
ఈ ప్రపంచంలో దాచలేనిది ఏదైనా ఉంది అంటే అది రహస్యమే. కాని మనిషి తన రహస్యాన్ని బంధించగలనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికైనా రహస్యమనేది బహిర్గతమవ్వాలసిందే. కాకపోతే ఆ రహస్యాన్ని మన ఊహకు కూడా అందని వాళ్ళు బయటపెట్టితేనే పెద్ద విడ్డూరం. మన రహస్యాన్ని మన ఇరుగుపొరుగు వారు బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే సూక్ష్మదర్శిని. ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. సూక్ష్మదర్శిని ఓ మళయాళ సినిమా. హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికొస్తే ఇది ఓ కాలనీకి సంబంధించినది.
ప్రియ తన భర్త ఆంటోని, కూతరు కాణితో అదే కాలనీలో నివసిస్తుంటుంది. ప్రియ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రియకి అదే కాలనీలో ఉంటున్న స్టెఫీ, అస్మా మంచి స్నేహితులు. ఓ రోజు ఆ కాలనీలోని ఇంట్లోకి మాన్యుల్ తన తల్లితో కొత్తగా వస్తాడు. మాన్యుల్ ప్రవర్తన ప్రియకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. మాన్యుల్ తన తల్లికి అల్జీమర్స్ వ్యాధి ఉందని చెప్పి కొంత వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఈ విషయంపై ప్రియ ఫోకస్ చేసి స్టెఫీ, అస్మాతో కలిసి అసలు నిజం బయటపెడుతుంది. మాన్యుల్ ప్రవర్తించిన తీరు ఏంటి, ప్రియ వాళ్లు ఇన్వెస్టిగేషన్ చేసి బయట పెట్టిన సంగతేంటి అన్న విషయాలను మాత్రం సూక్ష్మదర్శినిలో చూస్తే తెలిసిపోతుంది.
సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు యం.సి.జతిన్. ప్రముఖ మళయాళ నటులు నజరియా, బసిల్ జోసెఫ్ వంటి వారు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలలో నటించడం ప్రత్యేక ఆకర్షణ. ఆఖరుగా ఒక్కమాట ఇరుగు పొరుగు వారు మనతో కలిసి ఉంటే మంచిదే, అలాగే వాళ్లు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని ఏ సూక్ష్మదర్శిని ఏమీ చేయదు. వర్త్ ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్.
- ఇంటూరు హరికృష్ణ.