నాన్న డ్యూటీతో బిజీగా ఉన్నప్పుడు సాయానికి ఎవరు వస్తారు? బాబాయో.. మావయ్యో... పెదనాన్నో... ఇప్పుడు ఈ అన్ని పోస్టులను తన పోలీస్ కమిషనర్ పోస్ట్‌తోపాటు నిర్వహిస్తున్నారు చెన్నై పోలీస్ బాస్ మహేష్ కుమార్ అగర్వాల్. నెల క్రితం చెన్నై హెడ్ కానిస్టేబుల్ మురుగన్ కోవిడ్ విధుల్లో మరణించినప్పుడు పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్న వారి కుటుంబాన్ని పరామర్శించడానికి కమిషనర్ మహేష్ కుమార్ వెళ్లారు. మురుగన్‌కు 17 ఏళ్ల ప్రియదర్శిని అనే కుమార్తె ఉంది. ఆ అమ్మాయి మహేష్‌తో ‘సార్... మా నాన్న చనిపోయాడని క్వార్టర్స్ ఖాళీ చేయించకండి. కొన్నాళ్లు ఉండనివ్వండి’ అని కోరింది. మహేష్ వెంటనే దానికి అంగీకరించారు. మాటల్లో ‘ఏం చదువుతున్నావు’ అని అడగగానే ప్రియదర్శిని కన్నీరు మున్నీరు అయ్యింది. తండ్రి మరణం వల్ల తను డిగ్రీ చదవగలననే నమ్మకం పోయిందని చెప్పింది. మహేష్ వెంటనే ఆ అమ్మాయి ఏం చదవాలనుకుంటున్నారో తెలుసుకొని నాలుగైదు రోజుల్లో కాలేజీ అప్లికేషన్ తెప్పించి తానే అడ్మిషన్ ఇప్పించారు.
అంతేకాదు ఆ మూడేళ్ల కోర్సుకు రూపాయి ఖర్చు లేకుండా ముందే మాఫీ చేయించారు. అప్పుడే ఆయనకు మిగిలిన సిబ్బంది కూడా గుర్తుకు వచ్చారు. ఇది పిల్లలు కాలేజీలలో అడ్మిషన్లు తీసుకునే సీజను. కాని తన కింద పని చేస్తున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు, కానిస్టేబుళ్లు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. పిల్లల పనులకు వారు సాయపడే స్థితిలో లేరు. అందువల్ల మహేష్ అగర్వాలే తన సిబ్బంది పిల్లలకు కావలసిన కాలేజీ అడ్మిషన్లు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన 54 మంది పోలీసు పిల్లల అడ్మిషన్లు పూర్తి చేశారు. ‘ఈ పని నా బాధ్యత. ఎందుకంటే వీరూ నా కుటుంబమే కదా’ అని చెప్పారాయన. అంతే కాదు ఇంకో 220 పోలీసు పిల్లలకు అవసరమైన అడ్మిషన్ల కోసం సిటీలోని కాలేజీలకు స్వయంగా రిక్వెస్ట్‌లు పంపారు. ఇంటి పెద్ద బాధ్యతగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు నిశ్చింతగా ఉంటారు. ఇప్పుడు చెన్నై పోలీసులు కూడా పిల్లల చదువు టెన్షన్ వదిలిపెట్టి మరింత శ్రద్ధగా కోవిడ్ డ్యూటీలు చేస్తున్నారు.
చదివిస్తున్న పోలీస్ అంకుల్
Published Wed, Aug 26 2020 12:02 AM | Last Updated on Wed, Aug 26 2020 12:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment