
72 ఏళ్ల శక్తి కపూర్ తన ఫిట్‌నెస్ రహాస్యాన్ని ఇటీవల తెలియచేశాడు. రోజుకు 35 వేల అడుగులు నడవడం తన ఆరోగ్య రహస్యం అన్నాడు. నడక వల్ల ఉపయోగాలు అందరికీ తెలిసినా.. 70 ఏళ్ల తర్వాత కూడా నడక మంచిదేనని వైద్యులు అంటున్నారు. రోజూ 7 వేలతో మొదలుపెట్టి కనీసం 10 వేల వరకూ నడిస్తే మంచిది అంటున్నారు. నడవని వారు గుండెకు చేటు తెచ్చుకుంటారని హెచ్చరిస్తున్నారు. మీరెంత నడుస్తున్నారు?
వందలాది సినిమాల్లో నటించిన శక్తి కపూర్ 72 ఏళ్ల వయసులో కూడా చలాకీగా, ఫిట్‌గా ఉంటారు. ఇటీవల ఒక టీవీ షోలో మీ ఫిట్‌నెస్ రహస్యం ఏమిటని అడిగితే ‘రోజూ కనీసం 35000 అడుగులు నడవడమే‘ అని చెప్పాడు. మధ్యలో కొన్ని రోజులు మానేశాను... తిరిగి మొదలుపెట్టాను అని చెప్పాడు. నటన అంటే రకరకాల పాత్రలు చేయాలి. పరిగెత్తడం, డాన్స్.. ఇలాంటివి ఉంటాయి. అవన్నీ చేయాలంటే ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. చాలామంది రకరకాల వ్యాయామం చేస్తారు. అయితే శక్తికపూర్ నడకే తన ఫిట్‌నెస్‌కు కారణం అని తెలియచేశాడు.
నడక మంచిది
ఈ విషయం గురించి ఢిల్లీలోని సికె బిర్లా హాస్పిటల్‌కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ నరేంద్ర సింఘ్‌లా ఏమన్నారంటే ‘రోజుకు 35 వేల అడుగులు నడవడం ఎవరికైనా మంచిది... ముఖ్యంగా వయసు మళ్లిన వారి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇన్ని అడుగులు నడవడం వల్ల 2000 నుంచి 2500 కేలరీలు బర్న్ అవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. కాళ్ల కండరాలు బలపడతాయి.
క్రమం తప్పకుండా నడవడం వల్ల పెద్ద వయసు వారిలో రక్తప్రసరణ క్రమబద్దీకరణ జరిగి బ్లడ్‌ప్రెషర్ తగ్గుతుంది. దానివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా నడక బరువును అదుపు చేస్తుంది. వయసు మళ్లాక బరువు పెరిగితే స్థూలకాయం వల్ల వచ్చే సమస్యలు తోడవుతాయి. వాటిని నివారించాలన్నా బరువు పెరగకుండా చూసుకోవాలన్నా వయసు పెరిగే కొద్దీ నడకను పెంచాలి’ అన్నారాయన.
మానసిక ఆరోగ్యానికి...
ఎక్కువ అడుగులు నడవడం వల్ల మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు అంటున్నారు. నడక మెదడుకు స్పష్టతనిచ్చి ఎంచుకున్న పనిపై ఏకాగ్రతను కలిగిస్తుందని వారు అంటున్నారు. అయితే 70 ఏళ్లు దాటాక 35 వేల అడుగుల నడక చాలామందికి సాధ్యం కాకపోవచ్చు.
ముందు నుంచి అలవాటు లేకపోతే. కాని 7000 అడుగుల నుంచి శక్తి, ఓపికను బట్టి 10 వేల అడుగుల వరకూ నడవాలని వారు అంటున్నారు. నడకకు అనువైన షూస్, పోష్చర్, తగినంత నీరు తాగి బయలుదేరడం... ఈ జాగ్రత్తలతో క్రమం తప్పకుండా నడిస్తే ఆరోగ్యం ఓ భాగ్యంలా తోడు ఉంటుందని అంటున్నారు వారు. నడవడమే బాకీ.
Comments
Please login to add a commentAdd a comment