ఫుటేజ్‌ను తీయించే వరకు విశ్రమించను | Sona M Abraham Fighting To Remove Her Leaked Scenes | Sakshi
Sakshi News home page

ఫుటేజ్‌ను తీయించే వరకు విశ్రమించను

Published Tue, Oct 27 2020 12:08 AM | Last Updated on Tue, Oct 27 2020 4:10 AM

Sona M Abraham Fighting To Remove Her Leaked Scenes - Sakshi

బేబీగా ఎవరికి కనిపిస్తాం? అమ్మానాన్నకే కదా! చిన్నప్పుడే కాదు, ఇప్పుడూ. ఆ ఫొటోలు బైట పెడతామా? గర్ల్స్‌ మీకే..! ‘ఒక స్మైల్‌ రా కన్నా..’ అనగానే.. స్టిల్‌ ఇచ్చేయకండి. వీడియోలోకి వెళ్లిపోకండి. బాయ్‌ఫ్రెండ్‌ మంచివాడే. అమ్మానాన్న అయితే కాడు. అనుమానిస్తే ఏం పోయింది? నమ్మితేనే కదా ఏదైనా! ఇంటర్నెట్‌ను.. మీ.. బేబీ అల్బమ్‌ కానివ్వకండి. అమ్మానాన్న జాగ్రత్త.

ఐదేళ్ల ‘లా’ కోర్సు నాలుగో సంవత్సరంలో ఉన్న సోనా అబ్రహాం ఆరేళ్లుగా ఇంటర్నెట్‌ నుంచి తన వీడియో క్లిప్పులను తీయించడం కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. 2013లో పద్నాలుగేళ్ల వయసులో ఆమె నటించిన ‘ఫర్‌ సేల్‌’ అనే మలయాళీ చిత్రంలోని రేప్‌ సీన్‌ వీడియో క్లిప్పులు అవి! ఒక మైనరు బాలికపై కొందరు అత్యాచారం చేస్తారు. దానిని వీడియోలో చిత్రీకరించి ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంటారు. అది చూసి ఆ బాలిక అక్క ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదీ ఆ సినిమా కథ. మైనరు బాలిక పాత్రను సోనా వేసింది. ఆ సీన్‌ని హ్యాండ్‌ కెమెరాతో ప్రైవేట్‌గా షూట్‌ చేశారు. సినిమాలో పది సెకన్లు ఉంటుంది. ‘‘అవసరం అయినంత వరకే వాడుకుని మిగతా ఫుటేజ్‌ని డిలీట్‌ చేస్తాం’’ అని డైరెక్టరు, నిర్మాత చెప్పారు. సోనా నమ్మింది. సోనా తల్లిదండ్రులూ నమ్మారు.

ఏడాది తర్వాత ఆ ఫుటేజ్‌ (సినిమాలో వాడగా మిగిలిన భాగాలు) యూట్యూబ్‌లో ప్రత్యక్షం అయింది! అంటే వాళ్లు డిలీట్‌ చేయలేదు. పైగా లీక్‌ చేశారు. యూట్యూబ్‌ నుంచి పోర్న్‌ సైట్‌కు కూడా ఫుటేజ్‌ చేరిపోయింది! సోనా వణికిపోయింది. తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు తల్లడిల్లిపోయారు. కూతుర్ని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. దురదృష్టం.. ఇప్పటికీ ఆ క్లిప్పులు నెట్‌లో ఎక్కడో ఒక చోట పైకి లేస్తూనే ఉన్నాయి. సోనాకు ఒకటి అర్థం అయింది. మహిళలపై జరుగుతున్న సైబర్‌ నేరాలను పోలీసు వ్యవస్థ కూడా ఆపలేకపోతోందని. అయినా నిస్పృహ చెందలేదు. ‘‘ఆనవాళ్లు కూడా లేకుండా క్లిప్పును తీయించేవరకు నేను విశ్రమించను’’ అని అంటున్నారు. అమ్మానాన్న ఆవేదన తీర్చడం ముఖ్యం అనుకుంది.  
∙∙ 
‘ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌’ సంస్థ చేపట్టిన ‘రెఫ్యూజ్‌ ది అబ్యూజ్‌’ అనే ప్రచారోద్యమం కోసం.. టీనేజ్‌లో తనకు జరిగిన ఆ నమ్మకద్రోహం గురించి సోనా బహిర్గతం చేసినప్పుడు గానీ ఈ విషయం బయటికి రాలేదు. ఇంతకాలం సోనా ఒంటరిగానే పోరాడుతూ వస్తున్నారు. పోలీసులు కూడా చేసిందేమీ లేదు. వీడియో క్లిప్పులు లీక్‌ అయ్యేలా అలక్ష్యాన్ని ప్రదర్శించిన ఆ నిర్మాత, దర్శకుడు తేలిగ్గానే తప్పించుకున్నారు. సోనా తల్లిదండ్రులు 2014లో ఎర్నాకుళం సిటీ పోలీస్‌ కమిషనర్‌ను కలిసి కూతురి షూటింగ్‌ ఫుటేజ్‌ యూట్యూబ్‌లో రాకుండా చేయమని వేడుకున్నారు. యూట్యూబ్‌కి కమిషనర్‌ లెటర్‌ పెట్టినట్లున్నారు. తాత్కాలికంగా అయితే డిలీట్‌ అయింది. ఆ వెంటనే పోర్న్‌ సైట్‌లలోకి, సోషల్‌ మీడియాలోకి వ్యాపించింది! సోనాకు డైరెక్టర్‌ రేప్‌ సీన్‌ను వివరిస్తున్న ఆడియో కూడా ఆ వీడియోకు జత అయి ఉంది. దాంతో అది మామూలు సినిమాకు కాకుండా.. పోర్న్‌ కోసం చేసిన షూటింగ్‌లా ఉంది.

టెన్త్‌ నుండి ఇంటర్‌కు ఆమెతో పాటు ఆ క్లిప్పులు కూడా వచ్చి జాయిన్‌ అయ్యాయి! ‘తనే ఆ వీడియోలో ఉంది’ అనే గుసగుస క్లాస్‌ రూమ్‌లో, కాలేజ్‌లో ఏదో ఒక మూల నుంచి వినిపించేది. గట్టి అమ్మాయి కాబట్టి తట్టుకుని నిలబడింది. ‘‘నమ్మకద్రోహం చేసిన వాళ్లది నేరం అవుతుంది తప్ప, నమ్మి మోసపోయిన వాళ్లది కాదు’’ అని అమ్మానాన్న సోనాను ఊరడిస్తూనే ఉన్నారు. వాళ్లిచ్చిన మానసిక స్థైర్యంతో చదువు మీద దృష్టి పెట్టింది. ‘లా’ చదువుతూనే నటిగా, మోడల్‌గా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్‌గా గుర్తింపు సంపాదించింది. ఆ గుర్తింపు ఆమె ‘గతానికి’ భవిష్యత్తు లేకుండా చేసింది. క్లిప్పుల గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు.

అయితే తను మాత్రం సైబర్‌ నేర ప్రపంచాన్ని ఊరికే వదిలిపెట్టదలచుకోలేదు. అమాయకులైన ఎందరో అమ్మాయిలను వలలో పడకుండా చేయడానికి, పడితే బయటికి రప్పించడానికి న్యాయశాస్త్రాన్ని ఒక పదునైన ఆయుధంగా మలచుకోబోతున్నారు. ఆమె కేసు ఇప్పుడు హైకోర్టులో ఉంది. కేరళ ఉమన్‌ కమిషన్‌ ఆమెకు అండగా ఉంది. కేరళ పోలీస్‌ హై టెక్‌ సెల్‌ ఇంటర్నెట్‌ నుంచి సోనా క్లిప్పులను సమూలంగా నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె ఇప్పుడు న్యాయ విద్యార్థిని మాత్రమే. బాలికలు, మహిళలకు సైబర్‌ అకృత్యాల నుంచి గట్టి రక్షణ కంచెను నిర్మించబోతున్న భవిష్యత్‌ న్యాయవాది. తన తల్లిదండ్రుల్లా ఇంకొకరు మానసిక క్షోభ పడకూడదని తీర్మానించుకున్న అమ్మాయి. 

పోరాటం ఆపను
మొదట నా వీడియోలు నెట్‌లో కనిపించినప్పుడు నా జీవితం ముగిసినట్లే అనిపించింది. అందరూ నన్నే చూస్తూ, నా గురించే మాట్లాడుకుంటున్నారన్న భావన! ‘నాకిలా కావలసిందే’ అనుకున్నాను. నన్ను దోషిగా భావించుకున్నాను. తర్వాత ఆలోచిస్తే, ఇందులో నేను చేసిన తప్పేముంది అనిపించింది. ‘తల వంచుకోవలసింది, అవమాన పడవలసిందీ నేను కాదు’ అనుకున్నాను. న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాను. నా కోసమే కాదు, నాలా మోసపోతున్న అమ్మాయిల కోసం కూడా.
– సోనా అబ్రహాం

అభినందనలు సోనా
సోనా.. జీవితం నరకప్రాయం అవడం అంటే ఏమిటో నేను ఊహించగలను. అమ్మాయిల్ని నిరంతరం ఇలాంటి నరకాలు వెంటాడుతూనే ఉంటాయి.. మన ప్రమేయం ఏమీ లేనివి, నమ్మి మోసపోయినందుకు అనుభవించేవీ! మన ధైర్యమే మన పోరాట శక్తి. నువ్వు ఒక్కరివి, ఒంటరివి కాదు. నీ వైపు నేనున్నాను. నువ్వు చూపుతున్న మనోబలానికి సాటి మహిళగా అభినందనలు, ధన్యవాదాలు.  – నటి పార్వతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement