పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ‘మాకు చేసుకోవాలనిపించినప్పుడు’ అంటారు పిల్లలు. ‘మేము చేయాలనుకున్నప్పుడు’ అంటారు తల్లిదండ్రులు. ‘మేము కన్న మా పిల్లల భవిష్యత్తు మాకు తెలియదా’ అని ప్రశ్నిస్తారు కూడా. అలాగే పిల్లల నిర్ణయం ప్రకారమే అనుకుంటే అది పదిహేనేళ్లు కావచ్చు, పాతికేళ్లు కావచ్చు.
అందుకే ప్రభుత్వం వివాహానికి ఒక వయసును నిర్ధారించింది. అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21ని వివాహ వయసుగా నిర్ధారిస్తూ అంతకంటే ముందు పెళ్లి జరిగితే ఆ పెళ్లిని బాల్య వివాహంగా పరిగణించాలని కూడా చెప్పింది. అలా వచ్చిన చట్టమే ‘ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్– 2006’, అంటే బాల్య వివాహ నిషేధ చట్టం అన్నమాట.
అమ్మాయి అక్షరాలు దిద్దుతోంది కానీ...
చట్టాలు పని చేస్తూనే ఉన్నాయి. సమాజం చైతన్యవంతం అవుతూనే ఉంది. అమ్మాయిల అక్షరాస్యత శాతం పెరుగుతోంది. అయినా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అక్షరాస్యత శాతం పెరుగుతోంది కానీ పాఠశాల విద్య దాటి కాలేజ్ బాట పట్టే సంఖ్య తక్కువగానే ఉంది. ఆ చదువు కూడా ఇప్పటికీ ఇంటర్ దాటడం లేదు.
మనం చెప్పుకుంటున్న కేస్‌స్టడీలు గ్రామాలు, అల్పాదాయ వర్గానికి చెందినవి కావడం గమనార్హం. బాల్య వివాహాలకు ‘తల్లిదండ్రులకు చదువు లేకపోవడంతో΄ాటు సమాజంలో ఆడపిల్లకు భద్రత కరువవడం’ కూడా కారణమేనంటారు కైలాశ్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ అనుబంధ విభాగం ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’ తెలంగాణ రాష్ట్ర సమన్వయ కర్త చందన.
బాల్యాన్ని హరించడమే!
‘‘బాల్య వివాహం కూడా మానవ హక్కుల ఉల్లంఘనే. వివాహం, పని, ఒత్తిడితో కూడిన చదువు... ఇవన్నీ పిల్లల బాల్యాన్ని హరించేవే. పిల్లల బాల్యాన్ని హరించే హక్కు కన్నవాళ్లకు కూడా ఉండదు. బాల్యవివాహాల నియంత్రణ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో అతి పెద్ద విఘాతం కరోనా రూపంలో వచ్చి పడింది.
మునుపు 35గా ఉన్న బాల్య వివాహాల శాతం కరోనా కారణంగా 2020లో 62 శాతానికి పెరిగిపోయింది. ఆ తర్వాత ఏడాది కొంత తగ్గి 57 శాతం దగ్గర ఆగింది. ప్రభుత్వ పథకాలు కొంత వరకు బాల్య వివాహాలను తగ్గించగలుగుతున్నాయి. కానీ రావలసినంత మార్పు రాలేదనే చెప్పాలి. దేశంలో ఉత్తరాది రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నామని సంతోషం పడడమే ఇప్పటికి మనం సాధించింది’’ అన్నారు చందన.
2025 నాటికి స్త్రీ–పురుష సమానత్వంతో పాటు మహిళలు, బాలికల సాధికారత సాధించాలని ఐక్యరాజ్యసమితి ఒక లక్ష్యంగా నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే బాలికల విద్య మీదనే దృష్టి పెట్టాలి. అల్పాదాయ వర్గాల వాళ్లు కూడా అమ్మాయి పెళ్లికి లక్షలు ఖర్చు చేస్తున్నారు.
చదివించడం లేదెందుకంటే ‘మా దగ్గర డబ్బులెక్కడున్నాయ్’ అంటారు. అలాంటి వాళ్లందరికీ నేను చెప్పేదొక్కటే... ‘పెళ్లికి చేసే ఖర్చుని అమ్మాయి చదువుకి ఉపయోగించండి. మీ అమ్మాయి జీవనస్థాయి మారుతుంది.
– చందన, కో ఆర్డినేటర్, బచ్‌పన్ బచావో ఆందోళన్, తెలంగాణ
ఐదు వేల బాల్య వివాహాలను నివారించాం
మనదేశంలో ప్రతి ముగ్గురు ఆడపిల్లల్లో ఒకరు బాల్య వివాహం చట్రంలో నలిగిపోతున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాసాధికారత కోసం నిర్వహించిన ‘సబల’ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం. అధికారులు ఐదు వేల బాల్య వివాహాలను నివారించగలిగారు. బాల్య వివాహ వ్యవస్థ తరతరాలుగా వస్తున్న దురాచారం.
దీన్ని రూపుమాపడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, పూర్తిగా నివారించడానికి ఇంకా కొన్నేళ్లు పడుతుంది. దీనికి మూలకారణం ఆర్థిక స్థితిగతులు, చదువు. ఆడపిల్లలను చదివించడం మీద దృష్టి పెట్టిన కుటుంబం బాల్య వివాహానికి దూరంగా ఉన్నట్లే.
మహిళ సాధికారత సాధిస్తే తన కూతురిని ఈ చట్రంలో ఇరుక్కోకుండా రక్షించుకోగలుగుతుంది. అందుకే బాలికల విద్య, మహిళల ఆర్థికస్వయం సమృద్ధి పూర్తి స్థాయిలో సాధించగలిగిన రోజు బాల్య వివాహాలు వాటంతటవే నిర్మూలన అవుతాయి.
– వాసిరెడ్డి పద్మ, చైర్‌పర్సన్, మహిళా కమిషన్, ఆంధ్రప్రదేశ్
– వాకా మంజులారెడ్డి
చదవండి: Meenakshi Gadge: ఇది మీనాక్షి ఊరు.. సినిమాల్లోనే ఇలాంటి పల్లె ఉంటుందా? అదేం కాదు..
Comments
Please login to add a commentAdd a comment