న్యూఢిల్లీ: అధికశాతం కొవ్వును ఆహార రూపంలో తీసుకుంటున్న దేశంలోని ఏడు మెట్రోనగరాల్లో ఢిల్లీ, అహ్మదాబాద్‌లు టాప్‌లో నిలిచాయి. హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడు నగరాల్లో అధిక కొవ్వు లభించే దాల్ ఫ్రై, స్టఫ్డ్ పరోటా, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చుడువా, బిసి బిళే బాత్, చింతపండు పులిహోర అధికంగా తిం టున్నట్లు ఈ సర్వే నిర్వహించిన భారత మెడికల్ పరిశోధనా మండలి (ఐసీఎమ్‌ఆర్) తెలిపింది. అధికంగా వేయించిన ఆహారం ద్వారా ఎక్కువ కొవ్వు ఒంట్లో చేరినట్లు గుర్తించారు. నగరాల్లో దొరికే అన్ని మాంసాహారాల్లోనూ అధిక కొవ్వు ఉన్నట్లు పరిశోధనలో తేలిందన్నారు.
ఢిల్లీ, అహ్మదాబాద్‌లోని ప్రజలు దేశంలోని అందరికంటే అధికంగా రోజుకు 44.4, 43.9 గ్రాముల చొప్పున కొవ్వును తీసుకుంటున్నట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ సేథ్ తెలిపారు. 36–59 వయసు ఉన్నవారు 36.1%, 18–35 వయసువారు 34.8% కొవ్వు తీసుకుంటున్నట్లు వెల్లడైంది. మెట్రో నగరాల్లో అత్యంత తక్కువగా హైదరాబాద్‌లో ఒక్కో వ్యక్తి రోజుకు 25.1 గ్రాముల కొవ్వును తీసుకుంటున్నారు. మెట్రోల మొత్తం మీద సగటున ఒక్కో వ్యక్తి తీసుకుంటున్న కొవ్వు రోజుకు 32.6 గ్రాములుగా ఉంది. ఇది ఐసీఎమ్‌ఆర్ సూచించిన 20 గ్రాముల (రోజుకు) కంటే ఎక్కువ. సాధారణంగా మనిషికి రోజుకు 20 గ్రాములు చాలు. మాంసాహారుల కంటే శాకాహారులు పప్పు ధాన్యాల ద్వారా తీసుకుంటున్న కొవ్వుశాతం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఇంట్లో చేసే ఆహారం, ప్యాక్ చేసిన ఆహారం, స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు వంటి వాటి నుంచి ఈ కొవ్వు ఒంట్లో చేరుతున్నట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment