ఇలాంటి వ్యాపారమా అన్నారు? ఇప్పుడూ అదే..! | Safeena Husain Founder And CEO Educate Girls | Sakshi
Sakshi News home page

ఇలాంటి వ్యాపారమా అన్నారు? ఇప్పుడూ అదే కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది

Published Thu, Nov 30 2023 11:14 AM | Last Updated on Sat, Dec 2 2023 7:52 AM

Safeena Husain Founder And CEO Educate Girls - Sakshi

ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కొన్ని విషయాల్లో బిడియం, సిగ్గుతో వెనకబడే  ఉన్నారు స్త్రీలు. ముఖ్యంగా పీరియడ్స్, లోదుస్తుల గురించి మాట్లాడాలంటే భయం. ఎవరిదైనా బ్రా, పెట్టీకోట్‌లు కొద్దిగా బయటకు కనిపిస్తుంటే... చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇలా మాట్లాడ్డానికి ఇబ్బంది పడే అంశాన్నే కెరీర్‌గా ఎంచుకుంది రిచాకర్‌. అమ్మాయిల నుంచి మహిళలు ధరించే ‘బ్రా’ల బ్రాండ్‌ను ఎంతో ధైర్యంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎటువంటి బిడియం లేకుండా తీసుకొచ్చిన ఈ బ్రాండ్‌ నేడు కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది.

జంషెడ్‌పూర్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది రిచాకర్‌. తండ్రి టాటా స్టీల్‌ కంపెనీ ఉద్యోగి కాగా తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి విభిన్నంగా ఆలోచించే మనస్తత్వం రిచాది. డిగ్రీ అయ్యాక ఐటీ కంపెనీలో కొన్నేళ్లపాటు ఉద్యోగం చేసింది. శాప్‌ రిటైల్‌ కన్సల్టింగ్, స్పెన్సర్స్‌లో ఉద్యోగం చేశాక... సొంతంగా వ్యాపారం చేయాలన్న కోరికతో నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా చేసింది.

ఒకపక్క ఉద్యోగానుభవం, మరోపక్క మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ద్వారా నేర్చుకున్న  జ్ఞానంతో సొంతంగా వ్యాపారం పెట్టడానికి పూనుకుంది. ఇందుకోసం మహిళల లోదుస్తుల వ్యాపారం ఎంచుకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ‘‘సమాజంలో లోదుస్తుల గురించి మాట్లాడాలంటే భయడతారు. ఈ వ్యాపారం అవసరమా? వద్దు’’ అని నిరుత్సాహపరిచారు. తల్లిదండ్రులు అలా చెప్పినప్పటికీ రిచా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన వ్యాపారం ప్రారంభ పనుల్లో మునిగిపోయింది.

రేడియంట్‌ మి
మహిళలు ధరించే బ్రాలను సొంతంగా డిజైన్‌ చేసి, తయారు చేసి, విక్రయించడంపై దృష్టిపెట్టింది. కొన్నిరోజులకి తన పనిమీద నమ్మకం ఏర్పడడంతో 2011లో ‘జివామే’ పేరుతో బ్రా బ్రాండ్‌ను ఏర్పాటు చేసింది. జివామే అంటే హిబ్రూలో ‘రేడియంట్‌ మి’ అని అర్థం. కాలేజీ అమ్మాయిల నుంచి పిల్ల తల్లుల వరకు అందరూ సౌకర్యంగా ధరించే బ్రాలను విక్రయించడం మొదలు పెట్టింది. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుండడంతో ఐదువేల డిజైన్లు, యాభై బ్రాండ్లు వంద రకాల సైజుల్లో లోదుస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ స్టోర్‌ల ద్వారా అందిస్తోంది జివామే. 

డైరెక్టర్‌గా...
కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోన్న సమయంలో కొన్ని కారణాలతో 2017 సీఈవో పదవి నుంచి తప్పుకుని, డైరెక్టర్‌గా కొనసాగుతోంది రిచా కర్‌. ప్రస్తుతం రిచా నెట్‌ వర్త్‌ దాదాపు 750 కోట్లు ఉండొచ్చని అంచనా. మంచి లాభాల్లో దూసుకుపోతోన్న జివామే బ్రాండ్‌ను 2020 లో రిలయన్స్‌ రిటైల్‌ కొనుగోలు చేసింది. తన కలను నిజం చేసుకున్న 43 ఏళ్ల రిచా కర్‌ ప్రస్తుతం తన భర్త కేదార్‌ గవాన్‌తో కలిసి  అమెరికాలో నివాసముంటోంది. 

‘‘ ఒక స్త్రీ మనసును మరో స్త్రీ మాత్రమే అర్థం చేసుకుంటుంది. అందుకే మూసపద్ధతులను దాటుకుని మహిళలు సౌకర్యంగా ధరించే లో దుస్తుల బ్రాండ్‌ను తీసుకొచ్చాను. జివామేను మార్కెట్లోకి తేవడానికి, దానికి బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకు రావడానికి చాలా సవాళ్లను, ఒత్తిళ్లనూ ఎదుర్కోవలసి వచ్చింది. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోబట్టే ఇవాళ ఈ స్థాయికి రాగలిగాను. ఇంట్లో... సమాజంలో మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. అయినా మన మీద మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడు అమ్మాయిలు దేనిలో తక్కువ కాదు. మనసులో ఏదైనా నిర్ణయించుకుంటే అది కచ్చితంగా సాధించ గలుగుతారు’’ అని చెబుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది  రిచాకర్‌.

కోట్ల టర్నోవర్‌తో..
లోదుస్తులు ధరించిన మహిళలు సౌకర్యంగా... కాన్ఫిడెంట్‌గా ఉండడమే లక్ష్యంగా లోదుస్తులను అందుబాటులో ఉంచుతుండడంతో జివామే బ్రాండ్‌ మార్కెట్లోకి వచ్చిన ఏడాదిలోనే పెట్టుబడిదార్లను ఆకర్షించింది. దీంతో 2012లో మూడు మిలియన్ల డాలర్లు, మరుసటి ఏడాది ఇది రెట్టింపు అయ్యింది. 2015 నాటికి నలభై మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి. దీంతో కంపెనీ ఆరువందల కోట్లపైకి ఎగబాగి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

(చదవండి: చీకటిమయంగా ఉన్న కూతురి జీవితాన్ని 'ప్రేరణ ' ఇచ్చే శక్తిగా మార్చిన ఓ తల్లి కథ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement