మీ పిల్లల్ని కాపాడుకోండి!
వాయనం
ప్రపంచవ్యాప్తంగా టీనేజర్లలో పెరుగుతున్న ఆత్మహత్యల గురించి ఇటీవలే కొన్ని నమ్మలేని నిజాలు వెల్లడయ్యాయి. కోరుకున్నది దొరక్కపోవడం, అనుకున్నది జరగకపోవడంతో ఏర్పడిన నిరాశతో మగపిల్లలు ప్రాణాలు తీసుకుంటుంటే; ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితి.. ఆడపిల్లల్ని ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి. మరెలా? పిల్లలను కాపాడుకోవడం ఎలా? దీనికి ఒక్కటే పరిష్కారం... పిల్లల ప్రవర్తనను గమనించి, వారిలో ఆత్మహత్యకు సంబంధించిన సంకేతాలను పసిగట్టడం.
చలాకీగా ఉండే పిల్లలు డల్ అయిపోతున్నా...
వినయంగా ఉండేవారు, తల్లిదండ్రులని కూడా చూడకుండా తిరగబడుతున్నా... ప్రతిదానికీ అరుస్తున్నట్టు మాట్లాడుతున్నా...
కారణం లేకుండా ప్రతి చిన్నదానికీ కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నా...
ఏ పనీ సరిగ్గా చేయకపోతున్నా, కాస్త పని చెప్పినా విసుక్కుంటున్నా...
తిండి తినకుండా, నిద్రపోకుండా రెస్ట్‌లెస్‌గా ఉంటున్నా జాగ్రత్తపడాలి.
అలాగే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నా... రివర్స్‌లో అయినవాళ్లతో మరీ ఎక్కువ ఆప్యాయంగా ఉంటున్నా... ఒక్క క్షణం విడిచిపెట్టకుండా తిరుగుతున్నా... అది ప్రేమ అనుకుని మురిసిపోయి ఊరుకోవద్దు. అది... త్వరలో దూరమైపోతున్నాను కదా, అంతవరకూ తమవారి ప్రేమను తృప్తిగా అనుభవించాలి అన్న భావన కూడా కావచ్చు. లేదంటే మీతో తమ బాధను చెప్పుకోవాలని వెంట వెంట తిరుగుతూ, చెప్పలేకపోతుండవచ్చు.
చెడు అలవాట్లకు బానిసలవుతున్నా... తమకు తాము హాని చేసుకోవాలని చూస్తున్నా...
చావు గురించి తెలుసుకోవాలని చూస్తున్నా.. మరణం గురించి మాట్లాడుతున్నా... దాని గురించి కవితలు, కథనాల వంటివి రాసేందుకు ప్రయత్నిస్తున్నా... చావు గురించి జోకులేస్తున్నా ఇవన్నీ సంకేతాలే.
నాకేదైనా అయితే, నేను సడెన్‌గా కనిపించకుండా పోతే అని అడిగినా...
తమకెంతో ఇష్టమైన వాటిని పదే పదే చూసుకుంటున్నా... ఇష్టమైన వారిని ఊరకే తలచుకుంటున్నా ...
మీ పిల్లల మనసులో ఏదో తిరుగు తోందన్న మాట. దాన్ని గుర్తించాల్సి బాధ్యత మీదే. గుర్తించాక వారిని దగ్గరకు తీసుకుని కారణం అడగండి. గుచ్చి గుచ్చి ప్రశ్నించొద్దు. లాలించి అడగండి. వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినండి. నీ బాధ తీర్చడానికి నేనేం చేయగలను అని అడగండి. వాళ్లకోసం మీరు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలియజేయండి. మీరు ఉండగా తనకి చనిపోవాల్సిన అవసరం లేదు అనిపించేలా చేయండి. వాళ్లు మీ పిల్లలు... వాళ్లని మీరే కాపాడుకోవాలి మరి!