ఈ భూగోళం మీద ప్రస్తుతం రెండో ‘రిచెస్ట్’.. జెఫ్ బెజోస్. అమెజాన్ సీఈవో. త్వరలో ఆ పోస్ట్‌లోంచి తప్పుకుంటున్నారు. అమెజాన్ ఆయనదే. ఆమెజాన్‌లోని సీఈవో పోస్టూ ఆయనదే. ఇక తప్పుకోవడం ఏంటి! ఆలసిపోయారు. ఆవలింతలు వస్తున్నాయి. అయితే ఆ అలసట, ఆవలింతలు రెండూ బెజోస్‌వి కావు. కంపెనీ కస్టమర్‌లవి. అలాగని తాము ఆవలిస్తున్నట్లు కస్టమర్‌లు బెజోస్‌కు ఏమీ ఈ మెయిల్స్ పంపలేదు. బెజోసే అలా అనుకుని తన స్థానంలోకి ఇంకొకర్ని నెట్టి, తను ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉంటున్నట్లు సిబ్బందికి ఫిబ్రవరి 2న ఒక లేఖ రాశారు. కీలక బాధ్యతల నుంచి తను తప్పుకోడానికి ఆయన చెప్పిన కారణం కూడా.. ఆవలింతలే. అవునా?!
ఫైన్! అమెజాన్ నుంచి ఏ ప్రాడక్ట్ బయటికి వచ్చినా, అమెజాన్ కొత్తగా ఏం చేసినా అది వినూత్నంగా, ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. తనకు తనే పోటీ అనుకుంటుంది కనుక అంత ఇన్నోవేటింగ్‌గా ఉంటాయి అమెజాన్ అడుగులు, ఆరంభోత్సవాలు. సీఈవోగా తను వైదొలగుతున్నట్లు సిబ్బందికి ఆయన పంపిన ఈ–మెయిల్‌లో కూడా ఆ వినూత్నత కనిపించింది. ‘ఐ యామ్ ఎగ్జైటెడ్ టు అనౌన్స్..’ అన్నారు బెజోస్ తన మహాభినిష్క్రమణ గురించి! అవును మహాభినిష్క్రమణే. అమెజాన్ సీఈవోగా 1996 నుంచి ఉండి, వెళ్లిపోతున్నానని కాదు ఇలా అనడం. ఈ ఇరవై ఐదేళ్లలోనూ మానవాళి ఊహకే అందని అనేక క్రేజీ థింగ్స్‌ని తీసుకొచ్చింది అమెజాన్. కస్టమర్ రివ్యూస్, 1–క్లిక్, ఫాస్ట్ షిప్పింగ్, జస్ట్ వాకౌట్ షాపింగ్, క్లయిమేట్ ప్లెడ్జ్, కిండెల్, అలెక్సా, మార్కెట్ ప్లేస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ కంప్యూటింగ్, కెరీర్ చాయిస్.. ఒకటేమిటి! వంద. ఆ క్రేజీ థింగ్స్ ఇప్పుడు నార్మల్ అయిపోయాయని బెజోస్ అనుకోవడం! తను కూడా నార్మల్ అయ్యాననే ఆయన నమ్ముతున్నారు. (చదవండి: అమెజాన్ కొత్త సీఈఓ ప్రత్యేకతలేంటో తెలుసా?)
మొన్నటి వరకు ఫస్ట్ రిచెస్ట్‌లో ఉండేవారు బెజోస్. ఇప్పుడు రెండోస్థానంలోకి పడిపోయాక సీఈవోగా తప్పుకోవడం కాదు. అమెజాన్ తనను చూసి ‘ఆవలించిందని’ ఆయనకొక భావన కలిగింది. అంటే అమెజాన్ కనిపెట్టిన క్రేజీ థింగ్స్ అన్నీ పాతపడిబోయి, కస్టమర్స్‌కి బోర్ కొట్టడం కొత్త విషయం అయిందని! అందుకే పాత మనిషిగా ఆయన అదే ఆఫీసులో సీటు మార్చుకుంటున్నారు. ఇప్పుడు మీకొక సందేహం వస్తే కనుక.. ‘మరిప్పుడు వరల్డ్ రిచెస్ట్ ఎవరు?’ అనే అయుంటుంది. ఒకవేళ రాకుంటే కనుక ఆ రిచెస్ట్ ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఎలాన్ మస్క్. టెస్లా కార్ల కంపెనీ, స్పేస్ ఎక్స్ ఆయనవే. ఇక ఈ ఫస్ట్, సెకండ్ అనేవి బెజోస్‌కి లెక్కలోకే రావు. అవి కిందా పైనా అవుతుంటాయి. అమెజాన్‌ని మాత్రం కిందాపైనా కానివ్వకూడదని ఆయన బలంగా అనుకున్నట్లున్నారు. అందుకే 53 ఏళ్ల యాండీ జెస్సీని అమెజాన్‌కు కాబోయే సీఈవోగా ప్రకటించారు. జెస్సీ ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కి సీఈవోగా ఉన్నారు. బెజోస్‌ది పెద్ద వయసేమీ కాదు జెస్సీ కంటే నాలుగేళ్లు పెద్ద.
‘‘జెస్సీ ఒక అత్యద్భుతమైన ప్రతిభావంతుడు. అతడి సామర్థ్యంపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది’’ అని తన 10 లక్షల 30 వేల మంది ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్‌లో జెస్సీని ప్రశంసించారు బెజోస్. ఆయనలోని ప్రత్యేకత అదే.. ప్రతిభను గుర్తించడం, ప్రశంసించడం, ప్రతిభకు ఉన్నత పీఠం వేయడం. అమెజాన్ అనే ఈ అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ 25 ఏళ్ల నుంచి ఉంది అనే మాటకు ఉన్న ఒకే ఒక అర్థం.. బెజోస్ ఇరవై ఐదేళ్లుగా అమెజాన్‌ని ఉంచగలిగారు అని. పోటీ ఇప్పటికీ అమెజానే పెద్ద దివిటీ. ఆ దివిటీ వెలుగులోనే బెజోస్ ‘ఆవలింత’ను వీక్షించారు! ఆయన వీక్షించిన ఆవలింత నీరసం కాదు, నిస్సారం కాదు, నిస్తేజం కాదు, విసుగు కాదు, విరామం కోరుకోవడం కాదు. మరేంటి!
డియర్ స్టాఫ్ అనీ, డియర్ ఫ్రెండ్స్ అనీ, డియర్ కొలీగ్స్ అని తన మెయిల్‌ని మొదలుపెట్టలేదు జెఫ్ బెజోస్. ‘ఫెలో అమెజానియన్స్..’ అని ప్రారంభించారు! నాలుగో పేరాలోకి వచ్చేసరికి ‘ఆవలించారు’. ఈ మాటను ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోకండి. ‘మనమొక కొత్త ఆవిష్కరణ చేశాక, దాన్నంతా ఉపయోగించాక, అది పాతబడిపోతుంది. అప్పుడు కస్టమర్‌లు ఆవలిస్తారు. ఆ ఆవలింత మనకు గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. మనకు అంటే.. ఇన్వెంటర్‌లకు. వారి ఆవలింత నుంచి మళ్లీ ఆశ్చర్యంతో నోరు తెరిపించే ఆవిష్కరణకు మనం సిద్ధం కావాలి’ అని ఆ లెటర్‌లో రాశారు బెజోస్.
బెజోస్ ఆవలింతనొక వినూత్నమైన అర్థంగా తీసుకుని ఎవరికి వాళ్లం మన జీవితానికి అన్వయించుకోవాలి. ఒకటేదో చెబుతుంటాం. వినేవాళ్లు ఆవలిస్తారు. అప్పుడు మనం కొత్తగా చెప్పాల్సిన సమయం వచ్చేసిందని! ఒకటేదో చేస్తుంటాం. పాడిందే పాటా అన్నట్లు ఎవరో చూస్తారు. అప్పుడా పనిని కొత్తగా చేయాల్సిన తరుణం ఆసన్నం అయిందని. అనుభవం అనే మాటకు ఒక విధంగా గొడ్డలి పెట్టు ఆవలింత. అనుభవం ఏం చేస్తుంది? వచ్చిన పనినే, తెలిసిన పనినే తప్పుల్లేకుండా.. అంటే పర్‌ఫెక్ట్‌గా చేస్తుంది. కొత్తదనం లేకుండా పర్‌ఫెక్షన్ మాత్రమే ఉన్నది ఏదైనా త్వరగా బోరు కొట్టేస్తుంది. అప్పుడు మనకు కొత్తగా చేయాలనిపిస్తుంది. అందుకోసం కొత్తగా నేర్చుకోవాలనిపిస్తుంది. కష్టపడతాం. కనిపెడతాం. నిలబడతాం. బెజోస్.. మీరు గ్రేట్!
Comments
Please login to add a commentAdd a comment