మనసు పెడితే, కష్టపడితే ‘కచ్చితంగా నిజం అవుతాయి’ అని చెప్పడానికి బలమైన ఉదాహరణ కాజల్, హితేంద్రసింగ్. ‘స్పాన్ట్రిక్(SpanTrik)’ స్టార్టప్‌తో తమ కలను నిజం చేసుకున్నారు... రాకెట్‌ను ప్రయోగించే ప్రక్రియలో కాలంతో పాటు ఎంతో పురోగతిని చూస్తున్నాం. దీనికి సరికొత్త చేర్పు...స్పాన్ట్రిక్. రీయూజబుల్ రాకెట్ లాంచ్ వెహికిల్స్ కోసం కాజల్ రాజ్జర్, హితేంద్రసింగ్ ‘స్పాన్ట్రిక్’ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు.
పునర్వినియోగ రాకెట్(Reusable rockets) లాంచ్ వెహికిల్స్‌ను స్పాన్ట్రిక్ అభివృద్ధి చేస్తుంది. అంతరిక్ష పరిశోధనలను అందరికీ మరింత అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మేము దీన్ని ఫెడెక్స్ టు స్పేస్ అని పిలవడానికి ఇష్టపడతాం’ అంటున్నారు కాజల్, హితేంద్రసింగ్. ఢిల్లీ(Delhi) కేంద్రంగా మొదలైన ‘స్పాన్ట్రిక్’ ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రభుత్వ గ్రాంట్లను పొందింది. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్‌ల దృష్టిని ఆకర్షించింది. మోస్ట్ ప్రామిసింగ్ స్టార్టప్ ‘టెక్ 30’ జాబితాలో చోటు సాధించింది.
చిన్నప్పుడు పిల్లలు ఏవో కలలు కంటారు. అయితే ఆ కలలు అన్నీ నిజం కాకపోవచ్చు. చిన్న వయసులోనే ‘నేను పెద్దయ్యాక స్పేస్(space) కంపెనీ నడపాలనుకుంటున్నాను’ అని తండ్రితో చెప్పింది కాజల్. అంతేకాదు ‘సొంతంగా రాకెట్లు, ఉపగ్రహాలు తయారు చేస్తాను’ అని తన డైరీలో కూడా రాసుకుంది. తన లక్ష్యసాధనలో భాగంగా చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎంలో చేరింది. అక్కడ ఫిజిక్స్ చదువుకున్న కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీని నడిపేది. కొత్త శాస్త్రీయ ఆవిష్కరణల గురించి అందులో రాసేది. ఈ క్రమంలో కాజల్‌కు అహ్మదాబాద్‌లో చదువుకుంటున్న హితేంద్ర సింగ్‌తో పరిచయం అయింది. కాజల్‌లాగే సింగ్ కూడా చిన్నప్పుడు ఎన్నో కలలు కనేవాడు.
సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన కాజల్, హితేంద్రసింగ్‌లు సైన్స్‌కు సంబంధించి బోలెడు విషయాలు మాట్లాడుకునేవారు. అలా ‘స్పాన్ట్రిక్’ కోసం స్కెచ్ వేశారు. ఆస్ట్రోఫిజిక్స్, కాస్మోలజీలో మాస్టర్స్ చేయడానికి గుజరాత్‌లోని ‘చరోతార్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ చేరారు. తమ భవిష్యత్ లక్ష్యమైన ‘స్పాన్ట్రిక్’ కోసం కాలేజీ వదిలి పెట్టారు.
కంపెనీ స్థాపించడానికి ముందు మానవ రహిత వైమానిక వాహనాలను (ఏరియల్ వెహికిల్స్) అభివృద్ధి చేయడం నుంచి యువిసి రోవర్ తయారీ వరకు ఎంతో అనుభవ జ్ఞానాన్ని సంపాదించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం ‘స్పాన్ట్రిక్’ వడివడిగా అడుగులు వేయడానికి ఉపయోగపడింది. రీసైకిల్ చేయదగిన రాకెట్‌ల డిమాండ్‌ను అర్థం చేసుకోవడానికి ప్రైవేట్ సంస్థలు, ఇస్రో సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు.
నిజానికి పునర్వినియోగ రాకెట్ కాన్సెప్ట్ కొత్త కాదు. రష్యా, అమెరికా, జర్మనీలాంటి దేశాలు దశాబ్దాలుగా ఈ కాన్సెప్ట్‌పై పనిచేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో ఖర్చు హద్దులు దాటేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా ఖర్చు కాని, ఎక్కువ సార్లు ఉపయోగించే రాకెట్‌లపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం కాజల్–సింగ్ బృందం వర్టికల్ టేకాఫ్ వర్టికల్ ల్యాండింగ్(విటివిఎల్)ను నిర్మిస్తోంది. వ్యవస్థల పునర్వినియోగాన్ని అర్థం చేసుకోవడానికి ఇది వారికి సహాయపడుతుంది.
అయినా సరే...
చాలామంది స్పేస్ స్టార్టప్ వ్యవస్థాపకులు ఇస్రోలో పనిచేశారు. లేదా ఏదో ఒక హోదాతో సంస్థతో టచ్‌లో ఉన్నారు. మేము ‘ఇస్రో’లో పనిచేయలేదు. ‘ఇస్రో’లో పనిచేయని ఫౌండర్‌లకు సంబంధించిన స్టార్టప్ మాది. కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడంపై దృష్టి పెట్టాం. ప్రసిద్ధ సంస్థలకు చెందని వ్యక్తులు కూడా సాంకేతిక స్టార్టప్‌లకు సంబంధించి ముందుకు వెళ్లగలరని నిరూపించాలనుకుంటున్నాం. ఇది ఎంతో మంది ఔత్సాహికులకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెబుతోంది కాజల్.
(చదవండి: నాడు టెక్కీ ఇవాళ లెహంగాల వ్యాపారవేత్త.. ఏడాదికి రూ. 5 కోట్లు..)
Comments
Please login to add a commentAdd a comment