సూర్యవంశానికి చెందిన ఋతధ్వజుడు విదిశా మహారాజు. ఆయన కొడుకు రుక్మాంగదుడు. ఋతధ్వజుడి తదనంతరం రుక్మాంగదుడు రాజ్యభారాన్ని చేపట్టాడు. రుక్మాంగదుడి భార్య సంధ్యావళి. విష్ణుభక్తుడైన రుక్మాంగదుడికి సంధ్యావళి అన్ని విధాలా అనుకూలమైన భార్య. వారికి కొడుకు పుట్టాడు. అతడికి ధర్మాంగదుడు అని నామకరణం చేసి, అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. విష్ణుభక్తి తత్పరులైన తల్లిదండ్రుల పెంపకంలో ధర్మాంగదుడు కూడా బాల్యం నుంచి విష్ణుభక్తుడయ్యాడు.
విష్ణుభక్తులలో అగ్రగణ్యుడైన అంబరీషుని ద్వాదశీ నియమం మాదిరిగానే, రుక్మాంగదుడికి ఏకాదశి నియమం ఉండేది. దశమి, ద్వాదశి తిథులలో ఏకభుక్తం పాటిస్తూ, ఏకాదశి తిథినాడు ఉపవాసం చేసేవాడు. తాను మాత్రమే కాకుండా, తన రాజ్యంలోని ప్రజలందరూ ఈ వ్రత నియమాన్ని పాటించాలని చాటింపు వేయించాడు. రాజభక్తులైన ప్రజలు తు.చ. తప్పకుండా ఏకాదశి వ్రత నియమాన్ని నియమం తప్పకుండా పాటించేవారు. రుక్మాంగదుడి పాలనలోని ప్రజలందరూ ఏకాదశీ వ్రత పరాయణులు కావడంతో వారందరూ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్లసాగారు.
రుక్మాంగదుడి విదిశా రాజ్యంలో యమదూతలకు అడుగుపెట్టే అవకాశం లేకుండాపోయింది. యముడికి పనిలేకుండా పోయింది. ఈ పరిస్థితికి యముడు కలత చెందాడు. వెంటనే బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు. ‘కమలసంభవా! విదిశారాజ్యంలో నాకు పనిలేకుండా పోయింది. ఆ రాజ్యంలో నేను శిక్షించదగిన వారెవరూ లేరు. ఎలాగైనా, వారి ఏకాదశీ వ్రతానికి భంగం కలిగించు’ అని కోరాడు.యముడి ద్వారా రుక్మాంగదుడి వ్రతదీక్షను, అతడి ప్రజల భక్తితత్పరతలను తెలుసుకున్న బ్రహ్మదేవుడు వారి వ్రతదీక్షను పరీక్షించదలచాడు. అప్పటికప్పుడే తన సంకల్పంతో మోహిని అనే అప్సరసను సృష్టించాడు.
‘మోహినీ! నువ్వు భూలోకానికి వెళ్లు. అక్కడ రుక్మాంగదుడి ఏకాదశి వ్రతానికి భంగం కలిగించు’ అని ఆదేశించాడు.బ్రహ్మదేవుడి ఆదేశం మేరకు మోహిని భూలోకానికి చేరుకుంది.విదిశా రాజధాని వెలుపల అరణ్యప్రాంతంలో ఉన్న శివాలయంలో కూర్చుని, వీణ వాయించసాగింది.అదే సమయానికి రుక్మాంగదుడు మృగయా వినోదం కోసం అరణ్యానికి వచ్చాడు.కీకారణ్యంలో సంచరిస్తూ, ఎన్నో క్రూరమృగాలను వేటాడాడు. వేట ముగించుకుని, రాజధాని వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. కొంత దూరం వచ్చాక, శ్రావ్యమైన వీణానాదం వినిపించింది. అరణ్యంలో వీణానాదం ఎక్కడిదని రుక్మాంగదుడు ఆశ్చర్యపోయాడు. వీణానాదం వస్తున్న దిశగా ముందుకు సాగుతూ, శివాలయం వద్దకు వెళ్లాడు.
ఆలయంలోకి అడుగు పెడుతూనే, ఆలయ మండపంలో వీణ వాయిస్తూ ఉన్న ముగ్ధమోహన సుందరాంగి మోహిని కనిపించింది. ఆమె రూపలావణ్యాలను చూడగానే రుక్మాంగదుడు మోహపరవశుడయ్యాడు.‘సుందరాంగీ! నిన్ను చూడగానే వలచాను. నీకు సమ్మతమైతే క్షత్రియోచితంగా గాంధర్వ వివాహం చేసుకుంటాను’ అన్నాడు.‘రాజా! అనుదిన సుఖభోగాలను అందించగలవంటే, నేను నీకు భార్యను కాగలను’ అందామె.ఆమెను ఆ ఆలయంలోనే గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుని, ఆమెను వెంటపెట్టుకుని రాజధానికి చేరుకున్నాడు రుక్మాంగదుడు.కొన్నాళ్లకు యథావిధిగా ఏకాదశి వచ్చింది. రుక్మాంగదుడు నియమానుసారం దశమినాడు ఏకభుక్తుడై, ఏకాదశి రోజున ఉపవాసం ప్రారంభించాడు.
‘నన్ను అనుదినం సుఖభోగాలలో ముంచెత్తుతానని చెప్పి, ఉపవాసాలు, వ్రతాలు అంటూ నన్ను ఉపేక్షించడం తగునా? ఉపవాసం చాలించి, నాతో విహరించు, పద’ అంది మోహిని. ‘సూర్యుడు పడమరన ఉదయించినా, మేరు మంధర పర్వతాలు భూమిలోకి కుంగిపోయినా, అగ్నిహోత్రం చల్లబడిపోయినా నా వ్రత నియమాన్ని మాత్రం నేను తప్పను’ అని బదులిచ్చాడు రుక్మాంగదుడు.
అతడి సమాధానానికి ఆగ్రహించిన మోహిని, అతడిని నానా దుర్భాషలాడింది. ‘ఏకాదశి వ్రత నియమాన్ని విడిచిపెట్టడం తప్ప నీకు ఇష్టమయినది ఇంకేం చేయమన్నా చేస్తాను, చెప్పు’ అనునయంగా అన్నాడు రుక్మాంగదుడు.
‘అలాగైతే, నీ కొడుకు తల నరికి ఇవ్వు’ అందామె.రుక్మాంగదుడి కొడుకు ధర్మాంగదుడు ఆ మాట విన్నాడు. తన తండ్రి వ్రతనియమానికి భంగం కలగకుండా ఉండటమే ముఖ్యమని తలచాడు. వెంటనే ఖడ్గం తీసుకుని, మోహిని ఎదుట నిలిచి, తన కంఠాన్ని తానే నరికేసుకున్నాడు.ఇది చూసి మోహిని భయభ్రాంతురాలైంది.బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమయ్యారు.‘రుక్మాంగదా! నీ వ్రతనియమం సాటిలేనిది. ఇహపరాలలో అనంత సౌఖ్యాలను అనుభవించు. ఇప్పుడే నీ కొడుకును బతికిస్తున్నాం’ అని పలికి, ధర్మాంగదుడిని బతికించి, అంతర్ధానమయ్యారు. మోహిని సత్యలోకానికి వెళ్లిపోయింది.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment