రావణ్ ఎల్లా (రావణ్ జలపాతం)
శ్రీలంకలో హిందూమహాసముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉంది ఈ జలపాతం. దట్టమైన అడవుల మధ్యలో ప్రవహించిన నీటిపాయలు వంద అడుగుల కిందనున్న భూభాగం మీదకు అలవోకగా జారిపడుతూ ఉంటుంది. శ్రీలంక పర్యాటక ప్రాధాన్యం గల దేశం కావడంతో ప్రతి ప్రకృతి సౌందర్యాన్ని పర్యాటకులకు అనువుగా మలుచుకుంటుంది. పర్యాటకులు జలపాతాన్ని వీక్షించడానికి, జలపాతం బ్యాక్‌డ్రాప్‌లో ఫొటో తీసుకోవడానికి వీలుగా వాటర్‌ఫాల్స్ దగ్గర చక్కటి ప్లాట్‌పామ్ ఉంది.
రావణుడి గుహలు
రావణ్ జలపాతం... ఎల్లా అనే చిన్న పట్టణానికి దగ్గరగా, ఎల్లా రైల్వేస్టేషన్‌కి ఆరు కిలోమీటర్ల దూరాన ఉంది. దాంతో ఈ జలపాతానికి రావణ్ ఎల్లా అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఈ జలపాతం వెనుకవైపు గుహలున్నాయి. రావణాసురుడు... సీతాదేవిని అపహరించిన తర్వాత కొంతకాలం ఈ గుహల్లో దాచి ఉంచాడని, అందుకే ఈ గుహలకు రావణుడి గుహలనే పేరు వచ్చిందని చెబుతారు. సముద్రమట్టానికి నాలుగున్నర వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహల్లోకి వెళ్లడానికి వెడల్పాటి మెట్లు, మెట్ల మధ్యలో రెయిలింగ్ వంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ గుహలకు ఏడు కిలోమీటర్ల దూరాన బందరవేలా గుహలున్నాయి. పాతిక వేల ఏళ్ల కిందట ఆ గుహల్లో మనుషులు జీవించినట్లు ఆధారాలు దొరికాయి. ట్రెకింగ్ ఆసక్తి ఉన్న వాళ్లు ఈ ప్రదేశాల కోసం రెండు రోజులు ఉండేటట్లు టూర్ ప్లాన్ వేసుకోవాలి.
జ్ఞాపికలే పెద్ద వ్యాపారం
శ్రీలంకలో ప్రతి టూరిస్ట్ పాయింట్ దగ్గర సావనీర్ షాప్‌లుంటాయి. చిన్నదో పెద్దదో కనీసం ఒక్క స్టాల్ అయినా ఉంటుంది. డిజైనర్ దుస్తుల నుంచి శ్రీలంక గుర్తుగా తెచ్చుకోవడానికి జ్ఞాపికలు కూడా ఉంటాయి. పర్యాటకులు తమ టూర్ గుర్తుగా దాచుకోవడానికి, అలాగే స్నేహితులు, బంధువుల కోసం కూడా సావనీర్‌లను ఎక్కువగా కొంటారు. ప్రైస్ ట్యాగ్ చూడగానే భయం వేస్తుంది. కానీ శ్రీలంక రూపాయలను మన రూపాయల్లోకి మార్చుకున్నప్పుడు ధరలు మరీ ప్రియం అనిపించవు. మరో సౌకర్యం ఏమిటంటే షాపుల్లో మన కరెన్సీ కూడా తీసుకుంటారు. దుస్తుల విషయానికి వస్తే... ఫ్లోర్ లెంగ్త్ ఫ్రాక్‌ల వంటి మోడరన్ దుస్తులు బాగుంటాయి. కానీ కొలతలు భారతీయులకు అమరవు. పాశ్చాత్యుల పొడవుకు తగినట్లుంటాయి. శ్రీలంక వాసులు కూడా పొడవుగా, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వారికీ చక్కగా అమరుతాయి. ఇక మనం అక్కడ కొనుక్కోగలిగిన దుస్తులు చీరలు, శాలువాలు, పిల్లలకు టీ షర్ట్‌లే. ఉన్ని శాలువాలు మంచి నేత పనితనంతో అందంగా ఉంటాయి. ఏనుగు బొమ్మలు ముద్రించిన టీ షర్ట్‌లుంటాయి.
మక్కబుట్టకు ఉప్పుకారం
చిరుతిండ్లు అమ్మే వాళ్లయితే మన ముఖాలు చూసి భారతీయులను గుర్తు పట్టేస్తారు. పాశ్చాత్యులు ఇష్టపడే రుచులు, భారతీయుల ఇష్టాలను గ్రహించి వ్యాపారం చేస్తారు. మనం మొక్క జొన్న కండెకు ఉప్పు, కారం పట్టించి తింటామని వాళ్లకు తెలుసు. మనల్ని చూడగానే ‘ఇండియన్స్’ అంటూ మసాలా రాయమంటారా అని అడుగుతారు. తమిళులు– సింహళీయులకు మధ్య పోరు గురించి తెలిసిన వారిగా మనకు కొంత జంకు, భారతీయులను స్వాగతిస్తారో లేదోననే భయం ఉంటుంది. కానీ, శ్రీలంక వాళ్లు భారతీయులను ఆత్మీయంగా చూస్తారు.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment