజం. కృష్ణా నది జలాల విషయంలో లోగడ వివాదం కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య (త్రైరాష్ట్ర) వివాదంగా మారింది.
ఆయారాష్ట్రాల్లో, కేంద్రంలో వేర్వేరు రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు సమస్య పరిష్కారం చాలా సున్నితాంశంగా పరిణమిస్తోంది. ఒకరి ప్రయోజనాలు ఇంకొకరి మనోభావాలతో ముడిపడి వివాదాలు ఉద్రిక్తతను రేపుతున్నాయి. దీనికి విరుగుడుగా స్వతంత్ర ప్రతిపత్తి – చట్టబద్ధమైన అధికారాలు కలిగిన నదీలోయ ప్రాధికార సంస్థ (రివర్ వ్యాలీ అథారిటీ)లను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది. రాష్ట్రాలు, ప్రాంతాలకు అతీతంగా వాతావరణ శాస్త్రీయ పరిణామాల ప్రాతిపదికన సదరు సంస్థలు నిర్ణయం తీసుకుంటాయి. నది పుట్టుక నుంచి సముద్రంలో కలిసేవరకు .. నీరు, ప్రాజెక్టుల నిర్వహణ వాటి పరిధిలోనే ఉంటుంది.
శుద్ధి చేస్తున్న మురుగు 28% మాత్రమే
మన దేశంలో జనావాల నుంచి వచ్చే మురుగు నీటిలో 28%ని మాత్రమే శుద్ధి చేసి బయటకు వదులుతున్నారు. మిగతా 72% మురుగు నీటిని శుద్ధి చేయకుండానే నదులు, కాలువలు, సరస్సుల్లో వదులుతున్నారు. నగరాలు వెలువరించే మురుగు నీటిలో 44%ను శుద్ధి చేయగలిగిన సామర్థ్యం కలిగిన ప్లాంట్లు మాత్రమే ఇప్పటికి ఏర్పాటయ్యాయి. ఈ ప్లాంట్లలో కూడా అన్నీ పనిచేయటం లేదు. 2014–15 నుంచి 2020–21 మధ్యకాలంలో మురుగు నీటి పరిమాణం 17% పెరిగింది.
కార్పొరేట్ లాబీయిస్టుల పుణ్యమా అని...
2050 నాటికి సగం ప్రపంచ జనాభా నగరాల్లోనే కేంద్రీకృతం అవుతుందని అంచనా! అదే జరిగితే తాగునీటి వనరులు, జల వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి ఖాయం. వాతావరణ మార్పుల వల్ల జటిలమవుతున్న నీటి ఎద్దడి దృష్ట్యా ప్రపంచ భాగస్వామ్య పక్షాలు (కాప్) పారిస్ పర్యావరణ సదస్సు నాటికే నీటి సంక్షోభాన్ని గుర్తించాయి. అన్ని దేశాలు, తాము ’జాతీయంగా కట్టుబడ్డ కృషి’ (ఎన్డీసి)లో నీటి వనరుల సంరక్షణ, విపత్తుల సమర్థ నిర్వహణ, సర్దుబాటు, దిద్దుబాటు వంటి నిర్దిష్ట కార్యాచరణకు పెద్ద పీట వేశాయి.
అయితే, వాటి తాజా పరిస్థితి తగురీతిన సమీక్షించాల్సిన ’కాప్–26’ (గ్లాస్గో ) సదస్సు, కార్పొరేట్ లాబీయిస్టుల పుణ్యమా అని దారి తప్పింది. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)లో 6వ దైన ‘నీరు–పారిశుద్ధ్యం’, దేశాల విధానాలు–అమల్లో తగినంత శ్రద్ధ, ప్రాధాన్యాలకు నోచుకోవడం లేదు. మన దేశంలోనూ... పర్యావరణానికి, ప్రకృతికి ప్రమాద కారణమయ్యే పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి తపన చెందుతాం తప్ప, ప్రత్యామ్నాయాల పైన దృష్టి పెట్టం.
చిన్న చెక్ డ్యాములు, చెరువులు–కుంటల సమర్థ నిర్వహణ, తేమను కాపాడటం, నీటి సంరక్షణ ద్వారా భూగర్భ జలమట్టాలు పెంచడం, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం వంటి చర్యల ద్వారా వాతావరణ మార్పును ఎదుర్కోవచ్చు. ప్రపంచ జనాభాలో 16 శాతంగా ఉన్న మనం జలవనరులు మాత్రం 4 శాతమే కలిగి ఉన్నాం! మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే.. గిస్తే, అది నీటి వల్లే అన్న నానుడి నిజమయ్యే ప్రమాద ఘంటికలే నిరతం వినిపిస్తున్నాయి.
అంతర్జాతీయ సమాజం, నాయకులు, ప్రభుత్వాలు, పరిశ్రమ–కార్పొరేట్స్, పౌర సమాజం, వ్యక్తులు పూనిక వహించి నీటిని కాపాడుకోవాలి. ప్రకృతిని పరిరక్షించుకోవాలి. ‘అందరి అవసరాలు తీర్చే శక్తి, సత్తా ప్రకృతికి ఉంది, ఏ కొందరి అత్యాశనో తీర్చలేదు తప్ప..!’ అన్న పూజ్య బాపూజీ మాటలే మనందరికీ దారీ దీపాలు. ‘నీవు అభిలషించే, ఆశించే మార్పు ఏదైనా, అది నీ నుంచే మొదలవ్వాలి’ అన్న ఆయన మాటలే, నీటి సంరక్షణలో మనందరికీ బాటలు కావాలి.
-దిలీప్ రెడ్డి .సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment