‘ఛలో’తో తెలుగు తెరకు పరిచయం అయిన రష్మిక విజయయాత్ర ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు కొనసాగుతూనే ఉంది. పుస్తకాలు ఎక్కువగా చదివే రష్మికకు ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి వెన్ బ్రీత్ బికమ్స్ ఏయిర్. 37 సంవత్సరాల వయసులోనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయిన అమెరికన్ న్యూరోసర్జన్ పాల్ కళానిధి ఆటోబయోగ్రఫీలాంటి పుస్తకం ఇది. ‘న్యూయార్క్ టైమ్స్ బెస్ట్‌సెల్లర్’ జాబితాలో నెంబర్‌వన్‌గా నిలిచి, ఎంతోమందికి ఉత్తేజాన్ని ఇచ్చిన ఈ పుస్తకం పరిచయం...
ఎప్పడూ చురుగ్గా, ఉల్లాసంగా ఉండే కుర్రాడికి తనకు క్యాన్సర్ అనే భరించలేని విషాదవార్త తెలిస్తే ఎలా ఉంటుంది? కాళ్ల కింది భూమి కదిలిపోతుంది. కళ్ల ముందు చీకటి కమ్ముకుంటుంది. అయితే తనకు క్యాన్సర్ ఉందని తెలియగానే పాల్ కళానిధి స్పందించిన తీరు వేరు. ఆయన తన మిత్రుడికి ఇలా మెయిల్ చేశాడు...‘గూడ్‌న్యూస్ ఏమిటంటే మహాకవులు కీట్స్, స్టీఫెన్ క్రేన్‌ల సాహిత్యాన్ని చదువుకోవడం. బ్యాడ్‌న్యూస్ ఏమిటంటే ఇంత వరకు ఒక్క అక్షరం కూడా నేను రాయకపోవడం’ కళానిధి వైద్యాన్ని ఎంతగా ప్రేమించాడో, సాహిత్యాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు. ‘పదిహేడేళ్ల వయసులో నువ్వు ఏమవుతావు? అని నన్ను ఎవరైనా అడిగి ఉంటే కచ్చితంగా రచయిత అనేవాడిని. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి సాహిత్యాన్ని మించిన సాధనం లేదు’ అనే కళానిధి యెల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు ముందు స్టాన్‌ఫోర్డ్‌లో సాహిత్యంలో రెండు బీఏలు చేశాడు. కేంబ్రిడ్జిలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫి చేశాడు.
ఈ విషాదవార్త తెలియగానే కుటుంబసభ్యులు, స్నేహితులతో అతని జోక్స్ ఆగిపోలేదు. ప్రకృతిని ఆరాధించడం ఆగిపోలేదు. ఫుట్‌బాల్ ఆడడం ఆగిపోలేదు. అన్నిటికి మించి బతుకును ప్రేమించడం ఆగిపోలేదు. చావుకు, బతుకు మధ్య ఉన్న స్వల్పకాలాన్ని ఈ పుస్తకం రాయడానికి ఉపయోగించాడు. అలా అని ఇది జ్ఞాపకాల సమహారం మాత్రమే అనుకోనక్కర్లేదు. ‘జీవితాన్ని కొత్తగా ఎలా చూడాలి?’ అనేది ఎవరికి వారు దిశానిర్దేశం చేసుకునేలా ఉంటుంది. బరువు తగ్గుతూ పోవడం, జ్వరం, చెమటలు పట్టడం, వెన్నునొప్పి, దగ్గు...ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకం రాయడం ఆషామాషీ విషయం కాదు. పుస్తక రచన పట్ల తన ఇష్టం ఆ కష్టాన్ని తగ్గించింది. తనలో నూతనోత్సాహం. మరోశక్తి....పాప. ‘నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కొన్నిరోజులకు పాప పుట్టింది. ఆ పాప హావభావాలు, నవ్వులు నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. డైనమిజం అనేది పాప రూపంలో మా ఇంట్లోకి వచ్చింది’ అంటాడు కళానిధి.
స్ట్రిక్ట్ మదర్, మెడిసిన్‌తో లవ్ అండ్ హేట్ రిలేషన్‌షిప్, కుందేలు, తాబేలు పరుగుపందెం నుంచి ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? దేవుడిపై తన నమ్మకం, సెటన్: హిజ్ సైకోథెరపీ అండ్ క్యూర్ బై ది అన్‌ఫార్చునెట్... పుస్తకం తనపై కలిగించిన ప్రభావం, చావుకు మానసికంగా సంసిద్ధం కావడం, ‘నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోవాలి’ అని భార్యను ప్రిపేర్ చేయడం, తన ట్రీట్‌మెంట్ కోసం డాక్టర్ ఎమ్మా హెవార్డ్‌ను ఎంచుకోవడానికి కారణం, చికిత్స సత్ఫలితాన్ని ఇస్తున్న పరిస్థితుల్లో మళ్లీ జీవితంపై కొత్త ఆశ, కొద్దికాలానికి ఆ ఆశ కొడిగట్టడం, మళ్లీ ధైర్యంతో పైకిలేవడం...ఇలా ఎన్నో విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం ఎంత పాప్‌లర్ అయిందంటే ఎంతోమంది డాక్టర్లు కళానిధికి ఫోన్ చేసి ‘డిప్రెషన్‌తో మా దగ్గరకి వచ్చే వాళ్లకు మందులేమీ ఇవ్వడం లేదు. మీ పుస్తకం చేతిలో పెడుతున్నాం. అంతే... వాళ్లలో ఎంత మార్పు వచ్చిందో చెప్పలేం’ అనేవాళ్లు.అన్నీ ఉన్నా ఏమీ లేదు అనుకువాళ్లు, చిన్న చిన్న విషయాలకే కుంగుబాటలో ప్రయాణించే వాళ్లు తప్పకుండా చదవాల్సిన పుస్తకం.
Comments
Please login to add a commentAdd a comment