ఫొటోల్లో కనిపిస్తున్న భవంతిని చూడండి. ఇది పూర్తిగా మృణ్మయ భవనం. అంటే మట్టితో నిర్మించిన భవంతి. ఇదొక హోటల్. ఇది కర్ణాటక రాష్ట్రం చిక్‌మగళూరులో ఉంది. ఈ హోటల్ గదుల్లో ఏసీలు ఉండవు. ఇందులో ఇంకో విశేషమూ ఉంది. నిల్వచేసిన వాననీటినే అన్ని అవసరాలకూ ఉపయోగిస్తారు. చివరకు తాగడానికి కూడా ఆ నీరే
విద్యుత్తు అవసరాల కోసం ఇందులో పూర్తిగా సౌరవిద్యుత్తునే వినియోగిస్తారు. పర్యావరణానికి ఏమాత్రం చేటుచేయని రీతిలో అధునాతనంగా రూపొందించిన ఈ హోటల్ రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్ పద్ధతులను గరిష్ఠస్థాయిలో వినియోగించుకుంటోంది.
భారతదేశంలోని వాయుకాలుష్యంలో దాదాపు 30 శాతం భవన నిర్మాణాల కారణంగా సంభవిస్తున్నదే! నిర్మాణం కారణంగా కాలుష్యం వ్యాపించకుండా, పర్యావరణహితంగా ఉండేలా చిక్‌మగళూరులో ‘శూన్యత’ హోటల్ నిర్మాణం జరిగింది. ఈ హోటల్ ప్రాంగణం లోపలి నివాస గృహ సముదాయం కూడా పర్యావరణ అనుకూలమైనదే కావడం విశేషం.
ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్‌ను రెండేళ్ల కిందట కొద్దిపాటి సిమెంటు, కాంక్రీటుతో తయారుచేసిన ఇటుకలను ఉపయోగించి నిర్మించారు. విద్యుత్తు కోసం సౌరఫలకాలను అమర్చారు. నీటి సరఫరా కోసం వాననీటి సేకరణ వ్యవస్థను, ప్రాంగణాన్ని చల్లగా ఉంచేందుకు మట్టి సొరంగాలను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ హోటల్ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని చాలావరకు స్థానికంగానే సమకూర్చుకున్నారు. నిర్మాణ సమయంలో ఒక్క నీటిచుక్క కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదంతా లోకేశ్ గుంజుగ్నూర్ అనే యువ పర్యావరణ ప్రేమికుడికి వచ్చిన ఆలోచన! ఈ హోటల్ యజమాని ఆయనే! కొ
న్నేళ్ల కిందట లోకేశ్ తాను పుట్టిపెరిగిన చిక్‌మగళూరులో ఖాళీ భూమిని కొనుగోలు చేశారు. పట్టణం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుండటంతో అక్కడ ఒక రిసార్ట్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అదే ‘మడ్ హోటల్’గా దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది.
రిసార్ట్‌ను ప్రారంభించాలనుకున్నప్పుడు లోకేశ్ తన హోటల్ ప్రత్యేకంగా, పర్యావరణ అనుకూలంగా ఉండాలని భావించారు. నిర్మాణపరంగా కూడా పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలనే ఉపయోగించాలని అనుకున్నారు. భవిష్యత్తులో భవనాన్ని కూల్చేసినా, ఆ పదార్థాలు మళ్లీ భూమిలోనే కలిసిపోయేలా ఉండాలని భావించారు.
అమెరికాలోని మయామీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన లోకేశ్‌కు ఇంత పచ్చని ఆలోచన రావడమే గొప్ప! ఆ ఆలోచనే ‘శూన్యత మడ్‌హోటల్’గా రూపుదాల్చింది. ఈ హోటల్ నిర్మాణం కోసం లోకేశ్ మొదట బెంగళూరులోని ‘డిజైన్ కచేరీ’ అనే ఆర్కిటెక్చర్ సంస్థను, పుదుచ్చేరి దగ్గరి ప్రకృతి ఆశ్రమం ‘ఆరోవిల్’లో శిక్షణ పొందిన పునీత్ అనే యువ సివిల్ ఇంజినీరును సంప్రదించారు. వారి సహకారంతో లోకేశ్ తన కలల కట్టడాన్ని సాకారం చేసుకోగలిగారు.
హోటల్ నిర్మాణానికి రంగంలోకి దిగిన నిపుణుల బృందం మొదట ఇటుకల తయారీ ప్రారంభించింది. నేలను సమం చేయడానికి తొలగించిన మట్టితోనే ఇటుకలను తయారు చేశారు. చుట్టుపక్కల పదిహేను మైళ్ల వ్యాసార్ధంలోని ప్రదేశాల నుంచి మట్టిని సేకరించి నిర్మాణానికి ఉపయోగించడంతో రవాణా ఖర్చులు, కాలుష్యం చాలావరకు తగ్గాయి. స్థానికంగా లభించే సున్నపు రాయిని, ఐదు శాతం కంటే తక్కువ మోతాదులో సిమెంటును కలిపి ఇటుకలను తయారు చేసుకున్నారు. ఈ పనులన్నీ నిర్మాణ స్థలంలోనే జరిగాయి.
మిక్సింగ్ మెషిన్ నడిచేందుకు, ఇతర పరికరాలను నడిపేందుకు కావలసిన విద్యుత్తు కోసం అక్కడే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నారు. సూర్మరశ్మి పుష్కలంగా ఉండే వేసవిలో ఈ పనులు జరిగాయి. నిర్మాణం ఎత్తు లేపడానికి, ఎత్తుకు తగినట్లుగా దన్నుగా అమర్చే ఉక్కు సామగ్రిని నివారించడానికి నిర్మాణ బృందం లోడ్‌బేరింగ్ నిర్మాణ పద్ధతిని అనుసరించింది.
దీనివల్ల నిర్మాణం బరువు పైకప్పు నుంచి గోడలకు, పునాదులకు బదిలీ అవుతుంది. ఉక్కు ఉత్పాదన విస్తారంగా లేని కాలంలో పాత భవనాల నిర్మాణాల కోసం ఈ పద్ధతినే ఉపయోగించేవారు. ఇక సీలింగ్ కోసం కొబ్బరి చిప్పలు, పాట్ ఫిల్లర్లను ఎంచుకున్నారు. ఈ ఫిల్లర్లు పై అంతస్తుకు దృఢమైన ఫ్లోరింగ్‌గా పనిచేయడమే కాకుండా, గదులను కళాత్మకంగా, చల్లగా ఉంచుతాయి.
ఇది హోటల్ కావడం వల్ల ఇక్కడకు వచ్చే అతిథులకు అన్నివిధాలా అనుకూలంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమైన అంశం. వేసవిలో చిక్‌మగళూరు వాతావరణం వెచ్చగా ఉంటుంది. పరిసరాల్లో ఉష్ణోగ్రత 30 డిగ్రీల వరకు ఉంటుంది. కాబట్టి గదులను చల్లగా ఉంచడానికి ఎయిర్‌కండిషన్ బదులు సహజ శీతలీకరణ పద్ధతిని ఎంచుకున్నారు. ఈ విధానంలో భవనం కింద పది అడుగుల మేర పెద్ద పీవీసీ పైపును అమర్చారు.
ఇది బయటి గాలికి శీతలీకరణ పైపుగా పనిచేస్తుంది. పైపుగుండా గాలి వెళుతున్నప్పుడు చల్లబడుతుంది. తర్వాత వివిధ మార్గాల ద్వారా ప్రాంగణంలోని పదకొండు గదుల్లోకి ప్రసరిస్తుంది. గదుల లోపల కూడా అక్కడి వెచ్చని గాలిని బయటకు పంపేందుకు పైకప్పులకు చిమ్నీలు ఉంటాయి. ఈ వ్యవస్థ కారణంగా బయటి వాతావరణం ఎలా ఉన్నా, గదుల్లోని ఉష్ణోగ్రత 18–25 డిగ్రీల మధ్యనే ఉంటుంది.
ఇదిలా ఉంటే, మంచినీటి కోసం వాననీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా 50వేల లీటర్ల ట్యాంకును నిర్మించుకున్నారు. దీని నిర్మాణం పైభాగంలో కాకుండా, భూగర్భంలో చేపట్టారు. ఈ నీటిని శుద్ధి చేసి, హోటల్‌కు వచ్చే అతిథులకు తాగునీరుగాను, ఇతర అవసరాలకు ఉపయోగించుకునేందుకు సరఫరా చేస్తున్నారు. వంటా వార్పులకు కూడా ఇదే నీటిని ఉపయోగించుకుంటున్నారు. ఈ హోటల్లో ప్లాస్టిక్‌ను అసలు వాడరు. అతిథులకు స్టీల్ బాటిళ్లలోనే నీరు అందిస్తారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ విధానంలో నిర్మించిన ఈ హోటల్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.
∙రాచకొండ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment