C U Soon Movie Review, in Telugu | ‘సీ యూ సూన్‌’ మూవీ రివ్యూ - Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ స్త్రీల వీడియో మెసేజ్‌

Published Mon, Sep 7 2020 4:34 AM | Last Updated on Mon, Sep 7 2020 11:12 AM

Special Story About C U Soon Movie - Sakshi

నెలకు నలభై వేలు వస్తాయని చెబుతారు. గల్ఫ్‌కు తీసుకువెళతారు. ముందు పాస్‌పోర్ట్‌ లాగేసుకుంటారు. తర్వాత ఏం పని చేయాలో చెబుతారు. అది చట్టబద్ధమైన పని అయితే సరే. లేకుంటే? అక్కడి నుంచి తమ వాళ్లకు వీడియో కాల్స్, వీడియో మెసేజెస్‌ మొదలవుతాయి. సహాయం కోసం అర్థింపులు, ఆక్రందనలు. గల్ఫ్‌కు వెళ్లిన భారతీయ స్త్రీల బాధను చూపిన సినిమా ఇది. లాక్‌డౌన్‌ కాలంలో తీసి ఓటిటి ద్వారా విడుదల చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం వార్తల్లో ఉన్న విశేషం సీయూ సూన్‌.

గల్ఫ్‌ దేశాలకు వెళ్లి తమ జీవితాన్ని బాగు పరుచుకున్నవారు చాలామంది ఉన్నారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జీవితాలు నష్టపోయిన వారు అంతకు తక్కువగా లేరు. మగవారి కష్టాలు అక్కడ శారీరక, మానసిక పరమైనవి. స్త్రీలవి అయితే కనుక శారీరక, మానసిక, లైంగిక పరమైనవి కూడా. ఇక్కడ జరుగుబాటు లేక జానా బెత్తెడు జీతంతో విసిగిపోయి మన సభ్యులు ఎవరైనా గల్ఫ్‌కి వెళితే కుటుంబం అంతా బాగుపడుతుందని భావించేవారు నేటికీ ఉన్నారు. రేపటికీ ఉంటారు. కాని ఆ వెళ్లిన కుటుంబ సభ్యులు స్త్రీలైతే ఏమవుతుందో... ఒక్కోసారి ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో చెప్పిన సినిమా ‘సీ యూ సూన్‌’.

తాజా మలయాళ సినిమా
‘సీ యూ సూన్‌’ అనేది తాజా మలయాళ సినిమా. అమేజాన్‌ ప్రైమ్‌లో సెప్టెంబర్‌ 1న విడుదలైంది. ఈ కథ సంగతి చర్చించే ముందు దీని నిర్మాణమే విశేషం అని తెలుసుకోవాలి. ఇది లాక్‌డౌన్‌లో అంటే ఈ సంవత్సరం జూన్‌లో రెండు వారాల కాలంలో ‘కొచ్చిన్‌’లో తీశారు. మలయాళ చిత్రసీమ అంతా షూటింగ్‌లు మానేసి ఉంటే ఈ సినిమా 40 మందికి పని కల్పిస్తూ కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌ చేసింది. ప్రసిద్ధ మలయాళ హీరో ఫహద్‌ ఫాజిల్‌ నటించడమే కాక నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇంకో ఇద్దరు ముఖ్యపాత్రలు పోషించారు. మనం చూసే సినిమాలలో నటులు కెమెరాకు నటిస్తారు. కాని ఈ సినిమాలో వాళ్లు కెమెరాకు నటించినా మనకు కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద, ఫోన్‌ స్క్రీన్‌ మీద ఎక్కువగా కనిపిస్తారు. సరిగా చెప్పాలంటే మనం మన మిత్రులతో చాటింగ్‌ చేస్తూ, వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో నటీనటులు ప్రేక్షకులతో అలా చేస్తున్న భావన కలుగుతుంది. ఇది వినూత్న ప్రయత్నం. అందుకే షూటింగ్‌కి రెండు వారాలే పట్టినా ఎడిటింగ్‌కి రెండు నెలలు తీసుకుంది.

ఒక అమ్మాయి– అబ్బాయి కథ
దుబాయ్‌లో బ్యాంక్‌ ఉద్యోగిగా పని చేస్తున్న ఒక మలయాళ కుర్రాడు డేటింగ్‌ యాప్‌ ద్వారా దుబాయ్‌లోనే ఉంటున్న ఒక మలయాళ అమ్మాయిని ఆన్‌లైన్‌లో కలుసుకుంటాడు. ఆ అమ్మాయి దగ్గర ‘సిమ్‌’ ఉండదు కాని గూగుల్‌ ద్వారా వీడియో కాల్స్‌ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఉద్యోగం కోసం ఇండియా వచ్చానని, ఇంకా పని దొరకలేదని చెబుతుంది. తన చిన్నప్పటి ఫోటోలు, కుటుంబం ఫోటోలు అన్నీ షేర్‌ చేస్తుంటుంది. ఇతను ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అమెరికాలో ఉంటున్న తల్లికి వీడియో కాల్‌ ద్వారా పరిచయం చేస్తాడు. పెళ్లి చేసుకుందామనుకుంటున్నానని చెబుతాడు. ఈ లోపల ఆ అమ్మాయి తాను ఉన్నచోట ఇబ్బంది పడుతున్నానని, తీసుకెళ్లమని చెబుతుంది. ఆమెను అతడు తన ఫ్లాట్‌కు తెచ్చుకుంటాడు. వారం తర్వాత ఆ అమ్మాయి అదృశ్యం అవుతుంది. ఇంతకూ ఆ అమ్మాయి ఏమైంది? అనేది కథ.

సమాచారం సర్వవ్యాప్తం
మనం అనుకుంటాం మన మెయిల్స్, ఫేస్‌బుక్‌ చాట్స్, వాట్సప్‌ చాట్స్‌ మన కంప్యూటర్‌లో మనం దాచుకున్న ఫైల్స్‌ అన్నీ సేఫ్‌ అని. కాని ఇవాళ్టి సాంకేతిక పరిజ్ఞానంతో వాటన్నింటిని క్షణాల్లో ఛేదించి మన గుట్టుమట్లు తెలుసుకోవచ్చని కూడా ఈ సినిమా చెబుతుంది. అమ్మాయి అదృశ్యమయ్యాక ఆ కుర్రాణ్ణి పోలీసులు చుట్టుముడతారు. నిందితుడివి నువ్వే అంటారు. ఆ కుర్రాడు హతాశుడయ్యి కొచ్చిన్‌లో ఉంటున్న తన కజిన్‌ని సహాయం కోసం సంప్రదిస్తాడు. ఆ కజిన్‌ హ్యాకర్‌. అతడే ఆ అమ్మాయి ఏమైందో కేవలం కొచ్చిన్‌లో తన గదిలో కూచుని కనుగొంటాడు. ఇదంతా ఇంటర్నెట్‌ ద్వారా సోషల్‌ మీడియా మీడియమ్స్‌ ద్వారా జరుగుతుంది. నటులు మాట్లాడేది, కనిపించేది తక్కువ. ఎక్కువగా స్క్రీన్‌ల మీద నడిచే చాటింగులే కథను చెబుతాయి.

పాస్‌పోర్ట్‌ ఎక్కడ?
మన దేశంలో మనం ఎన్ని కష్టాలు పడినా కుదరకపోతే పారిపోయి ఇల్లు చేరతాం. కాని పరాయి దేశంలో పారిపోయి రావాలంటే పాస్‌పోర్ట్‌ ఉండాలి. ఇక్కడి నుంచి వెళ్లినవారి పాస్‌పోర్ట్‌లు ఒక్కసారి ఎవరైనా తమ హ్యాండోవర్‌లో పెట్టుకున్నాక వారి చేతిలో కీలుబొమ్మలుగా మారక తప్పదు. తమను తీసుకెళుతున్నవారు ఎవరో, వారు ఎంత సరైన వారో, వారు గతంలో తీసుకెళ్లినవారు ఎలా ఉన్నారో చెక్‌ చేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్లడం ముఖ్యంగా స్త్రీలు వెళ్లడం ఏమాత్రం క్షేమకరం కాదని ఈ సినిమా చెబుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రమాదం ఉందనే శంక ఉన్నా నిస్సహాయతతో అందులోకి తోసే పేదమనుషుల స్వభావాన్ని కూడా ఇది చూపుతుంది. ఈ సినిమాలోని యువతి తాను ప్రమాదంలో ఉందా తమ చుట్టూ ఉన్నవారిని ప్రమాదంలోకి నెట్టిందా... ఇది చాలా ఇంటెరెస్టింగ్‌గా ఉంటుంది.

మెచ్చుకోళ్లు
సీ యూ సూన్‌ స్ట్రీమ్‌ అవడం మొదలెట్టినప్పటి నుంచి మెచ్చుకోళ్లు నెట్‌లో ఎక్కువగా ఉన్నాయి. దీని ముఖ్య నటులు ఫహద్‌ ఫాజిల్, రోషన్‌ మాథ్యూ, దర్శనా రాజేంద్రన్‌లను దీని దర్శకుడు మహేశ్‌ నారాయణ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కోట్లు ఖర్చు, పదుల సంఖ్యలో తారాగణం లేకుండా సందర్భానికి తగినట్టుగా కూడా సినిమా తీయొచ్చని వీరు నిరూపించారని అంటున్నారు. గత నాలుగైదేళ్లుగా మలయాళ రంగం కొత్త కొత్త కథలతో. నటులతో ప్రతిభ చాటుతోంది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో దేశంలో చాలామంది మలయాళ సినిమాలు చూస్తున్నారు. తెలుగువారు కూడా. తెలుగులో ఈ స్థాయి స్ఫూర్తి అంతగా కనపడటం లేదని చెప్పాలి. అది పూర్తిగా తన మూస బంధనాలను తెచ్చుకోలేదు. సీ యూ సూన్‌లాంటి కత్తెరలు వాటిని తెగ్గోస్తాయని ఆశిద్దాం. 
– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement